అసలు నోట్లు లక్ష ఇస్తే... రూ. 3 లక్షల నకిలీ నోట్లంటూ మోసం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:12 AM
అసలు నోట్లు లక్ష రూపాయలు తీసుకురండి... నకిలీ నోట్లు రూ. 3 లక్షలు ఇస్తాం. మీరు ఎంత తెచ్చినా దానికి తగ్గట్లుగా మా దగ్గర నకిలీ నోట్లు ఉన్నాయి. మీరు రూ. 10 లక్షలు తెస్తే రూ. 30 లక్షలు నకిలీ నోట్లు ఇస్తాం.. ఇలా అమాయకులకు వల వేసి సొమ్ము చేసుకుంటున్న ఒక ముఠాను భీమవరం వన్‌టౌన్ పోలీసులు వల వేసి చాకచక్యంగా పట్టుకున్నారు.
వల వేసి పట్టుకున్న వన్‌టౌన్ పోలీసులు
కారులో రూ. 2 కోట్ల డమ్మీ కరెన్సీ స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
భీమవరం క్రైం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): అసలు నోట్లు లక్ష రూపాయలు తీసుకురండి... నకిలీ నోట్లు రూ. 3 లక్షలు ఇస్తాం. మీరు ఎంత తెచ్చినా దానికి తగ్గట్లుగా మా దగ్గర నకిలీ నోట్లు ఉన్నాయి. మీరు రూ. 10 లక్షలు తెస్తే రూ. 30 లక్షలు నకిలీ నోట్లు ఇస్తాం.. ఇలా అమాయకులకు వల వేసి సొమ్ము చేసుకుంటున్న ఒక ముఠాను భీమవరం వన్‌టౌన్ పోలీసులు వల వేసి చాకచక్యంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగరాజు వివరాలు వెల్లడించారు. భీమవరం పట్టణానికి చెందిన కె. శ్రీజోగ శివశంకర్ దగ్గరకు కాకినాడ జిల్లా బిక్కవోలు మండలం రెడ్డికాపవరం గ్రామానికి చెందిన కొవ్వూరి గోపీచంద్రరెడ్డి, జంగారెడ్డిగూడెం రాముల చెరువు ప్రాంతానికి చెందిన వేముల మోహనసాయి వచ్చారు. అసలు నోట్లు ఇస్తే నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలికారు. అయితే జోగ శివశంకర్‌కు సంబంధించిన ఎం.వెంకటరెడ్డి అనే వ్యక్తికి గతంలో రూ. 5 లక్షలు తెస్తే రూ. 15 లక్షలు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిన ముఠాగా జోగ శివశంకర్ నిర్ధారించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు తెలియపరిచాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. తాను రూ. 3 లక్షలు తీసుకువస్తానని, రూ. 9 లక్షలు నకిలీ నోట్లు కావాలని చెప్పడంతో వారు తేదీ, సమయం, ప్రాంతాన్ని జోగ శివశంకర్‌కు తెలియపరిచారు. ఆ సమయంలో పోలీసులు కూడా వల పన్నారు. జోగ శివశంకర్ రూ. 3 లక్షలు తీసుకుని ఏఎంసీ మార్కెట్ యార్డు గెస్ట్‌హౌస్ సమీపానికి వెళ్ళేసరికి ఒక బ్రీజా కారులో గోపీచంద్రరెడ్డి, మోహనసాయిలు అక్కడకు వచ్చారు. పోలీసులు ఒక్కసారిగా వారి వద్దకు వెళ్ళి వారిని పట్టుకోగా వారి వద్ద రూ. 9 లక్షల నకిలీ డమ్మీ నోట్లు ఉన్నాయి. ఆ కట్టలపైన ఒరిజినల్ రూ. 500 నోట్లు 8 ఉన్నాయి. వెంటనే ఆ రూ. 9 లక్షలు స్వాధీనం చేసుకుని కారును తనిఖీ చేయగా, కారులో రూ. 2 కోట్లు విలువైన డమ్మీ కరెన్సీ నోట్లు రెండు బాక్సులు (400 బండిల్స్) దొరికాయి. ఆ నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్ అనే నేమ్‌తో ఉన్నాయి. వాటిని తనిఖీ చేయించగా పూర్తిగా డమ్మీ నోట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో రూ. 2 కోట్ల 9 లక్షల విలువైన డమ్మీ నోట్లతోపాటు ఒక బ్రీజా కారు, నకిలీ నంబరు ప్లేట్లు 2 స్వాధీనం చేసుకుని వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లుగా సీఐ తెలిపారు. అయితే వారికి డమ్మీ నోట్లు సరఫరా చేస్తున్న జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన బర్రె సుధీర్‌ను అరెస్ట్ చేయవలసి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ కిరణ్‌కుమార్, ఎస్‌వీవీఎస్ కృష్ణాజీ తదితరులు ఉన్నారు.