Share News

దొరికితే చుక్కలే..!

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:00 AM

మద్యం తాగి వాహనం నడిపితే ఇక చుక్కలు కనిపిస్తాయి. భారీగా జరిమానాలు చెల్లించాల్సిందే. అది కూడా కోర్టులకు వెళ్లి న్యాయాధికారి ఎంత జరిమానా విధిస్తే అంత చెల్లించక తప్పదు.

దొరికితే చుక్కలే..!

మద్యం తాగి వాహనం నడిపితే

రూ.10 వేల వరకు జరిమానా

ఉన్నతాధికారుల ప్రత్యేక ఆదేశాలు

ఎక్కడికక్కడ డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు

భీమవరం క్రైం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): మద్యం తాగి వాహనం నడిపితే ఇక చుక్కలు కనిపిస్తాయి. భారీగా జరిమానాలు చెల్లించాల్సిందే. అది కూడా కోర్టులకు వెళ్లి న్యాయాధికారి ఎంత జరిమానా విధిస్తే అంత చెల్లించక తప్పదు. ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలామంది మృత్యువాత పడుతున్నారు. దానివల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పోలీస్‌, రవాణా శాఖ అధికారులు ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాత్రి 9 గంటల తర్వాత జిల్లాలో పట్టణ, పరిసర ప్రాంతాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎక్కడికక్కడ పోలీసు శాఖ పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు.

ఏడాదిలో 716 కేసులు

2025 సంవత్సరంలో పోలీసు శాఖ జిల్లాలో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహించి 716 కేసులు నమోదు చేశారు. అలాగే ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 150 కేసుల వరకు నమోదు చేశారు. ఈ కేసుల్లో మందుబాబులు కోర్టుకు వెళ్లి న్యాయాధికారి విధించిన జరిమానా చెల్లించారు. అలాగే చాలామంది మద్యం సేవించి వాహనాలు నడిపినా కూడా పోలీసులకు పట్టుబడకుండా అడ్డదారుల్లో వెళ్లిపోతున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే అనర్థం వారికే నష్టమని తెలియడం లేదు. దాంతోపాటు ఎక్కువ శాతం కారులు, భారీ వాహనాలు నడిపేవారు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లుగా తెలుస్తున్నది. పోలీసులు పట్టణ పరిధిలో ద్విచక్ర వాహనాలపై దృష్టి పెడుతున్నారే తప్ప భారీ వాహనాలు, కార్లపై దృష్టి పెట్టకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కోర్టుల్లో న్యాయాధికారి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జరిమానా విధిస్తున్నారు. తీవ్రతను బట్టి రూ. 2 వేల నుంచి రూ. 10 వేలు వరకు విధిస్తున్నారు. అయినా ఎవరిలోనూ మార్పు రావడం లేదు. పోలీసు శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకుని మద్యం సేవించి వాహ నాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం..

–జి.కాళీచరణ్‌, భీమవరం టూటౌన్‌ సీఐ

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం.ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాం. కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం.అయినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో అధికంగా మద్యం సేవించినట్లుగా నిర్ధారణ అయితే వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలని అవగాహన కల్పిస్తున్నాం.

ఒక్కొక్కరికి రూ.10 వేలు ఫైన్‌

నరసాపురంలో జరిమానా విధించిన కోర్టు

నరసాపురం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి కోర్టు రూ.10 వేలు జరిమానా విధిం చింది. ఈనెల 1వ తేదీన పాలకొల్లు రోడ్డులోని మత్స్యపురి బ్రిడ్జి సమీపంలో నరసాపురం పట్టణ సీఐ బి.యాదగిరి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించగా రావులపాలేనికి చెందిన పెచ్చెట్టి రవితేజ, నరసా పురం పట్టణానికి చెందిన సుందర్‌ బాబులు మద్యం సేవించి బైక్‌ నడుపుతున్నట్టుగా గుర్తించారు. వీరిని మంగళవారం నరసాపురం స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన మేజిస్టేట్‌ నింది తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారు. సీఐ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. పట్టణ పరిధిలో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని నిబంధనలు అతి క్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Mar 04 , 2026 | 12:00 AM