మూడో కన్ను చూస్తోంది..
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:23 AM
జిల్లాలో ఏదో మూల అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.
డ్రోన్ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా
అసాంఘిక కార్యకలాపాలకు చెక్
ఆకతాయిలకు అడ్డుకట్ట
జిల్లాలో పటిష్ట భద్రత
నాలుగు నెలల క్రితం భీమవరం రెండో పట్టణంలోని ఒక బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టి ఆ బాలిక రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లుగా గుర్తించి వెంటనే కేసును ఛేదించారు. బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఐదు నెలల క్రితం భీమవరం టూ టౌన్ పరిధిలో బైపాస్ రోడ్డులో ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు డ్రోన్ కెమెరాను ఉపయోగించారు. డ్రోన్ ద్వారా ఖచ్చితమైన ప్రదేశం గుర్తించడంతో అక్కడకు వెళ్లి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
భీమవరం క్రైం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి):ఇలా జిల్లాలో ఏదో మూల అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వాటిని అరికట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కోడిపందేలు, పేకాట, జూదాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగంగా మద్యం సేవించడం.. వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు డ్రోన్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. డ్రోన్ కెమెరాల ద్వారా ఏరియల్ వ్యూ తీసుకుని ఎక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరిగినా నిముషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్టు చేస్తున్నారు.
ఊరికి దూరంగా ఉండే ఖాళీ స్థలాలు పేకాట, కోడి పందేలకు స్థావరాలుగా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో మద్యం, గంజాయి వంటివి సేవిస్తుంటారు. అలాంటి స్థావరాలను కని పెట్టాలంటే పోలీసులకు గతంలో ఇబ్బందికరంగా ఉండేది. డ్రోన్ కెమెరాలు రావడంతో ఎక్కడ ఏ మూల దాక్కున్నా దొంగలు దొరి కేస్తున్నారు. జిల్లాలో మూడు కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి తెలియకుండానే డ్రోన్ కెమెరాలు నిఘా పెట్టి వారిని ఫొటోలు, వీడియోలు తీయడం, వాటిని పోలీసు శాఖ స్టేషన్లలో తనిఖీలు చేసుకుని ఆ ప్రాంతాలకు వెళ్లి వారిని అరెస్ట్ చేస్తున్నారు.
గతేడాది 20 కేసులు
2025 జనవరి నుంచి 2026 జనవరి వరకు అసాంఘిక కార్యకలాపాలపై 20 కేసుల వరకు నమోదు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘాపెట్టి వాటి ద్వారా 20 కేసులు నమోదు చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూడు డ్రోన్ కెమెరాలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నాయి. జిల్లాలోని 25 పోలీస్ స్టేషన్లలో ఏ పోలీస్ స్టేషన్‌కు అవసరం వచ్చినా అక్కడకు డ్రోన్ కెమెరాను పంపిస్తారు. ఆ కెమెరా ద్వారా నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల కొన్ని కేసులు సులువుగా పరిష్కారమయ్యాయని పోలీసులే చెబుతున్నారు. డ్రోన్ కెమెరాల ఉపయోగం చాలా వరకు ఉందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంత అభివృద్ధి చెందుతుందో ఆ విధంగానే డ్రోన్ కెమెరాల ఉపయోగం కూడా అంతగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద అసాంఘిక కార్యకలాపాలు, జూదాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేపట్టిన ప్రయోగం చాలావరకు సక్సెస్ అయ్యింది. కెమెరా మూడో కన్నుపై ఆకతాయిలు హడలిపోతున్నారు.
నేరాల అదుపునకు డ్రోన్ కెమెరాల సహకారం
డ్రోన్ కెమెరాల వల్ల అసాంఘిక కార్యకలాపాలు, జూదాలకు చాలా వరకు అడ్డుకట్ట వేయగలుగుతున్నాం. ఎక్కడైనా జూదాలు, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగంగా మద్యం సేవించడం వంటివి జరుగుతున్నాయని సమాచా రం ఉంటే ముందుగా డ్రోన్ కెమెరాలను పంపించి ఆ పరిసరా లను తెలుసుకుని అక్కడకు వెళ్లి వారిని అరెస్ట్ చేస్తున్నాం. ప్రస్తు తం జిల్లాలో మూడే ఉన్నాయి. త్వరలోనే మరిన్ని అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
– జి.కాళీచరణ్, భీమవరం టూటౌన్ సీఐ