ఆర్టీసీకి సిబ్బంది కొరత
ABN , Publish Date - May 16 , 2026 | 12:41 AM
ఏపీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఉద్యోగుల పదవీ విరమణ, పదోన్నతులతో ఖాళీ అవుతున్న పోస్టుల్లో కొత్తగా భర్తీలు జరగక పోవడంతో బస్సు సర్వీసులు నడిపేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు.
సతమతం అవుతున్న అఽఽఽధికారులు
కండక్టర్ల ఇబ్బందే ఎక్కువ
భీమవరం టౌన్, మే 15(ఆంధ్రజ్యోతి):ఏపీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఉద్యోగుల పదవీ విరమణ, పదోన్నతులతో ఖాళీ అవుతున్న పోస్టుల్లో కొత్తగా భర్తీలు జరగక పోవడంతో బస్సు సర్వీసులు నడిపేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ‘మహిళా శక్తి’ పేరిట ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. అప్పటి నుంచి బస్సుల్లో రద్దీ పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం దాటేసింది. ఉన్న బస్సులతో సర్వీసులను నడుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల్లో ఎక్కు వగా కండక్టరు పోస్టులు ఖాళీగా వున్నాయి. మొత్తం 556 మందికి 394 మంది మాత్రమే వున్నారు. ఇటీవల పదోన్నతులు, పదవీ విరమణల వల్ల 162 పోస్టులు ఖాళీ అయ్యాయి. వీరి కొరతను అధిగమించేందుకు వీలుగా టిమ్‌లకు ఉపయోగించుకునే డ్రైవర్లనే కండక్టర్లుగా పంపిస్తున్నారు. గతంలో డ్రైవర్ల ఇష్టపూర్వకంగా వారిని నుంచి పత్రాన్ని తీసుకుని పంపేవారు. మహిళా శక్తి వచ్చిన తర్వాత మరింత మందిని ఉపయోగిస్తున్నా సర్వీసుల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతోంది. డ్రెవర్ల విషయానికి వస్తే ఈ నాలుగు డిపోలలో 505 మంది అవసరం కాగా, 392 మంది వున్నారు. ఇంకా 113 పోస్టులు ఖాళీగా వున్నాయి. డ్రైవర్ల ఖాళీలపై అధికారులు ఎప్పటికప్పుడు ఔట్స్ సోర్సింగ్, ఆన్‌కాల్డ్ డ్రైవర్లను తీసుకుని వారితో బస్సులను నడుపుతున్నారు. మొత్తంగా ఈ పోస్టులను భర్తీ చేసి సర్వీసులకు ఆటంకం లేకుండా, సిబ్బందిపై ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. 15 లక్షల కిలోమీటర్లు తిరిగి బస్సులను స్ర్కాప్ పేరుతో పక్కన పెడుతున్నారు. వాటి స్థానంలో కొత్తవి రాకపోవటంతో పలు రూట్లలో సర్వీసులకు ఆటంకం కలుగుతోంది.
జిల్లాలో ఆర్టీసీ బస్సులు
జిల్లాలోని నాలుగు డిపోల్లో కలిపి ప్రస్తుతం 283 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇందులో భీమవరం డిపోలో 84, తాడేపల్లిగూడెంలో 63, నరసాపురంలో 67, తణుకు డిపోలో 69 బస్సులు ఉన్నాయి. 15 లక్ష కిలోమీటర్లు పూర్లయిన బస్సులను స్ర్కాప్ పేరుతో పక్కన పెట్టేస్తారు. వీటిస్థానంలో కొత్తబస్సులు రాకపోవడంతో సర్వీసులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంటోంది. ప్రభుత్వం కొత్తబస్సులను కేటాయించకపోతే రానున్న రోజుల్లో సిబ్బంది కొరతతోపాటు బస్సులు కొరత ఏర్పడి మరింత ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.
డిపోల వారీగా డ్రైవర్లు.. కండక్టర్ల వివరాలు
డిపో ఉండాల్సింది ఉన్నది ఖాళీలు ఉండాల్సింది ఉన్నది ఖాళీలు
భీమవరం 167 119 48 156 112 44
నరసాపురం 122 88 34 134 85 49
టిపిగూడెం 100 83 17 122 87 35
తణుకు 116 102 14 144 110 34
మొత్తం 505 392 113 556 394 162