Share News

పశ్చిమకు జలామృతం

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:45 AM

జిల్లాలో ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరందించే అమృత్‌ 2.0 పథకం కింద రూ.670 కోట్లతో పనులు చేపట్టారు.

పశ్చిమకు జలామృతం

2028 నాటికి ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు

జిల్లాకు రూ.670 కోట్లు మంజూరు

ఇప్పటికే పలుచోట్ల పనులు మొదలు

రేపు నరసాపురంలో ప్రారంభం

ఆకివీడుకు రూ.73.08 కోట్లు

ఆకివీడు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి):జిల్లాలో ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరందించే అమృత్‌ 2.0 పథకం కింద రూ.670 కోట్లతో పనులు చేపట్టారు. 2028 జనవరి నాటికి పూర్తిస్థాయిలో మంచినీటి సరఫరా జరుగుతుందని, ఇప్పటి వరకూ 14 శాతం పనులు పూర్తియ్యినట్లు అధికారులు చెబుతున్నారు. నీటిశుద్ధి కేంద్రాలు, గ్రిడ్‌ లైన్ల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుంది. భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఆకివీడులో ఈ పథకం కింద పనులు జరుగుతున్నాయి. వేసవితోపాటు మిగతా రోజుల్లో ఆకివీడుకు మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు భీమవరం నుంచి 21 కిలోమీటర్ల పైపులైను వేస్తున్నారు. ఆకివీడుకు తాగునీటి సమస్య వచ్చినప్పుడు ఈ పైపులైన్‌ ద్వారా పంపిస్తారు. ఆకివీడుకు ఈ పథకం ద్వారా రూ.73.08 కోట్లు మంజూరయ్యాయి. స్థానిక వారపు సంత(సంత మార్కెట్‌) ప్రాంతంలో 8.5 ఎంసీడీ ఫిల్టరేషన్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నిర్మాణానికి పనులు చేస్తున్నారు. ఆకివీడు సమతానగర్‌, శాంతినగర్‌, వారపు సంత దగ్గర వాటర్‌ ట్యాంకులు(ఓహెచ్‌ఎస్‌ఆర్‌) శిధిలావస్థకు చేరాయి. ప్రస్తుతానికి తహసీల్దార్‌ కార్యాలయం, దొరగారి చెరువు, భుజబలరాయుడు చెరువుల దగ్గర వాటర్‌ ట్యాంకులు వినియోగిస్తున్నారు. పట్టణ పరిధిలో నగర పంచాయతీ కార్యాలయం, శాంతినగర్‌, సమతానగర్‌, ధర్మాపురంప్రాంతాలలో వాటర్‌ ట్యాంకులు నిర్మాణం పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ధర్మాపురంలో వాటర్‌ ట్యాంకు, పైపులైను పనులు జరుగుతున్నాయి. పట్టణంలో ఏళ్ల తరబడి పైపులైన్లు వేయడంతో పాడైపోయి తాగు నీరు కలుషితమవుతుంది. వాటిని తొలగించి హెచ్‌పీపీ పైపులు 26 కిలోమీటర్ల మేర వేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. భుజబలరాయుడు చెరువు దగ్గర ఆఫ్‌టెక్‌ వెల్‌ నిర్మాణం చేస్తుండడంతో మురుగునీటిని అరికడతారు. ఆకివీడులో 6,500 కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. పైపులైన్లు మార్చడంతో కొత్తగా 4,800 కుళాయి కనెక్షన్లు అవసరం పడుతుంది. డిపాజిట్‌ తీసుకొని కుళాయి కనెక్షన్లు ఇస్తారు. పరిమళ లాకుల నుంచి 30 కోట్లతో పైపులైన్‌ పనులు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతుంది. ఏళ్ల తరబడి ఉన్న తాగునీటి సమస్య 2028 నాటికి ఆకివీడుతోపాటు జిల్లాకు తొలగుతుంది.

పనులు వేగవంతం

అమృత్‌ 2.0 పథకం ద్వారా జిల్లాలో 2028 జనవరికి పనులు పూర్తికావడంతో స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. ఈ పథకం ద్వారా జిల్లాకు రూ.670 కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పూర్తికావడంతో హైదరాబాద్‌కు చెందిన ఎన్సీసీ లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. ఇప్పటికే ఆకివీడులో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నరసాపురంలో గతంలో రెండు ఓహెచ్‌ఆర్‌లు నిర్మించారు. అవి చివరి దశలో ఉన్నాయి. వాటితోపాటు కొత్తగా మరో ఓహెచ్‌ఆర్‌ను నిర్మిస్తున్నాం. 40 కిలోమీటర్ల మేర కొత్త పైప్‌లైన్‌ వేస్తాం. పాతది తొలగిస్తాం. పనులు పూర్తయితే ప్రతి ఇంటికి పుష్కలంగా నీరందనుంది.

– ఆర్‌.విజయ్‌, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ

నరసాపురంలో 40 మీటర్ల మేర కొత్త పైపులైన్ల నిర్మాణం

నరసాపురం, ఆగస్టు 12(ఆంద్రజ్యోతి): అధికారంలోకి వస్తే పట్టణంలోని తాగునీటి సమస్య పరిష్కారంతోపాటు కలుషితం లేని నీటిని పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ త్వరలో నేరవేరనుంది. ఆమృత్‌ 2.0 పథకంలో భాగంగా రూ.125 కోట్లతో 40 కిలోమీటర్ల మేర పట్టణంలో కొత్త పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. 25 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు భారీ ఓహెచ్‌ఆర్‌ లు, రోజుకు కోటి లీటర్ల శుద్ది చేసే వాటర్‌ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. గతంలో వేసిన పైప్‌లైన్లను పూర్తిగా తొలగించనున్నారు. పట్ట ణంలో చేపట్టే ఈ ప్రాజెక్టు పనుల్ని శుక్రవారం విప్‌ నాయకర్‌ శంకుస్థాపన చేయనున్నారు. రెండేళ్లలో పనులు పూర్తి కానున్నాయి. జిల్లాలో మరే పురపాలక సంఘానికి లేని ఆతి పెద్ద మంచినీటి చెరువు నరసాపురంలో ఉంది. 1969లో ఈ చెరువును తవ్వారు. అప్పుడే పైప్‌ లైన్లు వేశారు. తర్వాత పట్టణ విస్తీర్ణం పెరగ డంతో శివారు ప్రాంతాలక కొత్తగా పైప్‌లైన్లు వేశారు. పాత పైప్‌లైన్ల స్థానంలో కొత్తవి వేయకపోవడంతో కొన్ని వార్డులకు పుష్కలం గా నీరు రాని పరిస్థితి ఉంది. నీటి ప్రవాహం ఒత్తిడి వల్ల తరచూ పైప్‌లు పగిలిపోవడం, కుళాయిల్లో మురుగునీరు రావడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన కూటమి నేతలంతా ఆధికారంలోకి వస్తే ప్రజ లకు శుద్ధి జలాలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా జిల్లాలోని అన్ని పట్టణాలకు ఈ నీటిని అందించేందుకు అమృ త్‌ స్కీమ్‌కు పచ్చజెండా ఊపింది. ఇప్పటి వరకు కాల్వలోని నీటిని చెరువుల్లోకి నింపి వాటిని శుద్ధి చేసి సరఫరా చేసేవారు. ప్రస్తు తం నిడదవోలు పంట కాల్వ పూర్తిగా కలుషి తం కావడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.

ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులో నేరుగా నరసాపురం వరకు పైపులైన్‌ రానుంది. దీని ద్వారా వచ్చే నీటిని శుద్ధి చేసి ఓహెచ్‌ఆర్‌లకు పంపనున్నారు. ప్రస్తుతం పట్టణంలో మూడు ఓహెచ్‌ఆర్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా పీచు పాలెం, చినమామిడిపల్లి, రైతుబజార్‌ సమీపం లో కొత్త మరో ఓహెచ్‌ఆర్‌ను నిర్మిస్తు న్నారు. ఈ మూడు ఓహెచ్‌ఆర్‌ల సామర్థ్యం 25 లక్షల లీటర్లు. ఇది కాకుండా రెండు పూటలా నీరిం చేందుకు వీలుగా రోజుకు కోటి లీటర్ల శుద్ధి చేసే ప్లాంట్‌ను నిర్మించనున్నారు.

Updated Date - Aug 13 , 2026 | 12:45 AM