చేపల చెరువులకే నీరట..!
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:29 AM
తాగునీటి కోసం ఇంగిలి పాకలంక గ్రామస్థులు గురువారం రహదారిపైకి వచ్చి ఆందోళనకు దిగారు.
ఇంగిలిపాకలంక గ్రామస్థుల ఆగ్రహం
తాగునీటి కోసం రోడ్డెక్కి ఆందోళన
ఎమ్మెల్యే కామినేని చొరవతో సమస్య పరిష్కారం
మండవల్లి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి):తాగునీటి కోసం ఇంగిలి పాకలంక గ్రామస్థులు గురువారం రహదారిపైకి వచ్చి ఆందోళనకు దిగారు. గ్రామానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న చెరువు పూర్తిగా ఎండిపోవడంతో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గ్రామ స్థులు తాగునీటి అవసరాల కోసం మోటూరు ఛానెల్ ద్వారా చెరువు లోకి నీటిని మళ్లించే ప్రయత్నం చేయగా.. ఆ నీరు చేపల చెరువులకు అవసరమంటూ రైతు తుమ్మారెడ్డి శ్రీనివాస్ అడ్డుకున్నారని, నీటి ప్రవాహానికి సంబంధించిన డ్రాపులను మూసివేయడంతో దిగువ గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని వారు వాపోయారు. తాగునీటి కోసం ప్రశ్నించిన మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామి నేని శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక వ్యక్తి తన స్వప్రయోజనం కోసం దిగువ గ్రామాలకు రెండు రోజులుపాటు తాగు నీరు అందకుండా చేయడంపై ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయా లని ఎస్పీకి ఫోన్‌లో ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం నీటి సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో దిగువ గ్రామాలకు తాగునీరు అందేలా మూసి వేసిన డ్రాపులను ఎత్తివేశారు. నీరు దిగువ ప్రాంతాలకు విడుదల కావ డంతో గ్రామస్థులు నిరసన విరమించారు. నందివాడ, మండవల్లి మండలాల రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.