చెప్పినవన్నీ.. జరగవు
ABN , Publish Date - May 10 , 2026 | 12:23 AM
జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశంలో తీసుకున్న పలు తీర్మానాలు ఆచరణలో బుట్టదాఖల వుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారులు సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకుని ఆపై అమలు చేయక పోవడం విమర్శలకు తావిస్తోంది.
డీఆర్సీ తీర్మానాలు బుట్టదాఖలు
కానరాని పారిశుధ్యంపై స్పెషల్‌డ్రైవ్
యువకులకు ఎల్‌ఎల్‌ఆర్ మేళాలు లేవు
పట్టించుకోని అధికారగణం
ఇప్పుడు మేల్కొనకపోతే వర్షాకాలంలో పారిశుధ్యం అధ్వానమే ..
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశంలో తీసుకున్న పలు తీర్మానాలు ఆచరణలో బుట్టదాఖల వుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారులు సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకుని ఆపై అమలు చేయక పోవడం విమర్శలకు తావిస్తోంది. డీఆర్సీ నిర్వహణలోను ప్రభుత్వం సంస్కరణలు చేసింది. మూడు నెలలు సమీక్ష వ్యవధిని రెండు నెలలకు జరిపి.. నామినేటేడ్ పదవుల్లో ఉన్న వారికి చోటు కల్పించింది. తీరా చెప్పినవన్నీ... జరగవన్న రీతిలో అధికారులు ఉన్నారు. ఇలాగైతే ప్రజా సమస్యలు ఎప్పటికి తీరతాయన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ప్రజా సమస్యలపై చర్చించి.. వాటిని పరిష్కరించే వేదికగా డీఆర్సీ సమావేశం నిలవాల్సి ఉంది. జిల్లాలో పలు సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాల అమ లుకు అధికారులు మాత్రం ఇంకా బద్ధకం వీడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధు లకు ప్రొటోకాల్ పాటించడం లేదని కొంతకాలం.. కొంద రు అధికారులు మా ఫోన్లు ఎత్తడం లేదని కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగా సమావేశాల్లోనే ప్రస్తావించా రు. ఏప్రిల్ 4న జరిగిన డీఆర్సీలో ఆమోదించిన రెండు కీలక తీర్మానాలను ఇప్పటికీ అమలు చేయక పోవడంపై విమర్శ లు వ్యక్తమవుతున్నాయి.
పారిశుధ్య పనులకు స్పెషల్ డ్రైవ్ ఏదీ..?
రానున్న వర్షాకాలానికి ముందే పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులకు యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. జిల్లా అంతటా మే నుంచి పారిశుధ్య వారోత్సవాలు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ డీఆర్సీ సమావేశంలోనే నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు ఏ ప్రాంతంలోను దీనిపై పట్టించుకునే వారేలేరు. ఏలూరు కార్పొరేషన్‌లో రోజుకు 100 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతుంటుంది. దీన్ని పరిష్కరించే మేనేజ్‌మెంట్ అంతంత మాత్రంగా ఉంది. నగరంలో ఏ రోడ్డు చూసిన మట్టి గుట్టలు, బిల్డింగ్ మెటీరియల్ వ్యర్థాలతో అధ్వా నంగా దర్శనమిస్తున్నాయి. జాలిపూడి డ్రెయిన్, దెయ్యా ల తూము, వన్‌టౌన్ పలు మేజర్ డ్రెయిన్లు వ్యర్థాలతో పూడుకుపోతున్నాయి. వీటిల్లో ప్రత్యేక శ్రద్ధతో సిల్టుతీత పనులు ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. ఇటీవలే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా రాయపూడి లక్ష్మీనారాయణ నియామకం సంవత్సరన్నర తర్వాత జరిగింది. నూజి వీడు, జంగారెడ్డిగూడెం పురాలతో పాటు చింతలపూడి నగర పంచాయతీల్లోను పారిశుధ్యం దిగజారింది. జిలా ్లలో పట్టణాల్లో మార్చిలో పారిశుధ్యం, సాలిడ్ వేస్ట్ వ్యర్థాల నిర్వహణ, టాయిలెట్లు, ఇతర అంశాలపై ఐవీఆర్‌ఎస్ సర్వే చేయగా 67 శాతం బాగుందని, 37 శాతం అధ్వానంగా ఉందని తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పోల్చితే ఏలూరు 17వ స్థానంలో నిలిచింది. ఇక పంచాయతీల పరంగా 27 మండలాలు 547 పంచాయతీల్లో ఐవీఆర్‌ఎస్ సర్వే చేయగా 66.55 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, 33.5 శాతం బాగా లేదని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. కనీసం 80 శాతానికి సం తృప్తి స్థాయిని తీసుకెళ్లాలని డీఆర్సీలో తీర్మానిం చారు. స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కింద పారిశుధ్య పనులకు అన్ని పంచాయతీల్లో చెత్త సేకరణకు ప్రభుత్వం రిక్షాలు కొనుగోలు చేసి అందించింది. ప్రధానంగా ఈ నెలాఖరు లోగా చెత్త శుద్ధి, డ్రెయిన్లు పరిశుభ్రతకు సిల్టుతీత పనులు చేపట్టకపోతే జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసే సమయంలో పారిశుధ్య పనులు చేపట్టినా ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఈ దిశగా అధికార యంత్రాంగం ఇప్పటికైనా కదిలితే 20 రోజుల కాలంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయి.
ఎల్‌ఆర్‌ఆర్ మేళా ఎప్పుడు ?
జిల్లాలో మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలను యువత, మైనర్లు నడపడం వల్ల ఇటీవల ద్వారకా తిరుమల, పెదవేగి, దెందులూరుల్లో ఒకే ప్రమాదంలో కనీసం ఇద్దర్ని నుంచి ముగ్గురు వరకు అక్కడక్కడే దుర్మరణం పాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం కేంద్రంలోను ఎల్‌ఎల్‌ఆర్ మేళాలను నిర్వహించి, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించా లని సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరు పట్టించుకోపోవడం గమనార్హం. ఎల్‌ఎల్‌ఆర్ మేళాలు నిర్వహించడానికి న్యూఢిల్లీ నుంచి ఎన్‌ఐసీ సంస్థ జిల్లా ఉప రవాణాశాఖకు సంబంధించి సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు ఇక ముందుడగు పడలేదు. దీంతో అవగాహన కార్యక్రమం అటకెక్కింది. కీలకమైన రెండు తీర్మానాలు అమలు దిశగా ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మేల్కొవాలన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ రెండు కార్యక్రమాలు పెద్దగా ఖర్చుతో కూడిన పనులు కానేకావు. బడ్జెట్‌కు లోబడి, ఆయా శాఖల యాక్షన్ ప్లాన్‌లోనే ఇవి భాగంగా ఉండడం గమనార్హం.