ప్లాస్టిక్ వ్యర్థాలతో జీవావరణానికి తీవ్ర ముప్పు
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:15 AM
ప్లాస్టిక్ వ్యర్థాలతో జీవావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడడంతోపాటు మానవ మనుగడకు పెను ప్రమాదమని జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు అన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు
ఏలూరుసిటీ, జూన్ 23 (ఆంధ్ర జ్యోతి): ప్లాస్టిక్ వ్యర్థాలతో జీవావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడడంతోపాటు మానవ మనుగడకు పెను ప్రమాదమని జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలు–2016ను అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషిచేయాలన్నారు. ఘనవ్యర్థాల నిర్వహణ నియమాలు–2026లోని నియమాలను అనుసరించి బల్క్‌వేస్ట్ ఉత్పత్తిదారులను గుర్తించాలని, తడి, పొడి వ్యర్థాలను గృహస్థాయిలోనే వేరుచేయడం, సక్రమంగా రవాణా చేయడం, తడి చెత్త నుంచి వర్మీకంపోస్ట్ తయారు చేయడం విధిగా జరగేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో నూజివీడు డీఎల్‌పీవో ఎస్.సుందరి, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ జి.ప్రసంగిరాజు ప్రసంగించగా శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ జీఆర్ మనోజ్, జీడీ శ్రీనివాసరావు, వైయూవీ సూర్యకుమార్, ఎస్‌బీఎం కన్సల్టెంట్‌లు సురేష్, ప్రేమ్‌జిత్, ఉష శిక్షణ తరగతులను నిర్వహించారు.