పరిహాసం చేయొద్దు
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:31 AM
పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని నిర్వాసితులకు వ్యక్తిగత పునరా వాసం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం ఇచ్చి వారు కోరుకున్నట్టు ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలి. లేదం టే వారికి ఇంటి స్థలం, పరిహారం ఏది కోరు కుంటే అది ప్రభుత్వం చెల్లించాలి. కాని,
కుక్కునూరు – వేలేరుపాడు మండలాల్లో 800 మందికి పైగా బాధితులు
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పోలవరం నిర్వాసితులు
పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూరు లెవెల్‌లో ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని నిర్వాసితులకు 2027 జూలై నాటికి అన్ని రకాల ప్యాకేజీలు పూర్తిగా అందజేస్తాం. అప్పుడే వారిని పునరావాస కాలనీలకు తరలించి ప్రాజెక్టు తొలిదశలో 117 టీఎంసీల నీటిని నిల్వ చేస్తాం.
– జనవరి 10న పోలవరంలో సీఎం చంద్రబాబు ప్రకటన
క్షేత్రస్థాయిలో వందలాది మందికి న్యాయం జరగడం లేదు. ఇక్కడే పుట్టి పెరిగిన మాకు పరిహారం అందించడంలో అన్యాయం జరుగుతోంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
– నిర్వాసితుల ఆవేదన
(కుక్కునూరు–ఆంధ్రజ్యోతి):
పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని నిర్వాసితులకు వ్యక్తిగత పునరా వాసం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం ఇచ్చి వారు కోరుకున్నట్టు ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలి. లేదం టే వారికి ఇంటి స్థలం, పరిహారం ఏది కోరు కుంటే అది ప్రభుత్వం చెల్లించాలి. కాని, అన్ని అర్హతలు ఉన్నప్పటికి ప్యాకేజీ మంజూరు కాక వందలాది మంది నిర్వాసితులు ‘మాకు పరి హారం మంజూరు చేయండి’ అంటూ సంబంధి త కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగు తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వచ్చే ఏడాదిలోగా 41.15 కాంటూరు లెవెల్ గ్రామాల నిర్వాసితులను తరలించడానికి అధికారులు పున రావాస ప్రక్రియ వేగవంతం చేశారు.
ఆధారాలు ఉన్నా.. గుర్తింపు లేదు
ముంపునకు గురవుతున్న గ్రామాల్లో 2017లో ప్రభుత్వం నిర్వాసితులను గుర్తించడానికి ఇంటిం టికి సర్వే చేసి అర్హులను గుర్తించి జాబితా విడుదల చేసింది. సర్వే సమయంలో అనర్హులు జాబితాలో చేరారని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అధికారులు వారి వివరాలను వాట్సప్ మెసేజ్ ద్వారా తెలపాలని కోరారు. ఈ క్రమంలో కొన్ని తప్పిదాల కారణంగా స్థానికంగా వున్న కొందరి వారి పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. స్థానికంగా అన్ని ఆధారాలు ఉన్నప్పటికి బయట ఉపాధి కోసం వెళ్లారని ఆరోపణలు రావడంతో వారి పేర్లు జాబితా నుంచి తొలగించారు. ప్రభుత్వం 2014 నుంచి 2017 జూలై వరకు స్థానికంగా ఆధార్, రేషన్, ఓటు గుర్తింపు ఉపాధి హామీ కార్డులు ఉంటే వారిని పునరా వాస పరిహారానికి అర్హులను పరిగణించాలన్న నిబంధన ఉంది. కాని, వాట్సప్ మెసేజ్ ద్వారా జరిగిన తప్పిదాలతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ముంపు గ్రామాల్లోని 800 మం దికి పైగా నిర్వాసితుల పేర్లు జాబితాలో గల్లంతై నట్లు సమాచారం. ఎనిమిదేళ్లుగా తమను అర్హు లుగా గుర్తించి జాబితాలో చేర్చాలంటూ కేఆర్ పురం ఐటీడీఏ, ధవళేశ్వరం ప్రాజెక్టు అడ్మినిస్ర్టేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
కోర్టు తీర్పు ఇచ్చినా దక్కని పరిహారం
కుక్కునూరుకు చెందిన పలువురు నిర్వాసితు లు తమకు అన్ని అర్హతలున్నా పరిహారం జాబితాలో తొలగించారని కోర్టుకు ఎక్కారు. నిర్వాసితులకు వున్న అర్హతను చూసి కోర్టు సైతం వారికి పరిహారం ఇవ్వడానికి అర్హులని తీర్పు ఇచ్చింది. కానీ అధికారులు ప్రస్తుత జాబితాలోని నిర్వాసితులకు మాత్రమే పరిహారం అందిస్తోంది. రెండో జాబితా రూపొందించకపోవడంతో కోర్టు తీర్పు ఇచ్చిన వారికి పరిహారం దక్కడం లేదు.
ఫిర్యాదుల సైట్ క్లోజ్
నిర్వాసితులు కార్యాలయాల చుట్టూ తిరుగు తుండడంతో ప్రభుత్వం స్పందించి ఆర్‌అండ్ ఆర్ ఫిర్యాదుల కోసం ఆన్‌లైన్‌లో ఒక సైట్‌ను ఏర్పాటు చేసింది. నిర్వాసితులు తమ అర్హతల తో సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అర్హులను చేస్తామని ప్రకటించింది. వందల మంది సైట్‌లో దరఖాస్తు చేశారు. అది ఏ దశలో ఉన్నది కనిపించేది. ఏడాది క్రితం సైట్‌ను మూసివేయడంతో నిర్వాసితులకు అర్థం కాని పరిస్థితి. కొత్తగా వచ్చిన ప్రతి అధికారికి దరఖాస్తులు అందజేస్తూనే ఉన్నామని తమకు న్యాయం జరగడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు.