Share News

ముందుకు కదలని నీరు

ABN , Publish Date - May 20 , 2026 | 12:42 AM

గోస్తనీ వేల్పూరు కాలువ(జీవీ కెనాల్‌)కు మురుగు కాలువ మధ్య మిగులు జలాల పారుదల కోసం వున్న లీడింగ్‌ చానల్‌ పూడుకుపోయి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో రైతులకు ముంపు బాధలు తప్పడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుకు కదలని నీరు
వేల్పూరులో మురుగు కాలువ లాకుల వద్ద పూడుకుపోయిన లీడింగ్‌ చానల్‌.

పూడుకు పోయిన ‘లీడింగ్‌ చానల్‌’

పూడిక తీత కోసం రైతుల ఎదురుచూపు

వరద ముంపు నుంచి కాపాడాలని విన్నపం

తణుకు రూరల్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): గోస్తనీ వేల్పూరు కాలువ(జీవీ కెనాల్‌)కు మురుగు కాలువ మధ్య మిగులు జలాల పారుదల కోసం వున్న లీడింగ్‌ చానల్‌ పూడుకుపోయి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో రైతులకు ముంపు బాధలు తప్పడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు రూరల్‌ మండలం వేల్పూరు మీదుగా ప్రవహించే గోస్తనీ, వేల్పూరు కాలువ నుంచి మురుగు కాలువ లాకుల వరకు ఉన్న సుమారు అర కిలోమీటరు పొడవున వున్న ఈ లీడింగ్‌ చానల్‌ చాన్నాళ్ల క్రితం రెండు వైపులా గట్ల జారిపోయి పూడుకుపోయింది.భారీ వర్షాలకు జీవీ కెనాల్‌ నీటి ప్రవాహం పంట పొలాల్లోకి రాకుండా ఈ లీడింగ్‌ చానల్‌ ద్వారా మురుగు కాలువలోకి లాకులను ఎత్తి పంపిస్తారు. పంట పొలాల్లో నిలిచిన మురుగు నీరు మురుగు డ్రెయిన్‌ నుంచి కాలువలోకి చేరి తిరిగి పంట పొలాలకు అందేలా లీడింగ్‌ చానల్‌ ఏర్పాటు చేశారు.

వేల్పూరులోని లీడింగ్‌ చానల్‌ లాకుల వద్ద ప్రారంభమైన మురుగు కావలిపురం, రేలంగి, పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాల్లోని పంట పొలాల్లోని మురుగు నీటితో యనమదుర్రు డ్రెయిన్‌లో కలుస్తుంది. కొన్నేళ్లుగా ఈ చానల్‌ పూడుకుపోవడంతో భారీ వర్షాల సమయంలో పంట చేలల్లోకి వరద నీరు చేరి ప్రతీ ఏటా ముంపు బారిన పడుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ చానల్‌కు ఒక వైపున తారురోడ్డు, మరోవైపున సిమెంట్‌ రోడ్డు ఉండడంతో పూడిక తీయడంలో ఇబ్బందు లెదురవుతాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ ఏర్పాట్లకు ముందే ఈ చానల్‌ పూడికతీత పనులు ప్రారంభిస్తే రైతులకు మేలు జరుగుతుందం టున్నారు. ప్రస్తుతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనైనా ఈ పూడిక తీత పనులు చేపట్టి పంటలను వరద ముంపు నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం

వేల్పూరు జీవీ కెనాల్‌ మిగులు జలాలను మురుగు కాలువకు, మురుగు కాలువ నుంచి మురుగునీటిని జీవీ కెనాల్‌కు మళ్లించే లీడింగ్‌ చానల్‌ చాలా రోజులుగా పెండింగ్‌లో వుంది. లీడింగ్‌ చానల్‌ పూడిత తీత పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇంకా అనుమతులు మంజూరు కాలేదు. రెండు వైపులా రోడ్లు పటిష్టంగా ఉండడంతో తవ్విన మట్టిని తొలగించడం ఇబ్బందిగానే వుంటుంది.

– బీవీవీ సత్యనారాయణ, ఇరిగేషన్‌ ఏఈఈ, పెనుమంట్ర.

Updated Date - May 20 , 2026 | 12:42 AM