గైనిక్ ఏలూరు వైద్యులు కాన్పు చేయలేమన్నారు..
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:10 AM
ఏలూరు ప్రభు త్వాసుపత్రి మెడికల్ కాలేజీ స్థాయిలో ఉన్నప్పటికీ వైద్య సేవల్లో మాత్రం వెనకడుగులోనే ఉందని మరోసారి రుజువైంది. వైద్యులు అన్ని విభాగాల్లో ఉన్నప్పటికీ వైద్య సేవలు మాత్రం తూతూ మంత్రంగానే అందుతున్నాయి.
గైనిక్ ఏలూరు వైద్యులు కాన్పు చేయలేమన్నారు..
కాన్సు చేసిన 108 సిబ్బంది
పండంటి మగ శిశువుకు జన్మనిచ్చిన గర్భిణీ
ఆరోగ్యంగా ఉన్న తల్లి బిడ్డ
ఏలూరు క్రైం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏలూరు ప్రభు త్వాసుపత్రి మెడికల్ కాలేజీ స్థాయిలో ఉన్నప్పటికీ వైద్య సేవల్లో మాత్రం వెనకడుగులోనే ఉందని మరోసారి రుజువైంది. వైద్యులు అన్ని విభాగాల్లో ఉన్నప్పటికీ వైద్య సేవలు మాత్రం తూతూ మంత్రంగానే అందుతున్నాయి. నిండు గర్భిణీ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరి నాలుగు రోజులైనా ఆ గర్భిణీకి రక్తం లేదనే సాకుతో కాన్పు చేయలేమంటూ వైద్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. 108 అంబులెన్సులో వెళ్తుండగానే పండంటి మగ శిశువుకు ఆ గర్భిణీ జన్మనిచ్చింది. అక్కడి ఆసుపత్రి వైద్యులు పరీక్షించి తల్లి బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారంటూ చెప్పడంతో తీసుకువెళ్ళిన గర్భిణీ తల్లి, బంధువులు అవాక్కయ్యారు. ఏలూరు రూరల్ మండలం వైఎస్ కాలనీ 17వ రోడ్డుకు చెందిన పి.కాంచన మూడవ కాన్పు నిమిత్తం నాలుగు రోజుల క్రితం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆమెకు రక్తం తక్కువగా ఉందని విజయవాడ తీసుకువెళ్లాలంటూ కాంచన బంధువులకు చెప్పడంతో గురువారం సాయంత్రం 108 అంబులెన్సులో విజయవాడ వెళ్తుండగా విజయవాడ సమీపంలోనే కాంచననకు డెలివరీ అయిపోయింది. వెంటనే అంబులెన్సు పైలెట్ శివన్నారాయణ అంబులెన్సును పక్కన పెట్టగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అయిన నవ్య అనురాధ అంబులెన్సులోనే కాంచనకు కాన్పు నిర్వహించి డెలివరీ చేశారు. మగ బిడ్డ జన్మించగా ఆమెకు అవసరమైన ఇంజక్షన్లు, సిలైన్లు అందిస్తూనే ఆఘమేఘాల మీద విజయవాడ ప్రభుత్వాసు పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు తల్లి బిడ్డను పరీక్షించి ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారంటూ చెప్పడంతో కాంచన బంధువులు 108 సిబ్బంది అవాక్కయ్యారు. విజయవాడలో కూడా మెడికల్ కాలేజీ ఉంది, ఏలూరులో కూడా మెడికల్ కాలేజీ ఉంది కదా అంటూ ఎందుకు పేషెంట్లను విజయవాడకు రిఫర్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు.