Share News

టీడీపీ కమిటీల్లో జిల్లాకు ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:35 AM

తెలుగుదేశం రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు అధిక ప్రాధాన్యం దక్కింది.

టీడీపీ కమిటీల్లో జిల్లాకు ప్రాధాన్యం

పొలిట్‌ బ్యూరోలో నలుగురికి అవకాశం

మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే పితాని,

రామరాజు, షరీఫ్‌లకు చోటు

జోనల్‌ కో–ఆర్డినేటర్‌లుగా ఎమ్మెల్యే ఆరిమిల్లి, పాందువ్వ శ్రీను

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు అధిక ప్రాధాన్యం దక్కింది. పార్టీ విధేయులకు, సీనియర్లకు అధిష్ఠానం కీలక పదవులను అప్పగించింది. ఈ మేరకు పొలిట్‌ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు బుధవారం ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన కీలకమైన పొలిట్‌ బ్యూరోలోకి జిల్లా నుంచి నలుగురు నేతలను తీసుకున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతోపాటు మండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజులకు అవకాశం కల్పించారు. పార్టీ పదవుల్లోను సామాజిక వర్గాలతోపాటు, విధేయులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రి నిమ్మల పాలకొల్లు నుంచి మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పార్టీకి వీర విధేయుడు. ఆచంట ఎమ్మెల్యే పితాని సీనియర్‌ నేత. పార్టీలో మొదటి నుంచి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. మండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ తెలుగుదేశంలోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీ పట్ల క్రమశిక్షణ, నిబద్దతతో కొనసాగుతున్నారు. ఆయన సేవలను మరింతగా వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఈ అవకాశం కల్పించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు రామరాజు ఉండి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. గడచిన ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టును వదులు కోవాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయనను ఇప్పటికే ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు. తాజాగా పొలిట్‌ బ్యూరోలోకి తీసుకున్నారు.

పార్టీ రాష్ట కమిటీలోనూ..

పార్టీ జాతీయ పదవులు, రాష్ట్ర కమిటీ పదవుల్లోనూ జిల్లాకు ప్రాధాన్యం లభించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా మాజీ మంత్రి, పీతల సుజాత, రాష్ట్ర జోనల్‌ సమన్వయకర్తలుగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను), కార్యనిర్వాహక కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు, తాడేపల్లిగూడెం నుంచి గొర్రెల శ్రీధర్‌, నర్సాపురం నుంచి కొప్పాడ రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌, రాష్ట్ర కార్యదర్శిగా భీమవరం నుంచి కోళ్ల నాగేశ్వరరావును, కార్యదర్శిగా పాలకొల్లు నుంచి పెచ్చెట్టి వెంకట నరసింహారావును నియమించారు. వీరంతా మొదటి నుంచి పార్టీ పట్ల ఎంతో విధేయతతో వున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా వివిధ సామాజిక వర్గాల నుంచి వీరిని ఎంపికచేశారు.

Updated Date - Apr 16 , 2026 | 12:35 AM