అంతా ఓకే !
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:15 AM
జిల్లాలో నాలుగు రోజులపాటు అలజడి సృష్టించిన డీజిల్ సమస్య సద్దుమణిగింది.
సద్దుమణిగిన డీజిల్ సమస్య.. జిల్లాలో నిల్వలు భేష్
(భీమవరం–ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నాలుగు రోజులపాటు అలజడి సృష్టించిన డీజిల్ సమస్య సద్దుమణిగింది. జిల్లాకు అవ సరమైన డిమాండ్ కంటే అధికంగానే డీజిల్ సరఫరా అయ్యింది. వరికోత యంత్రాల కోసం రైతులు బంకుల వద్ద క్యూ కట్టి తీసుకువెళ్లారు.ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా డీజిల్ సరఫరా చేయడంలో అధికారులు విజయంతమయ్యారు. వారివద్ద కొరత తీరిపోవడంతో బుధవారం నాటికి వాహనదారులకు సమృద్ధిగానే ఇంధనాన్ని సరఫరా చేయగలిగారు. మున్ముందు మళ్లీ సమస్య వస్తుందోమేనన్న ఉద్దేశంతో కొందరు కారు యజమానులు మాత్రం డిక్కీల్లో క్యాన్‌లతో డీజిల్ పెట్టుకున్నారు. ప్రస్తుతం కొరత లేకపోవడంతో బంకుల్లో అభ్యంతరం చెప్పకుండా క్యాన్‌లలోనూ డీజిల్ భర్తీచేశారు. బుధవారం నాటికి జిల్లాలో డీజిల్ నిల్వ గణనీయంగా పెరిగింది. జిల్లాలోని బంకుల్లో దాదాపు 4.88 లక్షల లీటర్లు అందుబాటులో ఉంది. మరో 12.43 లక్షల లీటర్ల ఇండెంట్‌లున్నాయి. కంపెనీలు సైతం సరఫరా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. అధికారులు కసరత్తు ఫలించింది. ప్రణాళిక బద్ధంగా వ్యవహరించడంతో మూడు రోజుల వ్యవధిలోనే డీజిల్ సమస్య సమసింది. పెట్రోలు నిల్వ కూడా ఆశించిన స్థాయిలోనే ఉంది. ప్రజలు ఆపోహలకు పోయి నిల్వ చేసుకునే ప్రయత్నం చేయొద్దంటూ కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డీజిల్ సరఫరా చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.