డీజిల్ వచ్చింది
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:33 AM
జిల్లాలో డీజిల్ సరఫరా నియంత్రణకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది.
అధికారుల చర్యలతో మెరుగైన ఇంధన సరఫరా
పెట్రోలుకు తగ్గుతున్న రద్దీ
కొన్ని బంక్‌ల వద్ద క్యూలైన్లు
పలుచోట్ల అమ్మకాలు లేవు!
ఇప్పటికీ మరికొన్ని మూసివేత
రెవెన్యూ, పోలీసుల పర్యవేక్షణ
జిల్లాలో డీజిల్ సరఫరా నియంత్రణకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది. ప్యానిక్ కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో మంగళవారం పరిస్థితి మెరుగైంది. బంక్‌ల వద్ద తనిఖీలు, డీలర్లు, అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టడంతో క్రమేపీ రద్దీ తగ్గింది. అత్యవసర సర్వీసులకు సంబంధించి కూపన్లు ఇవ్వడంతో డీజిల్ విషయంలో కొంత వెసులుబాటు కలిగింది.
(ఏలూరు సిటీ – ఆంధ్రజ్యోతి)
జిల్లాలో సుమారు 260 పెట్రోలు బంక్‌లలో రోజువారీ డీజిల్ వినియోగం 365 కిలో లీటర్లు ఉంటుందని అంచనా. అవాస్తవ ప్రచారంతో ఒకేసారి కొనుగోలు, స్టాక్ వెంటనే అయిపోవడంతో రద్దీ నెలకొంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగింది. అధికారుల చర్యలతో మంగళవారం పెట్రోలు బంక్‌ల వద్ద రద్దీ తగ్గింది. జిల్లాలో వరి మాసూళ్లు, కొనుగోళ్లు ముమ్మరంగా జరగుతున్నాయి. కోత యంత్రాలకు, ధాన్యం రవాణా వాహనాలకు డీజిల్ అవసరం. పరిశ్రమలకు, ఆక్వా రంగానికి రోజువారీ డీజిల్ అవసరాలు ఎక్కువే. వరి కోత యంత్రాలకు అవసరమైన డీజిల్‌కు అధికారులు రోజు వారీ టోకెన్లు ఇస్తున్నారు. బంక్‌ల వద్ద సిబ్బందిని నియమించి డీజిల్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ నోస్టాక్ బోర్డులు పెడుతున్న బంక్‌లలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇప్పటికీ నో స్టాక్ బోర్డులు
జిల్లాలోని కొన్ని బంక్‌లలో పెట్రో, డీజిల్ నిల్వలు లేకపో వడంతో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గతంలో ఆయిల్ కంపెనీలు క్రెడిట్ పద్ధతిలో డీజిల్, పెట్రోలును ఇచ్చేవారని, ఇప్పుడు ఆ అవకాశం లేదని బంక్ నిర్వాహకు లు చెబుతున్నారు. కొన్ని బంక్‌లలో బకాయిలు చెల్లించలేక డీజిల్, పెట్రోలు సరఫరా కావడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితులను ఆధిగమించడానికి జిల్లా యంత్రాంగం ముం దస్తు చర్యలు తీసుకోవడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి.
సక్రమంగా సరఫరా చేయాలి : కలెక్టర్
బంక్‌ల వద్ద డీజిల్ పక్కదారి పట్టకుండా సక్రమంగా సరఫరా అయ్యేలా పర్యవేక్షించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. డీజిల్ సరఫరాపై మంగళవారం అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వ హించారు. వివిధ ఆయిల్ కంపెనీల నుంచి ట్యాంకర్లు బంక్ లకు చేరుకుంటున్నాయని తెలిపారు. బంక్‌లలో డీజిల్ నిల్వ లు, అధిక ధర, నో స్టాక్ బోర్డులపై నిఘా ఉంచాలన్నారు. వ్యవసాయం, ఆక్వా రైతులకు సమస్య లేకుండా డీజిల్ అందేలా చూడాలన్నారు. డీజిల్ కొరతపై కంట్రోల్‌రూమ్ 75692 96272 నెంబర్‌కు ఫిర్యాదు చేసేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.
శాఖల వారీగా ఇంధన కూపన్లు
జిల్లాలో వైద్యసేవలు, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇతర ప్రజోప కార్యక్రమాలకు ఇంధన కొరత లేదని కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖలు, వైద్య, ఆర్‌టీసి, తదితర శాఖల అధికారుల తో కలెక్టర్ సమీక్షించారు. శాఖల వారీగా ఇంధన ఇండెంట్ సమర్పించాలన్నారు. నిబంధనల మేరకు టోకెన్లు జారీ చేయాలని, బంక్‌లలో టోకెన్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల న్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో టోకెన్లు జారీ చేస్తే చార్జి మొమోలు జారీ చేయాలన్నారు.