కాస్త ఊరట !
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:14 AM
జిల్లాలో డీజిల్ కొరత కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇంధనం కోసం బంకుల వద్ద బారులు తీరే దుస్థితి కాస్త తగ్గింది.జిల్లా వ్యాప్తంగా మంగళవారం డీజిల్‌పై అలజడి తగ్గింది.
బంక్‌ల దగ్గర తగ్గిన రద్దీ
డీజిల్ కొరత తీరినట్టేనా ?
ఒక్కరోజులో సర్దుకుంటుంది.. అధికారులు భరోసా
బంకులకు నాలుగు వేల లీటర్ల వంతున కేటాయింపు
రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
మాసూళ్లు పూర్తయితే
సగం సమస్య తీరినట్టే
ట్యాంకర్లు లేక కంపెనీల నుంచి సరఫరాలో జాప్యం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో డీజిల్ కొరత కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇంధనం కోసం బంకుల వద్ద బారులు తీరే దుస్థితి కాస్త తగ్గింది.జిల్లా వ్యాప్తంగా మంగళవారం డీజిల్‌పై అలజడి తగ్గింది. బంకులకు సరఫరాలోనూ కోత విధించారు. ఒక్కో బంకుకు నాలుగు వేల లీటర్ల వంతున కేటాయిస్తున్నారు. అత్యధిక బంకులకు డీజిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.రాత్రిపూట బంకుల్లో ఇంధనం పక్కదారి పట్టే అవకాశాలు లేకుండా అధికారులు రంగంలోకి దిగారు. ప్రతి బంకుకు ఒక వీఆర్‌వోను నియ మించారు. బంకుల్లో డీజిల్ అయిపోవడంతో వాహనదారులు, రైతులు కొద్దిమంది వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.మరో 24 గంటల్లో పూర్తిస్థాయి సర్దుబాటు కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు వేర్వేరు బంకులకు డీజిల్ కేటాయిస్తున్నారు. జిల్లాలో 165 బంకుల నుంచి ఇప్పుడు ఇండెంట్‌లున్నాయి. వాటికి పూర్తిస్థాయిలో సరఫరా చేసే ట్యాంకర్లు కంపెనీల వద్ద లేవు. జిల్లాలో కొద్దిమంది బంకు యజమానులకు మాత్రమే సొంత ట్యాంకర్లున్నాయి. ఒక్కో ట్యాంకర్‌లో 20 వేల లీటర్లు రవాణా చేస్తున్నారు. గడచిన నాలుగు రోజుల నుంచి బంకుల రద్దీ ఉండేది. రైతులు క్యాన్‌లతో బంకుల వద్ద బారులు తీరారు. వరికోత యంత్రాలకు సమృద్ధిగా డీజిల్ చేరింది. దాంతో కొద్ది పాటి ఉపశమనం పొందారు. మరో రెండు రోజులపాటు జిల్లాకు డీజిల్ రవాణాపై అధికారులు దృష్టి పెడితే పూర్తిస్థాయిలో సమస్యకు పరిష్కారం లభించనుంది.
పది రోజులే కీలకం
వరికోతలు మరో 10 రోజులపాటు సాగనున్నాయి. ఇప్పటికే 50 శాతం మసూళ్లు పూర్తయ్యాయి. మిగిలిన 50 శాతం కూడా పూర్తి కావాలంటే డీజిల్ ప్రధానం కానుంది. అప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంధనం సరఫరా కావాలి. ఆ తర్వాత కోత యంత్రాల సమస్య తీరిపోనుంది. ప్రస్తుతం కోత యంత్రాలకే అత్యధిక వినియోగం అవుతోంది. లారీలు వంటి భారీ వాహనాలకు ఇబ్బంది తగ్గింది. ఇతర రాష్ర్టాలకు వెళ్లిన వాహనాలు అక్కడనుంచే మళ్లీ డీజిల్ భర్తీ చేసుకొని వస్తున్నాయి. జిల్లాకు అవసరమైన ఇండెంట్‌ల ప్రకారం కంపెనీలు సరఫరా చేయాలి. పరిశ్రమలకు సంబంధించిన డీజిల్‌పైనా అటు ప్రభుత ్వం, ఇటు కంపెనీలు దృష్టి పెట్టాలి. బంకులకు కోత విధిస్తే ఇప్పటిలాగే సమస్య ఏర్పడనుంది.కొరత ఉత్పన్నం కావడంతో జిల్లా అధికారులు శరవేగంగా చర్యలు తీసుకున్నారు. వరి, ఆక్వా రైతులకు ఇబ్బందులు లేకుండా డీజిల్ పంపిణీ చేశారు. దాంతో మంగళవారం నాటికి అలజడి తగ్గింది.అయినా కంపెనీల నుంచి ఇంధనం రాబడితేనే మున్ముందు సమస్య ఉత్పన్నం కాదు.