Share News

డీజినిల్‌ ?

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:17 AM

భీమవరం ప్రాంతంలో ఓ బంకు యజమాని డీజిల్‌ కోసం రూ. 50 లక్షలు చెల్లించారు. కంపెనీ నుంచి సరఫరా రాలేదు. వారి వద్ద ఎప్పటినుంచో డీజిల్‌ కొనుగోలు చేస్తున్న ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

డీజినిల్‌ ?
పెనుమంట్ర బంకు వద్ద డీజిల్‌కోసం వేచివున్న వాహనదారులు

బంక్‌ల వద్ద నో స్టాక్‌ బోర్డులు

ప్యానిక్‌ అవుతున్న జనం

బంక్‌ల వద్ద భారీ క్యూలైన్లు

అన్నదాతలు, ఆక్వా రైతుల్లో ఆందోళన

వాహనదారులకు ఇక్కట్లు

పరిమితికి మించి ఇచ్చామంటున్న కంపెనీలు

సరఫరా పెంచకపోతే ఇబ్బందులే

చేతులెత్తేస్తున్న బంక్‌ యజమానులు

బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు

గడిచిన మూడు రోజుల నుంచి జిల్లాలో డీజిల్‌ కోసం వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉంటున్నారు. లారీలు, ఆటోలు, కార్లు బారులు తీరుతున్నాయి . బంకుల్లో ఒకేసారి కొరత వచ్చిపడింది. జిల్లాలో భీమవరం ప్రాంతంలో ఆదివారం ఒక్క బంకు వద్ద కూడా డీజిల్‌ అందుబాటులో లేకుండా పోయింది. తాడేపల్లిగూడెంలో మధాహ్నం ఒంటిగంటకు అన్ని బంకుల్లోనూ నో స్టాక్‌ బోర్డులు పెట్టేశారు. తణుకులో మాత్రం ఒకే ఒక్క బంకులో సాయంత్రం నాలుగు గంటల వరకు పంపిణీ చేశారు. పాలకొల్లు, నర్సాపురం పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బంకుల్లోనూ రద్దీ నెలకొంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి/న్యూస్‌ నెట్‌వర్క్‌)

భీమవరం ప్రాంతంలో ఓ బంకు యజమాని డీజిల్‌ కోసం రూ. 50 లక్షలు చెల్లించారు. కంపెనీ నుంచి సరఫరా రాలేదు. వారి వద్ద ఎప్పటినుంచో డీజిల్‌ కొనుగోలు చేస్తున్న ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌లకు ఇంధనం అవసరం కానుంది.. లేదంటే రొయ్య దెబ్బ తింటుంది. మరోవైపు రైతులకు కూడా అవసరం. వరికోత యంత్రాల కోసం రైతులు కూడా బంకులకు ఎగబడుతున్నారు. పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్‌ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఆదివారం సెలవు దినమైనా సరే డిపోలు తెరచి సరఫరా చేస్తామంటూ ఇంధన కంపెనీ అధికారులు భరోసా ఇచ్చారు. గతేడాది ఏప్రిల్‌ నెలలో సరఫరాకు మించి ఈసారి జిల్లాకు కోటా ఇచ్చామంటూ కంపెనీలు లెక్కలు చెపుతున్నాయి.

రైతులకు కూపన్లు

ప్రస్తుతం వరి మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరికోత యంత్రాలు, ధాన్యం రవాణా వాహనాలకు డీజిల్‌ అవసరం. ఫలితంగా రైతులు క్యాన్‌లతో బంకుల వద్దకు ఎగబడుతున్నారు. రైతు సేవాకేంద్రాలు, సచివాల యాల్లో కూపన్‌లు ఇస్తున్నారు. వారికి మాత్రమే 50 లీటర్ల వరకు డీజిల్‌ సరఫరా చేస్తున్నారు. లేదంటే ఐదు లీటర్లకు మించి బంకుల్లో పంపిణీ చేయడం లేదు. ప్రతి పట్టణంలోనూ మూడు బంకులకు మాత్రమే డీజిల్‌ సరఫరా అవు తోంది. కొద్ది గంటల వ్యవధిలోనే స్టాక్‌ అయిపోతోంది. నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారు.

బ్లాక్‌ మార్కెట్‌కు విక్రయిస్తున్నారా ?

బంకుల వద్ద కొనుగోలు చేసిన డీజిల్‌ను కొంతమంది అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇదే విషయాన్ని బంకు యజమానుల వద్ద అధికారులు ప్రస్తావిస్తున్నారు. క్యాన్‌లలో డీజిల్‌ కొట్టొద్దని చెపుతున్నా ఫలితం లేకపోతోంది. రైతులే క్యాన్‌లు తీసుకొచ్చి బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.మరోవైపు బంకుల్లో లీటరుకు రూ.5 అదనంగా వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలతో బంకు యజమానులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కోటా పెంచక పోతే మరిన్ని రోజులు డీజిల్‌కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

50 శాతం పెంచారా..

జిల్లాలో 165 బంకులున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో గరిష్టంగా మూడు లక్షల లీటర్ల వినియోగం జరిగింది. ఈసారి సగటున రోజుకు 4.50 లక్షల లీటర్లు సరఫరా చేసినట్టు కంపెనీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. ఇలా ఒకేసారి వినియోగం పెరగడానికి కారణమేమిటన్న విషయమై అంచనా వేయలేక పోయారు. గతంలో ఇతర రాష్ర్టాల నుంచి డీజిల్‌ దిగుమతి అయ్యేది. మరోవైపు పరిశ్రమలు నేరుగా కంపెనీల నుంచి దిగుమతి చేసుకునేవి. ఇప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చుకునే విధానానికి రవాణాదారులు స్వస్తి పలికారు. అక్కడ కూడా ధరలు అధికంగా ఉండడంతో ఇక్కడ వినియోగం అధికమైంది. వాస్తవానికి పరిమితికి మించి ఏ ఒక్కరూ డీజిల్‌ను వినియోగించరు. నిల్వ చేసుకోరు. విద్యార్థులకు సెలవు ఇవ్వడంతో విద్యాసంస్థల బస్సులు కూడా నిలిచిపోయాయి. అయినా డిమాండ్‌ ఏర్పడింది. దీంతో కొంతమంది రైతులు క్యాన్‌లలో ఇంధనాన్ని తీసుకువెళ్లి ఇళ్లల్లో నిల్వ చేసుకుంటున్నారు.దీంతో మండలాల వారీగా వ్యవసాయ అధికారులను రంగంలోకి దింపారు. వారి అనుమతితోనే రైతులకు క్యూపన్‌లు మంజూరు చేస్తున్నారు.

బంక్‌ల వద్ద భారీ క్యూలైన్లు

ఆకివీడు : ఆకివీడులో గంటల తరబడి బంకుల దగ్గర ఉన్నా డీజిల్‌ దొర కడం లేదని అన్నదాతలు, కోత యంత్రాల యజమానులు, ఆటోడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరిచేలు మాసూళ్ల దశలో ఉన్న సమయంలో డీజిల్‌ కొరతతో అన్నదాతలు, యంత్రాల యాజమాన్యం గగ్గోలు పెడుతున్నారు.

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం తెల్లవారే సమయానికి బంకు వద్దకు టిన్నులతో క్యూకట్టారు. కొన్ని బంకుల వద్ద వాహనాలు క్యూలైన్లు పెట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వాహనదారులకు సర్దిచెప్పినా వారి ఆందోళనను తీర్చలేకపోతున్నారు. బంకుల్లో ఉన్న డీజల్‌ బ్లాక్‌ చేస్తున్నారా అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

వాసవి పెనుగొండ/పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో వెలగలేరు, నెగ్గిపూడి, బ్రాహ్మణచెరువు, పొలమూరు పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ అందు బాటులోకి తెచ్చారు. పెనుమంట్ర మండలంలో రైతులకు డీజిల్‌ విక్రయించాలని పెట్రోల్‌ బంక్‌ల వద్ద వీఆర్‌వోలను ఏర్పాటు చేశారు. పెనుగొండ, సిద్దాంతం గ్రామాల్లో బంక్‌ల వద్ద డీజిల్‌ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. దీంతో రైతులందరూ నెగ్గిపూడి వైపు రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలో 32 వేల లీటర్ల డీజిల్‌, పెట్రోల్‌ బంకుల్లో నిల్వలు ఉన్నాయి. కూపన్‌లు ఉన్న వారికి విక్రయాలు చేస్తున్నట్టు తహసీల్దార్‌ రవికుమార్‌ తెలిపారు.

నరసాపురం రూరల్‌ : డీజిల్‌ కృత్తిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ సత్యనారాయణ హెచ్చరించారు. ఆదివారం పట్టణ, మండలంలోని పెట్రోల్‌ బంకులను తనిఖీ చేశారు. ఆక్వా, వరి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని పెట్రోల్‌ బంకుల వద్ద కలెక్టర్‌ అదేశాలకు అనుగుణంగా రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. వీఆర్వో నాగేంద్ర ఉన్నారు

మొగల్తూరు : ఆటోలు, మరబోట్లుకు, గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ చేసే వాహనాలుకు డీజిల్‌ దొరకక ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి.ఆదివారం ఉదయం మొగల్తూరులోని పెట్రోల్‌ బంక్‌ల వద్ద వాహనాలు బారులు తీరాయి. భారీ వాహనాలు, ఆటోలే కుండా టిన్నులతో డీజిల్‌ తీసుకువెళ్ళేందుకు తరలిరావడంతో భారీగా క్యూ ఏర్పడింది.

అత్తిలి : అత్తిలి పరిసర ప్రాంతాల్లోని పలు పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ఒక పెట్రోల్‌ బంకులో మాత్రమే డీజిల్‌ అందుబాటులో ఉండడంతో ఆటో డ్రైవర్లు డీజిల్‌ కోసం పోటీపడ్డారు. ఒక్కో ఆటోకు 500 రూపాయలు వరకు డీజిల్‌ పోస్తున్నారు.

కాళ్ళ : మండలంలో కాళ్ళ, ఏలూరుపాడు, జువ్వలపాలెం, బొండాడ గ్రామాల్లో ఐదు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఆదివారం పలు బంకుల్లో డీజల్‌ లేకపోవడం, ఉన్న ఒకటి రెండు బంకుల వద్ద ఆటోలు, ఇతర వాహనాలు బారులు తీరాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు బారులు తీరాయి. ఆక్వా రైతులు, ట్రాక్టర్‌ యజమానులు క్యాన్లతో డీజిల్‌ కోసం క్యూ కట్టారు.

Updated Date - Apr 27 , 2026 | 12:17 AM