Share News

డీజిల్‌.. క్యూ..!

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:16 AM

పెట్రోల్‌ బంక్‌ల వద్ద నో స్టాక్‌ బోర్డులు.. మూతపడిన బంకులు.. కొద్దిపాటి నిల్వలు ఉన్న చోట వాహనాల రద్దీ, డీజిల్‌ కోసం క్యూలో ఉంచిన డబ్బాలు..!

డీజిల్‌.. క్యూ..!
చాట్రాయి మండలం పోలవరం బంక్‌లో డీజిల్‌ కోసం వరుసలో ఉంచి డబ్బాలు

పెట్రోలు, డీజిల్‌ కోసం బంకుల్లో రద్దీ

గంటల తరబడి వేచిఉన్న వాహనదారులు

పలుచోట్ల క్యూలో ఉంచిన డబ్బాలు

నిల్వలు లేకపోవడంతో కొన్ని బంక్‌ల మూత

సరఫరా నియంత్రణపై అధికారుల చర్యలు

పెట్రోల్‌ బంక్‌ల వద్ద నో స్టాక్‌ బోర్డులు.. మూతపడిన బంకులు.. కొద్దిపాటి నిల్వలు ఉన్న చోట వాహనాల రద్దీ, డీజిల్‌ కోసం క్యూలో ఉంచిన డబ్బాలు..! జిల్లాలో పెట్రోలు, డీజిల్‌ కష్టాలు ఇలా ఉంటే ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నారు. రెండు మూడు రోజులుగా పెట్రోలు, డీజిల్‌ కొరత అంటూ ప్రచారం జరగడం వల్ల ఒకేసారి అధికంగా కొనుగోలు చేయడంతో కొరత తలెత్తిందని బంక్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

జీలుగుమిల్లి, ద్వారకాతిరుమల, పెదవేగి, దెందులూరు, కైకలూరు, ముదినేపల్లి, కలిదిండి, చాట్రాయి, ఆగిరిపల్లి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): డీజిల్‌ కొరతతో రైతులు వ్యవసా య పనులకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లాలో కొన్ని చోట్ల పెట్రోలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. పెట్రోలు, డీజిల్‌ కోసం బంక్‌ల వద్ద వాహనాలు, డబ్బాలతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. నో స్టాక్‌ బోర్డులతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా లో పెట్రోలు, డీజిల్‌ కొరత లేదని అధికారులు చెబుతుం డడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు.

జీలుగుమిల్లి మండలంలో పెట్రోలు, డీజిల్‌ నో స్టాక్‌ బోర్డులతో వాహనదారులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. కొందరు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటలో బంక్‌ వద్దకు వెళ్లారు. అక్కడ 5 బంకుల్లో ఒక్కచోట మాత్రమే ద్విచక్ర వాహనదారులకు లీటరు చొప్పున పెట్రోల్‌ పోశారు. కొద్ది గంటల్లో అక్కడ కూడా పెట్రోల్‌, ఖాళీ అయ్యింది. వేరుశనగ మిల్లర్లు, పొగాకు ఆకు రెలుపు పనులకు వెళ్లే ట్రాక్టర్లలో డీజిల్‌ లేక రైతులు వ్యవసాయ పనులు నిలిచిపోయాయని వాపోతున్నారు.

ద్వారకాతిరుమల మండలంలోని ద్వారకాతిరుమల, పంగిడిగూడెం, జి కొత్తపల్లి బంకుల్లో ఒక్కో వాహనానికి పరిమితి మేరకు పెట్రోలు, డీజిల్‌ పోశారు. గంటల తరబడి వేచిఉండి ఆయిల్‌ తీసుకెళున్నారు. కొరత లేదని సోమవారం నాటికి అంతా సర్దుకుంటుందని తహసీల్దారు జెవి సుబ్బారావు చెబుతున్నారు.

పెదవేగి మండలంలో పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. వాహనాల రాకతో బంకు ప్రవేశం వద్ద కర్రలు అడ్డుగా పెట్టి తాత్కాలికంగా మూతపెట్టారు. పెదవేగి, చక్రాయగూడెం, విజయరాయి, నడిపల్లి, కొప్పాక బంకులు నో స్టాక్‌ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. మొక్కజొన్న, వరి కోతల వేళ డీజిల్‌ లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

దెందులూరు పెట్రోల్‌ బంకులో ఆదివారం సాయంత్రానికి పెట్రోలు అయిపోయింది. వ్యవసాయ పనులకు అవసరమైన డీజిల్‌ కోసం రైతులు డబ్బాలతో బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కైకలూరులో ఐదు పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిల్‌ కొరతతో ప్రజలు అవస్థలకు గురయ్యారు. ఆక్వా చెరువుల్లోని ఏరియేటర్లు తిరిగేందుకు డీజిల్‌ అందుబాటులో లేకపోతే రైతులు భారీ నష్టాన్ని చవిచూడాల్సివస్తుంది. కైకలూరులోని ఒక బంకులో ఆదివారం సాయంత్రం డీజిల్‌, పెట్రోలు రావడంతో వందలాది వాహనాలు, బైక్‌లతో క్యూలైన్లో పడిగాపులు పడ్డారు. పోలీసులు దగ్గరుండి వాహనాలను క్రమబద్దీకరించి పెట్రోలు, డీజిల్‌ను విక్రయించేలా చర్యలు తీసుకున్నారు.

ముదినేపలి మండలంలో ఒకేసారి డీజిల్‌ కొరతతో ఆక్వా రైతులు, ట్రాకర్లు, ఇతర వాహనాల యజమానులు ఇబ్బంది పడుతున్నారు. ముదినేపల్లిలోని ఒక బంకులో డీజిల్‌ కొద్దిపాటి నిల్వ ఉండడంతో శనివారం రాత్రి వాహనదార్లు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. గుడివాడకు చెందిన లారీ యజమాని, బంకు సిబ్బందికి మధ్య తోపులాటలో లారీ యజమానికి గాయపడ్డాడు.

కలిదిండి మండలంలో మొత్తం 9 బంకుల్లో డీజిల్‌ లేకపోవడంతో బంకుల వద్ద ప్లాస్టిక్‌ డబ్బాలతో క్యూలైన్లలో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. డీజిల్‌ స్టాకు వచ్చినప్పటికి 2, 3 లీటర్లు చొప్పున విక్రయిస్తున్నారు. కలిదిండి బంకుల్లో డీజిల్‌ అయిపోవడంతో పెట్రోల్‌ మాత్రమే విక్రయిస్తున్నారు.

చాట్రాయి మండలంలో పోలవరం ఆదివారం వందల మంది డీజిల్‌ కోసం ఎగబడ్డారు. కొందరు రైతులకు రూ.వెయ్యి చొప్పున డీజిల్‌ కొట్టించారు. రెండు బంకుల్లో డీజిల్‌ స్టాక్‌ నిల్‌ బోర్డులు పెట్టారు. చనుబండలోని రెండు బంకుల్లో డీజిల్‌ పెట్రోల్‌ అయిపోయింది. చిన్నంపేట, తుమ్మగూడెం బంకుల్లో కూడా డీజిల్‌ లేదు. రబీ వరి, మొక్కజొన్న, మామిడి కోతల సమయంలో డీజిల్‌ కొరతతో రైతులకు దిక్కు తోచని పరిస్థితి.

ఆగిరిపల్లి మండలంలోని పలు బంకుల్లో నోస్టాక్‌ బోర్డులతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 8 బంక్‌లలో డీజిల్‌ లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతానికి పెట్రోల్‌ మాత్రమే విక్రయిస్తున్నారు.

డీజిల్‌ సరఫరాపై పటిష్ట చర్యలు తీసుకోండి

అధికారులతో మంత్రి పార్థసారధి సమీక్ష

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): డీజిల్‌ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కొలుసు పార్ధసారధి అధికారులను ఆదేశించారు. జిల్లాలో డీజిల్‌ కొరత అంశంపై కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌ గౌడ, ఎమ్మెల్యేలు, ఆయిల్‌ కంపెనీల ప్రతిని ధులతో మంత్రి ఆదివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ప్రజల అవసరాలకు సరిపడా పెట్రోలు, డీజిల్‌ అందు బాటులో ఉంచాలన్నారు. ధాన్యం రవాణా వాహనాలు, వరి, ఆక్వా రైతుల అవసరాలకు డీజిల్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయి నుంచి కూడా ఆయిల్‌ నిల్వలు పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు ఆయిల్‌ కంపెనీల తో మాట్లాడి జిల్లా అవసరాల మేరకు ఆయిల్‌ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ డీజిల్‌ కొరత ప్రచారంతో వారం రోజులుగా 10 నుంచి 20 శాతం అధికంగా కొను గోళ్లు పెరిగాయన్నారు. అవసరం లేకపోయినా డీజిల్‌ను నిల్వ చేసుకోవటానికి ప్రయత్నించడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందన్నారు. జిల్లాలో అవసరాల మేరకు డీజిల్‌ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నా మన్నారు. డీజిల్‌ ఖాళీ అయిన బంక్‌ల వివరాలు ముం దుగానే తెలుసుకుని సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు బడేటి చంటి, సొంగా రోషన్‌ కుమార్‌, పత్సమట్ల ధర్మరాజు, కామినేని శ్రీనివాస్‌ కోరారు. జిల్లాలో వారం రోజులుగా సాధారణం కన్నా 10 నుంచి 20 శాతం మేర అధికంగా డీజిల్‌ సరఫరా చేస్తున్నా మని ఐవోసీ, హెచ్‌పీ, బీపీసీ ప్రతినిధులు జగదీష్‌, మహేష్‌, సూర్య తెలిపారు. డిమాండ్‌ను అనుసరించి పెట్రోలు, డీజిల్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 12:16 AM