Share News

డీజిల్‌..మంట!

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:26 AM

జిల్లాలో కొన్ని రోజులుగా డీజిల్‌, పెట్రోలుకు కటకట ఏర్పడింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో ఇంధన గందరగోళ పరి స్థితులు ఏర్పడ్డాయి.

డీజిల్‌..మంట!
భీమడోలు జంక్షన్‌లో పెట్రోల్‌ బంకు వద్ద డీజిల్‌ కోసం పడిగాపులు

జిల్లాలో ఇంధన గందరగోళం.. బంక్‌లలో క్యూలైన్లు

వ్యవసాయ అవసరాలకు అందని డీజిల్‌

ఆక్వా రైతుల్లో ఆందోళన

నో స్టాక్‌తో కొన్ని బంక్‌లు మూసివేత

పెట్రోలుకూ కటకటే..వాహనదారుల తిప్పలు

బంక్‌ల యాజమాన్యాలతో అధికారుల సమీక్ష

ఏలూరుసిటీ, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో కొన్ని రోజులుగా డీజిల్‌, పెట్రోలుకు కటకట ఏర్పడింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో ఇంధన గందరగోళ పరి స్థితులు ఏర్పడ్డాయి. నిన్న మొన్నటి వరకు గ్యాస్‌ కష్టాలు ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు తాజాగా డీజిల్‌, పెట్రోలు కొరతతో ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. మరోవైపు యుద్ధ సంక్షోభాన్ని పురస్కరించుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నా రనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలో రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతుండడంతో వరి కోత యంత్రాలకు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు డీజిల్‌ అవసరం ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా జిల్లాలో డీజిల్‌ దొరకని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 260 పెట్రోలు బంక్‌లు ఉండగా రోజువారీ జిల్లాలో రోజువారీ 3లక్షల లీటర్ల వరకు డీజిల్‌ వినియోగం, 2.50 లక్షల లీటర్ల వరకు పెట్రోలు వినియోగం ఉంటుంది. శనివారం జిల్లాలోని చాలా బంకుల్లో పెట్రోల్‌ కూడా నిండు కోవడంతో కేవలం స్పీడ్‌ పెట్రోల్‌ మాత్ర మే కొన్ని బంక్‌లలో విక్రయిస్తున్నారు. ఇప్పటికే చాలా బంక్‌లలో డీజిల్‌, పెట్రోల్‌ లేక నోస్టాక్‌ బోర్డులు పెట్టక పోయినా పెట్రోలు, డీజిల్‌ పోయడం లేదు. కొన్ని బంక్‌ల్లో డీజిల్‌ను పరి మితం చేయడంతో ఆయా బంక్‌ల వద్ద భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. చాలామంది డబ్బాలతో అవసరం లేకున్నా డీజిల్‌ను తీసుకెళ్తున్నారు. ఆటోలు, వ్యాన్లు, లారీలతో పాటు ఇతర డీజిల్‌ వాహనదారులు పెట్రోలు బంక్‌ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఏలూరు నగరంలో శనివారం పరిస్థితి మరింత దారుణంగా కనిపించింది. ఏ బంక్‌ చూసినా వాహనాలు, వినియోగదారులతో నిండిపోయింది. జిల్లాలో డీజిల్‌, పెట్రోలు కటకటపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు సమీక్షిస్తున్నారు. పెట్రోలు బంక్‌ యజమానులతో ఇప్పటికే అధికారులు సమీక్షించారు. డీజిల్‌, పెట్రోలు కొరత లేదని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

చాట్రాయి : మండలంలో 12 వేల ఎకరాల్లో రబీ మొక్కజొన్న, 2,800 ఎకరాల్లో రబీ వరి సాగైయింది. ప్రస్తుతం ముమ్మరంగా కోతలు జరుగుతున్న సమయంతో డీజిల్‌ కొరత రైతులను కుంగదీస్తోంది. బంకుల్లో ఒక్కో రైతుకి కేవలం ఐదు లీటర్లు మాత్రమే డీజిల్‌ కొడుతున్నారు. సరిహద్దున తెలంగాణ గ్రామాల నుంచి డీజిల్‌ కోసం చాట్రాయి మండలంలోని బంకులకు వస్తుండటం పరిస్ధితికి అద్దం పడుతున్నది.

కలిదిండి : మండలంలో సుమారు 33 వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. ఆక్వా చెరువుల్లో ఆక్సి జన్‌ కొరత నివారణకు ఏరియేటర్లు నిరంతరాయంగా తిరుగుతుండాలి. అప్రకటిత విద్యుత్‌కోతలు విధిస్తుండటం తో జనరేటర్లను అమర్చి ఏరియేటర్లను తిప్పుతున్నారు. ప్రస్తుతం డీజిల్‌ కొరత ఏర్పడటంతో జనరేటర్ల ద్వారా తిరిగే ఏరియేటర్లు నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. బంకుల వద్ద డీజిల్‌ నోస్టాక్‌ అని చెప్పడంతో సరిహద్దున ఉన్న ఏలూరుపాడు, భీమవరం వెళ్లి ప్లాస్టిక్‌ టిన్నుల తో తెచ్చుకుంటున్నారు.

ముదినేపల్లి : మండలంలో ఐదు పెట్రోల్‌ బంకుల్లో పెట్రోలు, డీజిల్‌ పూర్తి కొరత ఏర్పడగా, రెండు పెట్రోలు బంకుల్లో డీజిల్‌ మాత్రమే లభ్యమవుతోంది. గురజ రోడ్డు లోని పెట్రోలు బంకు 15 రోజులుగా మూతబడింది. ఆక్వా రైతులు బంటుమిల్లి, గుడివాడ, గుడ్లవల్లేరు తదితర ప్రాంతాల బంకులకు డీజిల్‌ కోసం వెళ్తున్నారు.

చింతలపూడి : పట్టణంలో ఐదు బంకులు ఉన్నాయి. ఈ బంకుల్లో డీజిల్‌ నో స్టాక్‌ అంటూ బోర్డులు పెట్టడంతో డీజిల్‌ కోసం వచ్చిన వాహనదారులు తిరుగు ముఖం పడుతున్నారు. కేవలం పెట్రోలు అందుబాటులో ఉంది.

లింగపాలెం : మండలంలోని ఆరు ప్రధాన పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ స్టాక్‌ లేకపోవడంతో బంకుల యాజమాన్యాలు బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. బంకుల వద్ద పెట్రోల్‌ లేకపోవడంతో ఇదే అదనుగా కొందరు బయట అక్రమంగా లీటర్‌ 150 నుంచి 160 రూపాయలకు విక్రస్తున్నారు.

భీమడోలు : మండలంలో వాహనదారులు డీజిల్‌ కోసం పడిగాపులు పడుతున్నారు. వరి కోత యంత్రాల నిర్వాహకులు డీజిల్‌ తెచ్చుకుంటేనే కోతలు కోస్తామంటూ చెప్పడంతో రైతులు పెట్రోల్‌ బంకులకు పరుగులు తీస్తున్నారు. నిన్నటివరకు వాహనాలకే డీజిల్‌, పెట్రోల్‌ నింపుతామని బంకు నిర్వాహకులు నిబంధనలు పెట్టారు. దీంతో కొందరు వాహనదారుల, ఆటో డ్రైవర్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నిబంధనలు పెట్టవద్దని అధికారులు సూచించారు.

మామిడి ఎగుమతులకు దెబ్బ

నూజివీడు టౌన్‌:నూజివీడు నియోజకవర్గ పరిధి లోని నూజివీడు అర్బన్‌, నూజివీడు, ముసునూరు, ఆగిరి పల్లి, చాట్రాయి మండలాల్లో మొత్తం 74 పెట్రోల్‌ బంకు లు ఉండగా అన్ని బంకుల్లోనూ డీజిల్‌ నిలువలు అడు గంటిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ కొరత ప్రత్యక్షంగా సరుకు రవాణా రంగంపై ప్రభావం చూపుతోంది. మామి డి, పామ్‌ ఆయిల్‌ కోతల సమయం కావడంతో వాటిని రవాణా చేసేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి పశ్చిమ బెం గాల్‌ సిలిగుడికి వెళుతున్న మామిడి లోడ్‌ లారీలు శ్రీకాకు ళంలో రెండు, అనకాపల్లిలో రెండు, కొవ్వూరులో ఆరు నిలిచిపోవడం రైతులను ఆవేదనలో ముంచెత్తుతోంది. ఇప్పటికే కోడిపెను ప్రభావంతో నష్టపోయిన మామిడి రైతులకు డీజిల్‌ కొరత మూలికే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. సీడ్‌ మొక్కజొన్న సమయానికి ఫ్యాక్టరీలకు వెళ్లకపోవడంతో ఆరుదల వచ్చి దిగుబడులు తగ్గుతున్నాయంటూ రైతులు వాపోతున్నారు.

‘మామిడి, మొక్కజొన్న, పామాయిల్‌ మార్కెట్‌కు ఎగు మతి చేయాల్సిన ఆవశ్యకత దృష్ట్యా పెట్రోల్‌ డీజిల్‌ కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రత్యేకంగా కోటా పెంచి నూజివీడుకు డీజిల్‌ సరఫరా చేయాల’ని రైతు నాయకుడు చలసాని వెంకట రామారావు కోరారు. ‘మొక్కజొన్న కండేలు ఆరుదల వచ్చి దిగుబడులు తగ్గిపో తున్నాయి. రైతు సమస్యలపై దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఇంధన వనరులను ఏర్పాటు చేసి వాహనాలను ఏర్పాటు చేయాల’ని జిల్లా రైతు సంఘం కార్యదర్శి, నిమ్మగడ్డ నరసింహ కోరారు.

Updated Date - Apr 26 , 2026 | 12:26 AM