కోకో నర్సరీల అభివృద్ధి, అధిక దిగుబడికి చర్యలు
ABN , Publish Date - May 05 , 2026 | 12:48 AM
కోకో నర్సరీల అభివృద్ధి, పంట అధిక దిగుబడి సాధన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఉద్యానవన శాఖాధికారి షాజా నాయక్ తెలిపారు.
జంగారెడ్డిగూడెం రూరల్, మే 4 (ఆంధ్రజ్యోతి): కోకో నర్సరీల అభివృద్ధి, పంట అధిక దిగుబడి సాధన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఉద్యానవన శాఖాధికారి షాజా నాయక్ తెలిపారు. సోమవారం జిల్లాల్లోని పలు నర్సరీలను సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముందుగా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామానికి చెందిన రామాంజనేయ రెడ్డి నర్సరీని శాస్త్రవేత్తలు సందర్శించారు. కామవరపుకోట మండలానికి చెందిన గూడూరి శ్రీదేవి కోకో తోట, పెదవేగి మండలంలో సుబ్బారెడ్డి, జాస్తి రాజన్ బాబు, నూజివీడు ప్రాంతానికి చెందిన జగ్గవరపు వీరరాఘవరెడ్డి, ముసునూరు మండలానికి చెందిన మొరవనేని వెంకట సీత రత్నకుమారి ఖోఖో తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీ నిర్వహణలో అనుసరించవలసిన శాస్త్రీయ పద్ధతులు, ముఖ్యంగా అధిక దిగుబడి ఇచ్చే తల్లి మొక్కలను ఎంపిక చేసే విధానం, వాటి నుండి నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేసే సాంకేతికతలను శాస్త్రవేత్తలతో కలిసి షాజా నాయక్ రైతులకు వివరించారు. కత్తిరింపుల ద్వారా నర్సరీ పెంపకం విధానాన్ని ప్రదర్శనాత్మకంగా చూపించి, రైతులకు అవగాహన కల్పించారు. సీపీసీఆర్‌ఐ ద్వారా రైతులకు అందించబడిన తల్లి కోకో మొక్కలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. సీపీసీఆర్‌ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప, డాక్టర్ ఎలైన్ అప్సర తదితరులు పాల్గొన్నారు.