Share News

డెంగీ జ్వరంతో మహిళ మృతి

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:21 AM

జంగారెడ్డిగూడెం తొమ్మిదోవార్డు సాయిబాలాజీ టౌన్‌షిప్‌ ఆర్చి సమీపంలో నివాసం ఉంటున్న ముప్పిడి ఆదిలక్ష్మి (38) అనే మహిళ డెంగీ జ్వరంతో ఈ నెల 12న విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 డెంగీ జ్వరంతో మహిళ మృతి

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి

జంగారెడ్డిగూడెం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి) : జంగారెడ్డిగూడెం తొమ్మిదోవార్డు సాయిబాలాజీ టౌన్‌షిప్‌ ఆర్చి సమీపంలో నివాసం ఉంటున్న ముప్పిడి ఆదిలక్ష్మి (38) అనే మహిళ డెంగీ జ్వరంతో ఈ నెల 12న విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి బంధువు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ ముప్పిడి వీరాంజనేయులు తెలిపిన వివరాలివి.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఈనెల తొమ్మిదో తేదీ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకువెళ్లారు. అనంతరం పదో తేదీన అదే ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి డెంగీ లక్షణాలతోపాటు గుండె సంబంధిత వ్యాధి లక్షణాలు ఉన్నాయని రాజమండ్రి గుండె సంబంధిత ఆసుపత్రికి వైద్యులు రిఫర్‌ చేశారు. మృతురాలి బంధువులు ఆమెను రాజమండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షించి డెంగీ జ్వరం అధికంగా ఉందని విజయవాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈనెల 11వ తేదీ రాత్రి రాజమండ్రి నుంచి విజయవాడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ 12వ తేదీ ఉదయం మృతి చెందినట్టు తెలిపారు. మృతురాలికి 20ఏళ్ల కుమార్తె ఉంది.

స్థానిక ఆరో వార్డుకు చెందిన కొత్తూరి శ్రీను అనే వ్యక్తికి జ్వరం తగ్గకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా పరీక్షించి డెంగీ జ్వరంగా నిర్ధారించారు. ప్లేట్‌లెట్‌ల సంఖ్య బాగా తగ్గిపోవడంతో వైద్యం అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రైవేటు ఆసుపత్రిలో అతడిని కలిసి వివరాలు సేకరించారు. వారం రోజుల్లోనే ఇద్దరికి డెంగ్యూ జ్వరం రావడం వారిలో ఒకరు మృతి చెందడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి ఇంటి ప్రాంతంలోని హరిజన పేట–2 యూపీహెచ్‌సీ డాక్టర్‌ ఎన్‌.మాధురి ఆధ్వర్యంలో ఆదివారం వ్యైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పలువురికి బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకుని ఏరియా ఆసుపత్రిలోని ల్యాబ్‌కు పంపించారు.

Updated Date - Nov 16 , 2026 | 12:21 AM