నాటు కోళ్లకు భలే గిరాకీ
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:44 AM
సంక్రాంతి అనంతరం ముక్కనుమ రోజున నాన్‌వెజ్ భోజనాలు తింటారు ఈక్రమంలో కమ్మని కూరకు ఉపయోగపడే నాటు కోళ్లు, కాసులు కురిపించే పందెం పుంజులు ఏలూరు పాత బస్టాండ్ వద్ద, మెయిన్ బజార్ రోడ్డుపై వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు.
రెండు కేజీల నాటు కోడి
రూ. 1000 నుంచి రూ.1500 వరకు
ఏలూరు రూరల్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి అనంతరం ముక్కనుమ రోజున నాన్‌వెజ్ భోజనాలు తింటారు ఈక్రమంలో కమ్మని కూరకు ఉపయోగపడే నాటు కోళ్లు, కాసులు కురిపించే పందెం పుంజులు ఏలూరు పాత బస్టాండ్ వద్ద, మెయిన్ బజార్ రోడ్డుపై వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. వాటిని అమ్మేందుకు పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు, కొనుగోలు చేసేందుకు వచ్చిన జనంతో ఆ ప్రాంగణం సందడి నెలకొంది. నాణ్యమైన నాటు కోళ్లు, పుంజులను ప్రతి ఆదివారం ఎక్కువగా తీసుకువచ్చి వ్యాపారులు అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. మిగిలిన రోజుల్లో కూడా ఇక్కడ దొరికే నాటు కోళ్ల అమ్ముతుంటారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు కోళ్లు, పుంజులను సంతకు తెచ్చారు. ఒక్కో నాటు కోడి సుమారు రెండు కేజీల గలది రూ.1000 నుంచి రూ.1500 వరకు పలకగా పందెం పుంజులు వాటి రకాన్ని బట్టి ఒక్కొక్కటి మూడు వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముతున్నారు. సుదూర ప్రాంతాలకు రవాణా చేయాల్సి ఉండడంతో కోళ్లు, పుంజులను తీసుకెళ్ళడానికి ప్రత్యేక బ్యాగులు సైతం సిద్ధం చేసుకుని వచ్చారు. రేటు ఎక్కువైనా సరే కొనుగోలు దారులు పండక్కి నాటు కోడి తినాల్సిందే అంటూ కొనుగోలు చేయడం కనిపించింది.