సాగునీటిపై మాట్లాడే అర్హత కొఠారుకు లేదు..
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:09 AM
వర్షాలు పడక పోయిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహకారంతో రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా గోదావరి కాల్వ పనులు ఖరీఫ్ కన్నా ముందే పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందకు చర్యలు తీసుకున్నామని గోదావరి కాల్వ డీసీ చైర్మన్ వెలమాటి రాంబాబు, వైస్ చైర్మన్ అత్తులూరి చంద్రశేఖర్ అన్నారు.
గోదావరి కాల్వ డీసీ చైర్మన్ వెలమాటి
దెందులూరు,జూలై 18 (ఆంధ్రజ్యోతి) : వర్షాలు పడక పోయిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహకారంతో రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా గోదావరి కాల్వ పనులు ఖరీఫ్ కన్నా ముందే పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందకు చర్యలు తీసుకున్నామని గోదావరి కాల్వ డీసీ చైర్మన్ వెలమాటి రాంబాబు, వైస్ చైర్మన్ అత్తులూరి చంద్రశేఖర్ అన్నారు. కొవ్వలి గ్రామ టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల పార్టీ కార్యదర్శి కసుకూర్తి రామకృష్ణ, గ్రామ పార్టీ అధ్య క్షుడు బగాది చిన్నారావు, సాగునీటి సంఘం అధ్యక్షులతో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో నిధులు మంజూరైన కాలువ పనులు అంతంత మాత్ర మే చేశారని, మాజీ ఎమ్మెల్యే కొఠారు రాజకీయం చేయడం కోసమే శివారు పొలాలకు వెళ్లి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో బ్యాంకు అధ్యక్షుడు వెలమాటి అనిల్ కుమార్, క్లస్టర్ ఇన్‌చార్జి బోడేటి మోహన్‌బాబు, నీటి సంఘం అధ్యక్షులు చలసాని రాంబాబు, నెరుసు వెంకటరమణ, గద్దె అమరేశ్వరావు, అత్తులూరి శ్రీనివాస్ టీడీపీ నాయకులు ఉన్నారు.
గోదావరి కాలువలో నీటి ప్రవాహాన్ని పెంచాం..
కాలువను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు
రైతులకు ఇబ్బందులు కలకుండా గోదావరి కాలువలో ఇప్పటికే నీటి ప్రవాహన్ని పెంచినట్టు ఇరిగేషన్ డివిజన్ సీఈ చినబాబు, ఈఈ రమేష్‌బాబు తెలిపారు. నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాల మేరకు కాలువ నీటి ప్రవాహాన్ని శనివారం పరిశీలించారు. పోతునూరు శివారు ఉండ్రాజవరం, సత్యనారాయణపురం వంతెన నుంచి సింగవరం ఎగువ ప్రాంతాల వరకు గోదావరి కాల్వ డీసీ చైర్మన్ వెలమాటి రామచంద్రప్రసాద్ (రాం బాబు), ఇరిగేషన్ డీఈ జ్యోతి, ఏఈ సుబ్బులతో కలిసి ఇరిగేషన్ అధికారుల బృందం పర్యటించారు. కాలువ స్థితిగతులను సమీక్షించారు. కాలువలో కొట్టుకొచ్చిన గుర్రపు డెక్కను యంత్రం సాయంతో అప్పటికప్పుడు తొలగింప చేశారు. డీసీ వైస్ చైర్మన్ అత్తులూరి చంద్రశేఖర్, సీతంపేట, పోతునూరు కాలువ నీటి సంఘం అధ్యక్షులు పర్వతనేని రంగారావు, చలసాని రాంబాబు ఉన్నారు.
48 గంటల్లో సాగునీరు ఇవ్వకుంటే ఉద్యమిస్తాం..
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి
గోదావరి కాలువతో పాటు పట్టిసీమ ద్వారా 48 గంటల్లో రైతులకు సాగునీరు అందించకపోతే చలో దెందులూరు కార్యక్రమం రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి హెచ్చరిం చారు. కొవ్వలి మొండుకోడు కాల్వ రోడ్డు ప్రాంతంలో సాగునీరు అందక ఎండిపోయిన నారుమళ్లు, నాట్లు వేసిన వరి పొలాలను జడ్పీటీసీ లీలా నవకాంతం, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాటి సుధాకర్‌లతో కలిసి శనివారం పరిశీలించారు. నియోజకవర్గంలో ఖరీఫ్ పంటకే సాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే చింతమనేని విఫలం చెందారన్నారు.