తండ్రి మరణాన్ని తట్టుకోలేక..
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:56 AM
తండ్రి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైన కుమార్తె కూడా మృతి చెందిన ఘటన ముదినేపల్లి మండలం పేరూరులో జరిగింది.
అనారోగ్యంతో కుమార్తె మృతి
ముదినేపల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):తండ్రి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైన కుమార్తె కూడా మృతి చెందిన ఘటన ముదినేపల్లి మండలం పేరూరులో జరిగింది. ఆ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పుట్టి మాధవీ రాణి భర్త లక్ష్మణస్వామి ప్రమాదానికి గురై గతనెల 28న మరణించారు. అప్పట్లోనే తండ్రి భౌతిక కాయాన్ని చూసి మానసిక వికలాంగత్వం కలిగిన కుమార్తె నవీన (16) కన్నీరు మున్నీరైంది. అప్పటి నుంచి సరిగ్గా ఆహారం తీసుకోక నీరసించింది. నిత్యం తండ్రి ఫొటో చూస్తూ కన్నీరు పెట్టుకునేది. లక్ష్మణస్వామికి కుమార్తెతో అనుబంధం ఎక్కువ. నిత్యం ఆమె బాగోగులను ఆయనే చూసుకునేవాడు. ఈ నేపథ్యంలో తండ్రి దూరం కావడాన్ని నవీన తట్టుకోలేకపోయింది. ఈక్రమంలో ఆమె మంగళవారం సాయంత్రం తీవ్ర జ్వరానికి గురైంది. గుడివాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. దీంతో బుధవారం జరగాల్సిన లక్ష్మణస్వామి దశదిన కర్మను వాయిదా వేశారు. భర్త చనిపోయి పుట్టెడె దు:ఖంలో ఉన్న మాజీ సర్పంచ్ మాధవీరాణికి కుమార్తె కూడా మరణించడం తీవ్ర మనోవ్యథను మిగిల్చింది.