ఈత సరదా.. పొంచిఉన్న ముప్పు !
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:16 AM
ఎక్కువ మంది లోతు కూడా తెలియకుండా స్నేహితులతో కాలువల్లోకి దిగుతున్నారు.
పెంటపాడు, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ఓ వైపు వంటి పూట బడులు.. మరోవైపు మండుతున్న ఎండలు.. వెరసి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కాల్వల్లో ఈత కొట్టేందుకు ఉరకలు వేస్తున్నారు. వీరంతా 13 – 14 ఏళ్ల మధ్య వయసు వారే. ఓ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందటానికి ఈత కొట్టాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది లోతు కూడా తెలియకుండా స్నేహితులతో కాలువల్లోకి దిగుతున్నారు. వీరిలో చాలా మంది కనీసం ఈత కూడా రాకుండానే ప్రమాదకరమైన కాలువలో ఈత కొట్టే సాహసం చేస్తున్నారు. సోమవారం పెంటపాడు మిడ్ లెవిల్ కాలువలో కొందరు విద్యార్థులు ఈత కొడుతూ కనిపించారు. వీరందరూ విద్యార్థులే. వీరిని ఫొటోలు తీసేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా కాలువ నుంచి బయటకు వచ్చి గట్టున ఉన్న బట్టలు తీసుకుని పరుగులు పెట్టారు.
తల్లిదండ్రులూ మీకర్థమవుతోందా ?
కొన్ని రోజుల క్రితం కాకర్లమూడికి చెందిన ఒక విద్యార్థి స్నేహితులతో పరిమెళ్ళ వెంకయ్య వయ్యేరు కాలువ వద్ద ఈత కొట్టేందుకు కాలువలోకి దిగి లోతు తెలియక మునిగి పోయి మృతి చెందాడు. కొన్ని నెలల క్రితం పెంటపాడుకు చెందిన ఒక యువకుడు స్నేహితులతో పరిమెళ్ల చినకాపవరం డ్యాం వద్ద ఈతకు వెళ్లి ఊబిలో మునిగిపోయాడు. రెండేళ్ల క్రితం రావిపాడుకు చెందిన ఒక విద్యార్థి సమీపంలోని వెంకయ్య వయ్యేరు కాలువలో స్నానం చేసేందుకు దిగి మునిగిపోయాడు. తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కాల్వల్లో స్నానాల విషయంలో వారి పర్యవేక్షణ కచ్చితంగా వుండాలి. మరో ప్రమాదం జరగకుండా వారే పిల్లలను కాపాడుకోవాలి.