హైవేపై నిర్లక్ష్యం..!
ABN , Publish Date - May 12 , 2026 | 12:39 AM
జాతీయ రహదారి పనుల్లో నిర్లక్ష్యంతో వాహదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
సగం సగం పనులతో ప్రమాదాలు
మరమ్మతుల కోసం తవ్వేసిన రోడ్డు
పడి గాయాలవుతున్న జనం
తణుకు రూరల్, మే 11 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి పనుల్లో నిర్లక్ష్యంతో వాహదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. తాడేపల్లిగూడెం– తణుకు మద్య జాతీయ రహదారిపై మరమ్మతుల కోసం పలుచోట్ల రోడ్డును యంత్రాలతో పై పొర తొలగించారు. నాలుగు చోట్ల ఇలా తవ్వి వదిలేశారు. రాత్రి సమయాల్లో తవ్వేసిన రోడ్డుపై స్వీడ్‌గా వెళుతున్న వాహనాలు స్కిడ్ అయి పడిపోతున్నారు. రోడ్డు తవ్విన వెంటనే పనులు చేపట్టకుండా వారాల తరబడి తాత్సారం చేయండంతో ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయి. దువ్వ వెంకయ్య కాలువ సమీపంలో ఆదివారం రాత్రి ఇలా సుమారు ఏడు బైక్‌లు జారిపోవడంతో సుమారు 12 మంది వరకూ గాయాల పాలయ్యారు. ఆ దారిలో ప్రయాణిస్తున్న రాజమండ్రికి చెందిన ఫస్ట్ అడిషనల్ జడ్జి ప్రకాష్‌బాబు తన కారును ఆపి క్షతగాత్రుల కోసం 108కి ఫోన్ చేశారు. కొంతమందిని జడ్జి తన వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసు కొచ్చారు. తర్వాత ఆయన జాతీయ రహదారి సిబ్బందికి పోన్ చేసి అక్కడ ప్రమాదాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం సాయంత్రం వరకూ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. గాయపడిన పలువురి పరిస్థితి ప్రమాదకరంగా వుండటంతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రహదారి నిర్వహణ అధికారి ఒకరికి సోమవారం మద్యాహ్నం ఫోన్ చేయగా రోడ్డు మరమ్మతులకు సంబందించిన తారు కొరత వచ్చిందని రాగానే పనులు చేపడ తామని చెప్పారు. మెయింటినెన్స్ మేనేజర్ నంబర్‌కు ఫోన్ చేయగా ప్రమాదాలు జరిగినట్లు తనకు తెలియదని సమాధానం చెప్పారు.