Share News

కూలుతోన్న వంతెనలు

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:16 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పలు చోట్ల ప్రధాన రహదారుల మధ్య వున్న వంతెనలు, గ్రామాల్లో పంట కాల్వలపై వున్న బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరాయి.

కూలుతోన్న వంతెనలు
మాధవరం–కంసాలిపాలెం మధ్య ఎర్రకాలువపై కూలిన వంతెన (ఫైల్‌)

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిలు.. తప్పని ఇబ్బందులు

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పలు చోట్ల ప్రధాన రహదారుల మధ్య వున్న వంతెనలు, గ్రామాల్లో పంట కాల్వలపై వున్న బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరాయి. రైలింగులు విరిగిపోవడం, శ్లాబ్‌ పెచ్చులూడి అధ్వాన స్థితికి చేరాయి. ఆయా గ్రామాల మీదుగా ప్రయాణాలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి వంతెనల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

కూలిన ‘మాధవరం కంసాలిపాలెం వంతెన’

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం మండలం మాధవరం–నిడదవోలు మండలం కంసాలిపాలెం మధ్య ఎర్రకాలువ వంతెన కూలి పోయి ఎనిమిదేళ్లు గడుస్తోంది. ఈ వంతెన లేక ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వంతెన నిర్మాణం కోసం రూ.9.5 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. సమస్య పరిష్కా రానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ చొరవతో రూ.18లక్షలతో ప్రత్యామ్నా యంగా రెండు గ్రామాల మధ్య ఎర్రకాలువపై సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.

రైలింగ్‌ విరిగిన కోళ్లపర్రు వంతెన

ఆకివీడురూరల్‌ : ఆకివీడు మండలం కోళ్లపర్రు వంతెన శిథిలావస్థకు చేరుకుంది. తరటావ– క్రొత్తచెరువు రోడ్డులో భాగంగా చినకాపవరం డ్రెయిన్‌పై సుమారు 70 ఏళ్ల క్రితం ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెనపై ఒక్క వాహనం మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉంటుంది. 30 టన్నుల వాహనాలు ఈ వంతెనపై ప్రయాణించడం వల్ల రైలింగ్‌లు విరిగిపోయి, శ్లాబ్‌లు పెచ్చులూడి ప్రమాదకరంగా తయారైంది. వరద సమయంలో వంతెన మీద నుంచి నీరు ప్రవహిస్తుంది. ఈ వంతెన మీదుగా రాజులపేట, క్రొత్తచెరువు, కళింగగూడెం, చినిమిల్లిపాడు, సిద్దాపురం గ్రామాలకు వెళ్లవచ్చు. వంతెన కూలిపోతే సమస్య మరింత జఠిలమవుతుందని వాపోతున్నారు. 2025లో వంతెన నిర్మాణానికి రూ.5 కోట్లకు ప్రతిపాదనలు పంపినట్టు ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీహరిరాజు తెలిపారు.

ప్రమాదకరంగా మండపాక వంతెనలు

తణుకు రూరల్‌ : తణుకు మండలం మండపాక మడు గుపై రెండు వంతెనలు శిథిలావస్థకు చేరి ప్రమాద కరంగా మారాయి. తణుకు నుంచి మండపాక మీదుగా వేల్పూరు, అత్తిలి మండలం బల్లిపాడు వెళ్లే ఈ రోడ్డులో రెండు చోట్ల మండపాక మడుగు నుంచి అత్తిలి కాలువకు ఉన్న వైర్‌, మండపాక వేల్పూరు రోడ్డులో వేల్పూరు రైల్వే గేటు సమీపంలో మండపాక మడుగుపై వున్న వంతెనలు కొంతకాలంగా శిథిలా వస్థకు చేరాయి. ఈ వంతెనలు రోడ్డు కంటే పల్లంగా ఉండడంతో పాటు రక్షణ గోడలు కూలిపోవడంతో ప్రమాదకరంగా మారియి. మండపాకలో రెండు చోట్ల వంతెనల నిర్మాణానికి రూ.2.20 కోట్లతో ప్రతిపాదనలు, యల్లారమ్మ గుడి సమీపం వద్ద వంతెన నిర్మాణానికి కోటి రూపాయలు తదితర వంతెనలకు ప్రతిపాదనలు పంపించామని నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామని తణుకు పంచాయతీరాజ్‌ డీఈఈ కోనా సత్యరుషి తెలిపారు.

బీటలు తీసిన తాడేరు డ్రెయిన్‌

ఆచంట : కొడమంచిలి నుంచి ఆచంట వెళ్లే ఆర్‌ అండ్‌బీ రోడ్డులోని తాడేరు డ్రెయిన్‌పైవున్న వంతెన గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరింది. వంతెన కింద భాగం బీటలు తీసి పిచ్చి మొక్కలతో నిండి ఉంది. ఆర్‌అండ్‌బీ రోడ్డుకు మధ్యలో ఉండడంతో ఈ వంతెనపై బీటీ రోడ్డు ఉండడంతో చూసే వారికి శిథిలావస్థలో ఉన్నట్లు కనిపించదు. కొత్త వంతెనకు అధికారులు సుమారు రూ.3 కోట్లు నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేయాలని కోరుతున్నారు. భీమలాపురం, శేషమ్మచెరువు వెళ్లే రహదారిలో వంతెనలు బలహీనంగా మారాయి.

రక్షణలేని గుండేరు వంతెన..

పెదవేగి : పెదవేగి మండలం వెంగంపాలెం– ముండూరు మధ్య దూరం రెండు కిలోమీటర్లు. మధ్యలో గుండేరు ఉంది. ముండూరు వెళ్లడానికి చుట్టూ ఆరు కిలోమీటర్లు దూరం తిరిగి వెళ్లాల్సి వస్తోందని వెంగం పాలెం గ్రామస్థులు మొర పెట్టుకోవడంతో రెండున్నర దశాబ్దాల కిందట గుండేరుపై వంతెన నిర్మిం చారు. ఈ వంతెన రాకతో వెంగంపాలెం వాసులకు ముండూరు వెళ్లడానికి దూరం నాలుగు కిలోమీటర్లు దూరం తగ్గింది. అంతా బాగానే ఉన్నప్పటికీ వంతెనపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా రక్షణకు ఎటువంటి ఆధారంలేకపోవడంతో రైతులు, కూలీలు భయపడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు తరలించే సమయంలో వంతెన దాటేవరకు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని వంతెనకు రక్షణగా రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

కళ్లచెరువులో వంతెన శిథిలం

కామవరపుకోట : కళ్లచెరువు గ్రామ గుండేరు వాగుపై గతంలో నిర్మిత మైన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. కొత్త వంతెన నిర్మాణానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఈ వంతెన కామవరపుకోట, లింగపాలెం మండలాలకు వారధిలా ఉంటుంది. భారీ వర్షాలు వస్తే పోలీసుల రక్షణతో రాకపోకలను స్తంభింపచేయడంతో రెండు మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త వంతెన నిర్మించడం లేదా వంతెనను పటిష్టపర్చడం గానీ చేయాలని ప్రజానీకం కోరుతున్నారు.

ఎనిమిదేళ్ల ఎదురుచూపు.. బైనేరు బ్రిడ్జి

జంగారెడ్డిగూడెం/ కొయ్య లగూడెం : జంగారెడ్డిగూడెం పట్టణంలో బైనేరు వాగుపై వంతెన కూలిపోయి ఎనిమి దేళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించు కోవడంలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన భారీ వరదల కారణంగా వందేళ్లకుపైగా చరిత్ర కలిగి, బ్రిటీష్‌ ప్రభుత్వంలో నిర్మించిన బైనేరు వంతెన కూలిపోయింది. అనంతరం 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వంలో రూ.3.5 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఆ సమయంలో పలుమార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నిధులు పెంచకపోవడం, మెటీరియల్‌ ధర పెరగడంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా ఇంకా బైనేరు బ్రిడ్జి పనులు ప్రారంభించక పోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి పడినప్పటి నుంచి ఫైర్‌స్టేషన్‌ పక్కనే ఉన్న అప్రోచ్‌ రహదారిలో ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ డీఈ హరికృష్ణ మాట్లాడుతూ బైనేరు బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.5 కోట్లు అంచనాలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు.

Updated Date - Aug 09 , 2026 | 12:16 AM