Share News

ఉన్న గింజలూ దక్కవా !

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:02 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్‌ తుఫాన్‌ మంగళవారం తీవ్ర తుఫాన్‌గా మారింది.

ఉన్న గింజలూ దక్కవా !
భీమవరంలో తడిసిన వరిపనలు ఎండబెడుతున్న రైతు

అక్వాన్‌ తుఫాన్‌పై ఆందోళన

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరికలతో

భయం.. భయం

దాళ్వా సాగుపైనా ప్రభావం

తీరంలో మారిన వాతావరణం

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్‌ తుఫాన్‌ మంగళవారం తీవ్ర తుఫాన్‌గా మారింది. తుఫాన్‌ కారణంగా జిల్లాలో ఈనెల 19, 20 తేదీల్లో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అర్నబ్‌, మురసు తుపాన్‌ల బీభత్సానికి అల్లాడిన ప్రజలు, రైతులు ఇప్పుడు మళ్ళీ అతి తీవ్ర తుఫాన్‌ వస్తోందంటే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు సంభ వించాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మబ్బుల వాతావరణం పెరిగింది. గాలుల తీవ్రత లేక పోయినా తుఫాన్‌ సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి.

భీమవరం రూరల్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మొన్న రెండు తుఫాన్లు వరిపంటను నేలమట్టం చేసింది. ఉన్న ధాన్యపు గింజలు ఏరుకునే రైతన్నలకు అక్వాన్‌ తుఫాన్‌ మరో గండంగా మారింది. ప్రస్తుతం వరి చేలల్లో 2 అడుగుల లోతు పైగా నీరుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం భారీ వర్షాలు పడితే ఇక మాసూళ్ల జోలికి వెళ్లక్కర్లేదు. జిల్లాలో 2 లక్షల 30 వేల 875 ఎకరాల్లో సాగు చేయగా మొత్తం సాగంతా నేలవాలి నీటమునిగింది. తాడేపల్లిగూడెం వంటి మెట్ట ప్రాంతాల్లో గత వారం రోజులుగా నీరుబయటకు వెళ్లిన పంట పొలాలను మాసూల్లు చేస్తున్నారు. అయితే దిగుబడి రైతులను డీలాపడేలా చేస్తుంది. ఇప్పటి వరకు 10 వేల ఎకరాల్లో పంట మాసూళ్లు జరిగింది. 2 మెట్రిక్‌ టన్నుల ధాన్యమే దిగుబడిగా వచ్చింది. ఈ లెక్కన ఎకరానికి 3 బస్తాల కన్న తక్కువ దిగుబడి వచ్చింది. పడిపోయిన చేలల్లో మాసూళ్లకు 6 నుంచి 8 వేల వరకు ఖర్చువుతుంది. ధాన్యం ద్వారా వచ్చేది రూ.5 వేలకు మించి ఉండదు. రెండు తుఫాన్ల కారణంగా డెల్టా ప్రాంతంలోని వరి పొలాల్లో రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయి ఉంది. మురుగు డ్రెయిన్లు మొరాయిం చడం వల్ల గడిచిన 10 రోజుల్లో 2 అంగుళాల నీరు మాత్రమే చేలల్లో తగ్గింది. దీనిబట్టి అంచనా వేస్తే మరో 20 రోజులు అయితే కానీ దాళ్వా నారుమడులు వేసుకునేందుకు వీలు పడదు. ఇలాంటి తరుణంలో తుఫాన్‌ కారణంగా మరోసారి భారీ వర్షాలు నమోదైతే చేలల్లో నీరు పెరిగిపోయి డిసెంబర్‌ నెలాఖరు వరకు కూడా నారుమడులు వేసుకోవడానికి వీలుపడదు. సార్వాసాగుపై ఆశలు వదులుకున్న రైతులు ఇప్పుడు దాళ్వాపై కంగారు మొదలైంది.

తుఫాన్‌ ఎదుర్కొనేందుకు సిద్ధం

ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఉషారాణి

తాడేపల్లిగూడెం,నవంబరు 17(ఆంధ్రజ్యోతి): అక్వాన్‌ తుఫాన్‌ ఎదుర్కొనేందుకు విద్యుత్‌ శాఖ సిద్ధంగా ఉన్నట్టు ఏపీ ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఉషారాణి తెలిపారు. మంగళవారం ఆమె వివరాలు తెలిపారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ఐదు రోజుల ముందుగానే ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. 15వ తేదీ నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెట్లు, కొమ్మల తొలగింపు చేపట్టాం..వాలిన విద్యుత్‌ స్థంభాలను కూడా సరి చేశాం.. 33 కేవీ, 11 కేవీ, ఎల్‌టీ లైన్లు మరమ్మతు పనులు చేపడుతున్నాం. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 51 పోల్‌ డిగ్గింగ్‌ మిషన్లు, 30 క్రేనులు, 20 జేసీబీలు, 30 జనరేటర్లు, 45 వాహనాలు, 12 డీవాటరింగ్‌ పంపుసెట్లు ఏర్పాటు చేశాం. 33 బృందాలతో 450 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఇతర జిల్లా నుంచి కూడా అదనపు బృందా లను రప్పించాం. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, విద్యుత్‌ తీగలు తెగిపడటం, స్తంబాలు విరిగి పడినా ప్రజలు వెంటనే తెలియజేయాలని కోరారు. దీనికోసం ఏపీఈపీడీసీఎల్‌ ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు చేయాల న్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కంట్రోల్‌ రూమ్‌ : 94906 10152, తాడేపల్లిగూడెం డివిజన్‌ కంట్రోల్‌ రూమ్‌ : 94931 77806, భీమవరం డివిజన్‌: 94931 77646, నర్సాపురం డివిజన్‌ :73820 50943 నంబర్లకు తెలియజేయాలని కోరారు.

తీరంలో బిక్కుబిక్కు

నరసాపురం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): తీర ప్రాంతంలో తుఫాన్‌ ఫియర్‌ మొదలైంది. మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడిప్పుడే అర్నబ్‌ తుఫాన్‌ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకుంటున్న సమయంలో మరో తుఫాన్‌ హెచ్చరికతో కంటి మీద కునుకులేకుండా పోయింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో నెలకొన్న అక్వాన్‌ తుఫాన్‌ కూడా తీరం దాటే సమయంలో పెనుబీభత్సం సృష్టించవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమ త్తమయ్యారు. మళ్లీ అంథకారం నెలకొంటుందన్న ఆందోళనతో ముందస్తుగా కొవ్వుత్తులు, దీపాలను రెడీ చేసుకున్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలను కూడా సిద్ధంగా ఉంచుకుంటున్నారు. అధికారుల హెచ్చరికతో వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరుగుముఖం పట్టారు. ఇప్పటికే చాలాబోట్లు బియ్యపుతిప్ప వద్దకు చేరుకున్నాయి. మిగిలిన బోట్లను కూడా వెనక్కి రపిస్తున్నారు. సాయంత్రం నుంచి సముద్రంలో అలల ఉధృతి పెరిగింది.

Updated Date - Nov 18 , 2026 | 12:02 AM