Share News

రాష్ట్రంలో 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:22 AM

తుఫాన్‌ కారణంగా రాష్ట్రంలో ఉద్యాన పంటలకు భారీనష్టం వాటిల్లిన నేపథ్యంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వీసీ కట్టుపల్లి ధనుంజయరావు సోమవారం వెల్లడించారు.

రాష్ట్రంలో 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం
నరసాపురం పర్యటనకు వచ్చిన సీఎంకు ఉద్యానపంట నష్టంపై తెలియజేస్తున్న వీసీ కె.ధనుంజయరావు(ఫైల్‌ ఫొటో)

తాడేపల్లిగూడెం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి):అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా రాష్ట్రంలో ఉద్యాన పంటలకు భారీనష్టం వాటిల్లిన నేపథ్యంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వీసీ కట్టుపల్లి ధనుంజయరావు సోమవారం వెల్లడించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వ్యవసాయ శాఖా మంత్రి కింజరపు అచ్చెనాయుడు ముంపు ప్రభావిత ప్రాంతాలో పర్యటించా రన్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో ఉద్యానపంటలకు కలిగిన నష్టాన్ని వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 15 జిల్లాలో 23,211 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. దీని వల్ల సుమారు 78,967 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. అక్టోబరు మాసంలో కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో సాధారణంకంటే అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. బలమైన ఈదురుగాలులు వల్ల అరటి, కొబ్బరి, బొప్పాయి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న కొబ్బరి తోటల పునరుద్ధరణకుగాను ఐదేళ్లు పైబడిన ప్రతి చెట్టుకు 500గ్రాముల యూరియా, ఒక కిలో సింగిల్‌ఫాస్పేట్‌, 1.5 కిలోల ఎంఓపీ ఎరువులుగా అందించాలని రైతు లకు వీసీ సూచించారు. మొవ్వకుళ్లు నివారణకు లీటరు నీటికి 3గ్రాములు కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ కలిపి మొవ్వమొదళ్లలో పోయాలన్నారు. చెట్టు త్వరగా కోలుకోవడానికి లీటరు నీటికి 5గ్రాముల పొటాషియం నైట్రేట్‌ కలిపి పిచికారి చెయాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉద్యాన విశ్వవిద్యాలయం, కేవీకేలు పనిచేస్తున్నాయన్నారు. వీటి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ కోరారు.

Updated Date - Nov 03 , 2026 | 12:22 AM