కనెక్షన్ వెనుక.. కథేంటో?
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:20 AM
ఇంటికి, వ్యవసాయ బోరుకు గాని కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే సామాన్యులను నెలల తరబడి చుట్టూ తిప్పించుకునే విద్యుత్‌శాఖ అధికారులు, అక్రమంగా ఏర్పాటైన చేపల చెరువులకు తక్షణం కనెక్షన్లు ఇవ్వడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమ చెరువులకు శరవేగంగా విద్యుత్ కనెక్షన్లు
కోమటిలంకలో నిబంధనలకు పాతర
సామాన్యులు మాత్రం కాళ్లరిగేలా ప్రదక్షిణలు
విద్యుత్‌శాఖ తీరుపై విమర్శలు
మంత్రి మనోహర్‌కు జనసేన నాయకుల ఫిర్యాదు
ఏలూరు రూరల్, జూన్ 5(ఆంధ్రజ్యోతి):ఇంటికి, వ్యవసాయ బోరుకు గాని కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే సామాన్యులను నెలల తరబడి చుట్టూ తిప్పించుకునే విద్యుత్‌శాఖ అధికారులు, అక్రమంగా ఏర్పాటైన చేపల చెరువులకు తక్షణం కనెక్షన్లు ఇవ్వడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏలూరు రూరల్ మండలం కోమటిలంక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న చేపల చెరువులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే భూమి పత్రాలు, అనుమతులు,ధ్రువీకరణ పత్రాలు అంటూ సవాలక్ష ప్రశ్నలు సంధించే అధికారులు కోమటిలంకలోని అక్రమ చెరువుల విషయంలో ఈ నిబంధనలు ఎలా పక్కన పెట్టారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అనుమతి లేని ప్రాంతంలో చేపలు చెరువులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నా వాటికి విద్యుత్ సరఫరా కల్పించడం వెనుక ఉన్న కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిలంకలో అక్రమ చేపల చెరువులను రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ప్రారంభ దశలోనే అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అధికారుల నిర్లక్ష్యమే..
ప్రాంతంలో అక్రమంగా తవ్విన చేపల చెరువులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు కావడం వెనుక సంబంధిత శాఖల నిర్లక్ష్యం ఉంది. సామాన్య ప్రజల విద్యుత్ కనెక్షన్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటే భూపత్రాలు, అనుమతులు, ఇతర ధ్రువపత్రాలు పేరుతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అక్రమ చెరువుల విషయంలో మాత్రం నిబంధనలు ఎందుకు అమలు కావడం లేదు.
– రత్నం, గుడివాకలంక
కనెక్షన్లు ఎలా ఇస్తున్నారు?
సామాన్య ప్రజలు కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే పలు రకాల ధ్రువపత్రాలు, అనుమతులు కోరుతున్న విద్యుత్‌శాఖ అధికారులు, కొల్లేరు ప్రాంతంలోని అక్రమ చేపల చెరువులకు మాత్రం సులభంగా విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సామాన్య రైతులు, గృహ యజమానులు నెలలు తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుండగా, అక్రమ చెరువులకు వేగంగా కనెక్షన్లు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలపై విచారణ జరపాలి.
–చందు, బీసీ నాయకుడు
ప్రభుత్వ భూముల ఆక్రమణపై మంత్రి మనోహర్‌కు ఫిర్యాదు
ఏలూరు రూరల్ మండలం కోమటిలంక పరిధిలో సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులుగా మార్చి సాగు చేస్తున్నారని ఆరోపిస్తూ దెందులూరు నియోజకవర్గ జనసేన అధికార ప్రతినిధి తాతపూడి చందు, జనసేన మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు శుక్రవారం ఏలూరుకు విచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ చెరువులకు అధికారికంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించారని, ఆక్రమణకు గురైన భూములను తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకురావాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సమగ్ర విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.