Share News

భీమవరం కిటకిట

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:20 AM

భీమవరంలో సంక్రాంతి పండుగ రెండు రోజులు ముందుగానే కనిపిస్తోంది. ఏ ప్రాంతం చూసినా వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి.

 భీమవరం కిటకిట
భీమవరంలో గంటల కొద్దీ ట్రాఫిక్‌లో నిలిచిన వాహనాలు

గంటల తరబడి కదలని వాహనాలు

ట్రాఫిక్‌ పోలీసుల తీరుతో స్తంభించిన రాకపోకలు

నరకం చూసిన వాహనదారులు..

భీమవరం క్రైం, జనవరి 12(ఆంధ్రజ్యోతి):భీమవరంలో సంక్రాంతి పండుగ రెండు రోజులు ముందుగానే కనిపిస్తోంది. ఏ ప్రాంతం చూసినా వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. గంటల కొద్దీ వాహనాలు ఎటూ కదలడం లేదు. ఫలితంగా ప్రయాణికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఎక్కువగా తెలంగాణ, కర్నాటక, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాల రద్దీతో పట్టణం కిక్కిరిసిపోయింది. వాహనాలు ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో చాలా మంది ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. అటు ట్రాఫిక్‌ పోలీసులు అతి చేయడంతో రద్దీ మరింత పెరిగింది. అంబేద్కర్‌ సెంటర్‌లో వాహనాలను పట్టణంలోకి రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి గరగపర్రు రోడ్డులోకి, గొల్లవానితిప్ప రోడ్డులోకి మళ్ళించడంతో రద్దీ మరింత పెరిగింది. వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఇరుక్కుపోయాయి. బుధవారం భోగి పండుగ నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే బంధువులు, స్నేహితులు పట్టణానికి చేరుకున్నారు. ఎక్కువగా విజయవాడ నుంచి మచిలీపట్నం మీదుగా లోసరి, గొల్లవానితిప్ప మీదుగా భీమవరం చేరుకున్నారు. వాహనాలు క్రమబద్దీకరించడంలో ట్రాఫిక్‌ పోలీసులు విఫలమయ్యారు. సరైన ప్రణాళిక లేకుండా వాహనాలను మళ్లించడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. పట్టణంలో ప్రకాశం చౌక్‌, అంబేద్కర్‌ సెంటర్‌, బుధవారం మార్కెట్‌, మావుళ్ళమ్మ గుడి సెంటర్‌, రెస్ట్‌ హౌస్‌ రోడ్డు, మెంటేవారి తోట, గరగపర్రు రోడ్డు పూర్తిగా వాహనాలతో నిండిపోయాయి. షాపింగ్‌లకు వచ్చే వాహనాలు ఒక్కసారిగా పట్టణంలోకి రావడంతో రద్దీ మరింత పెరిగింది. మరోపక్క సివిల్‌ పోలీసులు పందేల బరులు ఏర్పాటు చేయకూడదని, చేస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామంటూ గ్రామాల బాట పట్టడంతో పోలీసు సిబ్బంది పట్టణంలో తగ్గింది.

ఎక్కడ చూసినా తెలంగాణ వాహనాలే

పట్టణంలో సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి తెలంగాణకు చెందిన టీజీ, టీఎస్‌ రిజిస్ట్రేషన్‌లతో ఉన్న వాహనాలే దర్శనమిచ్చాయి. పండుగ రోజుల్లో మరింత రద్దీగా ఉంటుందని వారు ముందుగానే పట్టణానికి చేరుకునేందుకు రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్‌ రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

తాడేపల్లిగూడెంలో జనం పాట్లు

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి):తాడేపల్లిగూడెం పట్టణ వాసులను సోమవారం ట్రాఫిక్‌ సమస్య ఇబ్బంది పెట్టింది. రోడ్లన్నీ బస్సులు, కార్లు, ఆటోలు, మోటారు సైకిల్స్‌తో రద్దీగా మారింది. సంక్రాంతి పండుగకు ఊర్లు వెళ్లే వారు, వచ్చే వారితోపాటు షాపింగ్‌లకు వచ్చేవారు, హోల్‌ సేల్‌ మార్కెట్‌కు వచ్చే వ్యాపారులు, వినియోగదారులతో కిటకిటలాడింది. అసలే ఇరుకు రహదారులు కావడంతో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారింది. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ రద్దీ కారణంగా ప్రజలు ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు రద్దీని క్రమబద్దీకరించే ప్రయత్నం చేశారు.

Updated Date - Jan 13 , 2026 | 01:20 AM