Share News

బెట్టింగ్‌ భూతం..

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:23 AM

బెట్టింగ్‌ అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. ఏడాది పొడవునా క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతూండటంతో బెట్టింగ్‌ రాయుళ్లు వాటిపైనే దృష్టి పెడుతున్నారు.

బెట్టింగ్‌ భూతం..

అమాయకులే సమిధలు

ఆన్‌లైన్‌లో బెట్టింగులతో జేబులు గుల్ల

బికారులవుతున్న కోటీశ్వరులు!

పోలీసులకు పట్టుబడుతున్నా ఆగని బెట్టింగ్‌లు

భీమవరం క్రైం/తాడేపల్లిగూడెం రూరల్‌/అత్తిలి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. ఏడాది పొడవునా క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతూండటంతో బెట్టింగ్‌ రాయుళ్లు వాటిపైనే దృష్టి పెడుతున్నారు. కొందరైతే తమ విధులకు కూడా వెళ్ళకుండా బెట్టింగ్‌పైనే ఆధారపడి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరు కోటీశ్వరులు కూడా ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడుతున్నా రు. ఎన్నో రకాలుగా పోలీసు శాఖ హెచ్చరికలు చేస్తున్నా మార్పు రావడం లేదు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అందు బాటులోకి రావడంతో కొంత వరకు దళారులు తగ్గినా బెట్టింగ్‌ భూతం బాగా పెరిగింది. పేకాట వల్ల చాలా మంది రోడ్డున పడేవారు అయితే క్రికెట్‌ బెట్టింగ్‌ల వల్ల దానికి నాలుగింతలు రోడ్డున పడుతున్నారు.

ఆన్‌లైన్‌లో పలు బెట్టింగ్‌లు

ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రావడం, అలాగే ఇంటర్నెట్‌ కూడా ఉండటంతో బెట్టింగ్‌లు ఆన్‌లైన్‌లోనే ఆడుతున్నారు. పవర్‌ ప్లేలో ఆరు ఓవర్లకు ఇన్ని రన్స్‌ కొడతారని, అలాగే 10 ఓవర్లకు ఇన్ని రన్స్‌ కొడతారని, మ్యాచ్‌ 20 ఓవర్లలో పూర్తవుతున్న నేపథ్యంలో ఇన్ని రన్స్‌ కొడతారని, దాంతోపాటుగా ఓవర్‌కు ఇన్ని రన్స్‌ కొడతారని.. ఇలా పలు రకాల బెట్టింగ్‌లు కాస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల 20–20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరుగుతుండటంతో కొన్ని వేల కోట్లు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలో వరల్డ్‌ కప్‌ మొదలైనప్పటి నుంచి సెమీ ఫైనల్‌ వరకు సుమారు రూ. 200 కోట్ల వరకు బెట్టింగ్‌లు జరిగినట్లుగా అంచనా. ఈ రకంగా ఆన్‌లైన్‌లో పలు రకాల బెట్టింగ్‌లు అందుబాటులోకి రావడం, వాటికి తగ్గట్లుగా ముందుగానే ఫోన్‌ లో సరిపడ నగదు జమ చేసుకుని ఆన్‌లైన్‌లో పందేలు కాస్తున్నారు. అత్తిలిలో బుకీలు అమాయకుల జీవితాలతో చెలగాటాలా డుతున్నారు. పోలీసులే ఈ దందాకు రక్షణగా నిలిచారన్న విమర్శలున్నాయి.

ఏడాదిలో 3 కేసులు..

గత ఏడాది కాలంగా ‘పశ్చిమ’లో క్రికెట్‌ బెట్టింగ్‌ల కేసులు 3 నమోదయ్యాయి. సుమారు రూ. 71 వేలు నగదు, 66 సెల్‌ఫోన్లు, 4 ల్యాప్‌ట్యాప్‌లు, అలాగే రూటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది దళారుల ద్వారా బెట్టింగ్‌లు జరుగుతుండగా పోలీసులకు పట్టుబడిన కేసులు. ఆన్‌లైన్‌లో ఆడిన వాటికి ఆధారాలు లేక పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లను నిర్మూలిస్తే చాలా వరకు క్రికెట్‌ బెట్టింగ్‌ భూతాన్ని అరికట్టవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. దాంతోపాటుగా సాయంత్రం వేళల్లో బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు వంటి వాటిలో కూడా ప్రత్యేకించి పెద్ద పెద్ద స్ర్కీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్‌లు తిలకిస్తూ పందేలు కాస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నా మార్పు లేదు

–జి. కాళీచరణ్‌, భీమవరం టూ టౌన్‌ సీఐ

గతంలో దళారులు మధ్యలో ఉండి వారి ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడేవారు. తద్వారా వారిని గుర్తించి అరెస్ట్‌ చేయడానికి అవకాశం ఉండేది. ఆ రకంగా చాలా వరకు అరికట్టగలిగేవారం. అయితే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల వల్ల ఎవరి మొబైల్‌ ఫోన్‌లో వారు బెట్టింగ్‌లు కాస్తూ జేబులు గుల్లచేసుకుంటున్నారు. లక్షలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్‌ల వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, బెట్టింగ్‌ల జోలికి వెళ్ళవద్దని ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎవరిలోను మార్పు రావడం లేదు. పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ యాప్‌లను తొలగిస్తే చాలా వరకు బెట్టింగ్‌లను అరికట్టవచ్చు.

పాలకోడేరు మండలానికి చెందిన ఒక వ్యక్తి స్థితిపరుడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు. ఏకంగా రెండు కార్లు కూడా కొనిచ్చాడంటే అతని పెంపకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అతని కొడుకు బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. సుమారు రూ. 2 కోట్లు అప్పు చేశాడు. తండ్రి మందలించినా వినలేదు. అప్పులిచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో చేసేదేమీ లేక తండ్రి అప్పులు తీర్చాడు.

వీరవాసరానికి చెందిన ఒక పేద యువకుడు తాపీ పనికి వెళ్లి సాయంత్రానికి రూ. వెయ్యి సంపాదించేవాడు. అత ను ఆన్‌లైన్‌లో యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు ఆడటం ప్రా రంభించాడు. భార్యాపిల్లలను పట్టించుకునేవాడు కాదు. చివరకు రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు తీర్చలేక ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

భీమవరం పట్టణానికి చెందిన సంపన్నుడు కోట్లలో పందేలు కాస్తూ డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరకు తన ఐదు ఎకరాల చెరువును కూడా అమ్మినా అప్పులు తీరలేదు. దీంతో చేసేదేమీ లేక అందరికీ ఐపీ నోటీసులు పంపి ఊరొదిలి కుటుంబంతో వెళ్ళిపోయాడు.

తాడేపల్లిగూడెం పట్టణంలో సుధీర్‌ (పేరు మార్చాం) ఇంజనీరింగ్‌ చదివాడు. సరైన ఉద్యోగం రాలేదు. ఓ ప్రైవే టు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి వ్యాపారి. కొడుకు చిన్నపాటి ఉద్యోగమే చేస్తుండటంతో అతని జీతం గురించి తండ్రి అడిగేవారు కాదు. సుధీర్‌ క్రికెట్‌పై మక్కువతో ఎక్కువగా ఫోన్‌లోనే మ్యాచ్‌లను చూస్తుం డేవాడు. సరదాగా ప్రారంభించిన బెట్టింగ్‌లు క్రమేపీ సుధీర్‌ లక్షల్లో అప్పులు చేసే వరకూ వెళ్లింది. ఇదంతా ఇంట్లో తెలియకుండా మేనేజ్‌చేసిన సుధీర్‌ అప్పుల బాధతో ముభావంగా ఉండడంతో తండ్రి నిలదీశాడు. కొడుకు చేసిన అప్పులు తీర్చి సుధీర్‌ను సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకునేందుకు హైద్రాబాద్‌ పంపారు.

Updated Date - Mar 07 , 2026 | 12:23 AM