బాణసంచా దుకాణాల్లో అధికారుల తనిఖీలు
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:05 AM
కాకినాడ జిల్లాలో జరిగిన భారీ బాణసంచా పేలుడు, పలువురు మృత్యువాత చెందిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది ఆదివారం తనిఖీలు నిర్వహించారు.
బాణసంచా దుకాణాల్లో అధికారుల తనిఖీలు
ఏపూరులో రూ.30 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం
పెదపాడు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : కాకినాడ జిల్లాలో జరిగిన భారీ బాణసంచా పేలుడు, పలువురు మృత్యువాత చెందిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో ఎస్పీ ప్రతాపశివ కిశోర్, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ ఆదేశాల మేరకు పెదపాడు మండలం ఏపూరులో వున్న లక్ష్మీనారాయణ క్రాకర్స్ షాపుపై రెవెన్యూ, ఫైర్ సిబ్బంది ఆదివారం తనిఖీలను నిర్వహించారని పెదపాడు ఎస్‌ఐ ఆర్.శ్రీను తెలిపారు. దుకాణంలో వున్న నిల్వ, రికార్డులను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా దుకాణంలో నిల్వ ఉంచిన సుమారు రూ.30 లక్షల విలువైన బాణసంచాను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్రీను మాట్లాడుతూ బాణసంచా, పేలుడు పదార్థాల భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే అది భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీస్తుందన్నారు. ప్రజా భద్రత కంటే వ్యాపార ముఖ్యం కాదని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. షాపు నిర్వాహకులపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దారు వీవీ రామారావు, అగ్నిమాపక అధికారి జి.నాగరాజు, వీఆర్వో నటరాజన్‌దాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ భీమడోలు : భీమడోలు మండలంలోని పలు దుకాణాలను పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు పరిశీలించి యజమా నులకు సూచనలు చేశారు. బాణసంచా తయారీ, అమ్మకాలలో నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ విల్సన్ హెచ్చరించారు. ఎస్‌ఐ మదీనాబాషా, ఆర్‌ఐ జగన్నాఽథం తదిత రులు పాల్గొన్నారు.
ఫ పెనుమంట్ర : పెనుగొండ మండలంలోని వెలగలేరులో శ్రీ విజయలక్ష్మి పైర్ వర్క్స్ , వాసవీ ట్రేడర్స్ , శ్రీలక్ష్మి ఫైర్ వర్క్స్ బాణసంచా దుకాణాలను పెనుగొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాయుడు విజయ్‌కుమార్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయా షాపుల వారిని హెచ్చరించారు.
ఫ పాలకొల్లు అర్బన్ : పాలకొల్లు పట్టణ పరిధిలోని బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాలను సీఐ కె.రజనీకుమార్ పర్యవేక్షణలో ఎస్‌ఐ జీజే ప్రసాద్ ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. భారీ బాణసంచా తయారీ కేంద్రాలు జనావాసాలకు దూరంగా ఉన్నాయా ? నిల్వ సామర్ధ్యం అనుమతించిన మేరకు ఉందా? అధికంగా ఉందా? అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? అనే అంశాలు పరిశీలించారు. లైసెన్సు నిబంధనలు అతిక్రమించి అక్రమ బాణసంచా నిల్వ చేసే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.