Share News

కొవిడ్‌ కలకలం!

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:55 PM

ఐదేళ్లక్రితం దేశాన్ని కుదిపేసిన కొవిడ్‌ మహమ్మారి జాడలు మరోదఫా జిల్లాలో ప్రవేశించాయి. అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రు లు వైరస్‌ వ్యాప్తి నివారణకు సంయుక్త చర్యలు చేపట్టాయి.

 కొవిడ్‌ కలకలం!

ఆగిరిపల్లిలో ఓ వృద్ధురాలికి నిర్ధారణ.. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం

ఏలూరులో మూతపడిన ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌

తెరిస్తేనే కచ్చితమైన పరీక్షలు, ఫలితాలు

ఏలూరు అర్బన్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లక్రితం దేశాన్ని కుదిపేసిన కొవిడ్‌ మహమ్మారి జాడలు మరోదఫా జిల్లాలో ప్రవేశించాయి. అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రు లు వైరస్‌ వ్యాప్తి నివారణకు సంయుక్త చర్యలు చేపట్టాయి.

ఆగిరిపల్లిలో ఓ వృద్ధురాలు (76) అనారోగ్యంతో ఈ నెల 8న మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆసు పత్రిలో చేరగా, గురువారం ఆమెకు ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధార ణైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా వృద్ధురాలి ప్రైమరీ కాంటాక్టు వ్యక్తుల (కుటుంబ సభ్యులు)కు కొవిడ్‌ పరీక్షలను చేయ డానికి చర్యలు చేపట్టారు. మరోవైపు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పది పడకలతో కొవిడ్‌ వార్డును సిద్ధం చేయడంతో పాటు, క్షేత్ర స్థాయిలో ప్రాథమిక వైద్యసేవలనందించే పీహెచ్‌సీల్లో వైద్యాధికారులకు డీఎంహెచ్‌వో డాక్టర్‌ శోభ ఆదేశాలు జారీ చేశారు. జలుబు, దగ్గు, తదితర వైరస్‌ లక్షణాలతో పీహెచ్‌సీలకు వచ్చేవారిలో అనుమానితులుంటే ముక్కు, నోరు నుంచి శ్వాబ్‌లను సేకరించి వీటీఎం(వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం) శాంపిల్‌ కిట్లతో కొవిడ్‌ ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని సూచించా రు. ప్రాథమికంగా పాజిటివ్‌ వస్తే తుదిగా ఖరారు కోసం ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసు పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌కు శ్వాబ్‌ నమూనాలను పంపాలని కోరా రు. ప్రజలు వైరస్‌ సోకకుండా జనసమ్మర్థ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

11 నెలలుగా ల్యాబ్‌కు తాళాలు.. కొవిడ్‌ టెస్టులు ఎలా?

దేశవ్యాప్తంగా కొవిడ్‌/కరోనా ఎక్స్‌ప్రెస్‌ వేగం తో 2020లో విస్తరించడం, తదుపరి రెండేళ్ల లోనూ వైరస్‌ వ్యాప్తి కొనసాగడం విదితమే. తొలినాళ్లలో కొవిడ్‌ నిర్ధారణకు ర్యాపిడ్‌ యాంటీ జెన్‌(ర్యాట్‌)కిట్లతో ప్రాథమిక పరీక్షలు నిర్వహిం చి, అందులో పాజిటివ్‌ వచ్చిన వారికి ఖరారు నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి కొంత కాలం పాటు పంపించేవారు. ఈ నేపథ్యంలో స్థానికంగానే కొవిడ్‌ పరీక్షలను ఐసీఎంఆర్‌/ డబ్ల్యుహెచ్‌వో ప్రామాణికాల మేరకు నిర్వహిం చేందుకు రాష్ట్రప్రభుత్వం 2021లో జిల్లాకు ఆర్టీ పీసీఆర్‌ ల్యాబ్‌ను మంజూరు చేయగా, ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. మొత్తం రూ.మూడు కోట్ల వ్యయంతో ఎనిమిది ఆర్టీపీసీఆర్‌ మిషన్లు, మూడు ఆటోమేటెడ్‌ ఎక్స్‌ ట్రాక్షన్‌ మిషన్లు, రెండేసి చొప్పున బయోసేఫ్టీ కేబినెట్లు, సెంట్రీ ఫ్యూజ్‌లు, లామినర్‌ ఎయిర్‌ ఫ్లో చాంబర్లు, నాలుగు ఫ్రీజర్లతో రోజుకు గరి ష్ఠంగా 15 వందల వరకు శాంపిల్స్‌ను పరీక్షిం చేందుకు వీలుగా ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ను అందు బాటులోకి తెచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సేకరించే శ్వాబ్‌ నమూనాలను ఇక్కడి ల్యాబ్‌లోనే రేయింబవళ్లు పరీక్షించి ఖచ్చితత్వంతో కూడిన రిపోర్టులిచ్చేవారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం రీసెర్చ్‌ సైంటిస్టు, రీసెర్చ్‌ అసిస్టెంట్‌, రీసెర్చ్‌ టీంలను ఎన్‌హెచ్‌ఎం స్కీంలో నియమించారు. క్రమేణా కొవిడ్‌ తగ్గు ముఖం పట్టడంతో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ను పట్టిం చుకునేవారే కరవయ్యారు. ఈ క్రమంలో డీఎంహెచ్‌వో నియంత్రణలో ఎన్‌హెచ్‌ఎం స్కీంలో నిర్వహిస్తున్న ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ను కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్యకళాశాల (డీఎంఈ) పరిధిలోకి మార్చారు. అప్పటినుంచి ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఖరీదైన వ్యాధి/వైరస్‌ నిర్ధారణ మిషన్లు, పరికరాలు మూలన పడటం, బూజులు పట్టడంతోపాటు, ప్రస్తుతం ల్యాబ్‌వున్న భవనం పైకప్పు నుంచి నీళ్లు లీకవుతున్నాయి. గబ్బిలాలు నివాసముంటున్నాయి. మిషన్లు, పరికరాల జీవితకాలం ఏనాడో ముగిసిందని, వాటిలో చాలావరకు ఎక్స్‌పైరీ అయ్యాయని సమాచారం. ఇక ల్యాబ్‌ నిర్వహణ ఎన్‌హెచ్‌ఎం స్కీంనుంచి డీఎంఈ మైక్రో బయాలజీ విభాగానికి బదిలీ కావడంతో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులైన రీసెర్చ్‌ సైంటిస్టులను, టీంను విధుల నుంచి తప్పించడంతో గతేడాది ఆగస్టు నుంచి ల్యాబ్‌ మూతపడింది. కీలకమైన వైరస్‌ సంబంధిత జబ్బులను నిర్ధారించుకోవడానికి ల్యాబ్‌ టెక్నీషియన్లతో పరీక్షలు చేయిస్తున్నారు. మిగతా జిల్లాలో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ఇప్పటికీ పనిచేస్తుండగా, ఇక్కడి ల్యాబ్‌ను మాత్రం మూసేశారు. కొవిడ్‌ మళ్లీ వ్యాప్తి చెందుతుండటం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ మూతపడడంతో వైరస్‌బారిన పడ్డ అనుమానితుల నుంచి సేకరించే శ్వాబ్‌ నమూనాలను పరీక్షించడానికి ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బయటి ల్యాబ్‌లలో కొవిడ్‌ టెస్టు చేయడానికి రూ.1500 వరకు ఖర్చవుతుంది. కొద్దిరోజులుగా కొవిడ్‌ వ్యాప్తి జరుగుతుండటంతో వైరస్‌ను ఖచ్ఛితమైన టెస్టులతో నిర్ధారించుకోవడానికి, సమర్థవంతమైన చికిత్సలు వైద్యులందించడానికి మూతపడిన ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ను తెరవడంతో పాటు, నిపుణతగల రీసెర్చ్‌ సైంటిస్టులను, రీసెర్చ్‌ బృందాలను తక్షణమే పునర్నియామకాలు చేయాల్సి వుంది.

ఆగిరిపల్లిలో వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌

ఆగిరిపల్లి, జూలై 17(ఆంధ్రజ్యోతి) : ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు (75)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు శుక్రవారం ఆగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యధికారిణి డాక్టర్‌ టీనా తెలిపారు. ఆగిరిపల్లి సత్రం సెంటర్‌ శివాలయం సమీపంలో నివాసం ఉంటున్న ఆ వృద్ధురాలికి గుండె సంబంధించిన వ్యాధి ఉండడంతో జనరల్‌ చెకప్‌ కోసం 15 రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ హాస్పిటల్‌కి కుటుంబ సభ్యులు తీసుకువెళ్ళారు. ఆమెకు నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తుండటంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌గా గురువారం రాత్రి వైద్యులు నిర్ధారించారన్నారు. ఆమెను ఐసోలేషన్‌ వార్డులో ఉంచినట్లు తెలిపారు. ఆమెతో పాటు వచ్చిన కుమారుడి నుంచి కరోనా పరీక్షలకు శాంపిల్స్‌ తీసుకున్నారని, ఆగిరిపల్లిలో ఉన్న మిగతా కుటుంబ సభ్యులకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించి శాంపిల్స్‌ను ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్‌ ల్యాబ్‌కు పంపుతామని డాక్టర్‌ టీనా తెలిపారు.

Updated Date - Jul 17 , 2026 | 11:55 PM