Share News

కొవిడ్‌పై అప్రమత్తం

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:46 AM

రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది.

కొవిడ్‌పై అప్రమత్తం

ప్రభుత్వాసుపత్రుల్లో ఐసొలేషన్‌ సెంటర్ల ఏర్పాటు

తణుకు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం ఆస్పత్రుల్లో బెడ్స్‌ సిద్ధం

ప్రత్యేకంగా వైద్యుల నియామకం

భీమవరం క్రైం/తణుకు/తాడేపల్లిగూడెం రూరల్‌/నరసాపురం, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. జిల్లాలోని తణుకు జిల్లా ఆసుపత్రిలో 15 బెడ్స్‌, భీమవరం, తాడేపల్లి గూడెం, నరసాపురం ఏరియా ఆసుపత్రులలో పదేసి చొప్పున బెడ్‌లతో ఐసొలేషన్‌ కేంద్రాల ను ఏర్పాటుచేశారు. జిల్లాలో ఎటువంటి కోవిడ్‌ కేసులు నమోదు కాలేదని డీఎంహెచ్‌వో ఎం.రవిబాబు తెలిపారు. ఐసొలేషన్‌ కేంద్రాలలో ప్రత్యేకంగా ఆక్సిజన్‌తోపాటు సిబ్బందిని నియమించారు. ఎవరైనా దగ్గు, జ్వరం, రొంప ఎక్కువ రోజులు తగ్గని వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి బయటకు వెళ్లాలని, సరైన జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు కొవిడ్‌ను అరికట్టవచ్చునని సూచించారు. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో 15 బెడ్స్‌ ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సాయికిరణ్‌ తెలిపారు. పరీక్షలకు అవసర మైన కిట్లు రావాల్సి వుందని, ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్నట్లు తెలి పారు. నరసాపురం రుస్తుంబాద ప్రభుత్వా స్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఆక్సిజన్‌ను, సిబ్బందిని అందుబాటులో వుంచారు. మూడు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుంటే తక్షణం పరీక్ష చేయించుకో వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంతోష్‌ చెప్పారు. రోగులకు అవసరమైన పరీక్షలను ఉచితంగా చేస్తామన్నారు. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో కొవిడ్‌ ఐసొలేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ముగ్గురు వైద్యులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి తెలిపారు.

Updated Date - Jul 24 , 2026 | 12:46 AM