Share News

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ చదువు

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:27 AM

విద్యా హక్కు చట్టం మేరకు ప్రభుత్వం పేద, బలహీన వర్గాలకు ప్రైవేట్‌ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 శాతం అడ్మిషన్లు ఉచితంగా కల్పిస్తోంది.

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ చదువు

20 తేదీ నుంచి మార్చి 10 వరకు దరఖాస్తుకు గడువు

జిల్లాలో సుమారు రెండు వేల సీట్లు

రెండేళ్లుగా 60 శాతం మాత్రమే భర్తీ

భీమవరం రూరల్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : విద్యా హక్కు చట్టం మేరకు ప్రభుత్వం పేద, బలహీన వర్గాలకు ప్రైవేట్‌ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 శాతం అడ్మిషన్లు ఉచితంగా కల్పిస్తోంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు చేరడానికి ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. మూడు విడతలుగా ప్రవేశాలు చేసే ప్రణాళికలో మొదటి విడత ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జిల్లాలో 399 ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా, 250 పాఠశాలల వరకు అందుబాటులో ఉన్నాయి. గతేడాది లెక్కల ప్రకారం 1వ తరగతిలో 2 వేల సీట్లు వరకు అందుబాటులో ఉంటున్నాయి. అనాధ పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, షెడ్యూల్‌ కులాలకు 10 శాతం, షెడ్యూల్‌ తెగలకు 4 శాతం అడ్మిషన్‌ ఉంటుంది. బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, ఓసీలకు గ్రామీణ ప్రాంత కుటుంబాలకు సంవత్సర ఆదాయం రూ. లక్షా 20 వేలు ఉండాలి. పట్టణ ప్రాంత కుటుంబాలలో రూ. లక్షా 44 వేలు మించకుండా ఉండాలి. వీరికి 6 శాతం కేటాయించారు.

దరఖాస్తుకు కావల్సినవి

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. చిరునామా ధృవీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు ఉండాలి. వయసు ధృవీకరణ పత్రం కావాలి. సీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌లో చేరాలంటే ఏప్రిల్‌ 2వ తేదీ 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి. స్టేట్‌ సిలబస్‌కి జూన్‌ 2వ తేదీ 2020 నుంచి మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలి. నివాసానికి పాఠశాలకు కిలోమీటర్‌ దూరంలో ఉంటే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఐదు కి.మీ దూరంలో ఉంటే రెండవ ప్రాధాన్యతగా తీసుకుంటారు.

ప్రైవేట్‌ స్కూల్స్‌లో గందరగోళం

ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశాలు, సంవత్సర ముగింపులో ఫీజుల చెల్లింపుల్లో గందరగోళంగా ఉంటున్నదని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. గతంలో ప్రభుత్వం వీరికి ఇంతని ఫీజు నిర్ణయించి స్కూళ్లకు అందించేవారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి జమ చేసుకోవాలని సూచించారు. అవి విద్యార్థికి రాకపోవడంతో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికే సొమ్ములు రావడంతో ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రుల మీద యాజమాన్యాలు ఒత్తిడి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి వేధింపుల వల్ల పిల్లల తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దాంతో పాటు కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలు ఆన్‌లైన్‌లోకి రావడం లేదు. దీంతో నివాసానికి దగ్గరలో ఉన్నవారు అర్హత కోల్పోతున్నారు. గత ఏడాది 247 పాఠశాలలే అందుబాటులోకి వచ్చాయి.

Updated Date - Feb 10 , 2026 | 12:44 AM