Share News

మొక్కజొన్నకు దక్కని.. మద్దతు ధర!

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:41 PM

ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందా? లేదా? అని రైతులు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

మొక్కజొన్నకు దక్కని.. మద్దతు ధర!
చాట్రాయిలో ఆరబెట్టిన మొక్కజొన్న కండెలు

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యేనా?

ఆశ–నిరాశ మధ్య కొట్టుమిట్టాడుతున్న రైతన్నలు

మద్దతు ధర రాకపోతే నష్టపోతామంటూ ఆవేదన

జిల్లాలో 29,580 ఎకరాల్లో కమర్షియల్‌ మొక్కజొన్న సాగు

చాట్రాయి/లింగపాలెం, ఏప్రిల్‌ 10(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందా? లేదా? అని రైతులు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గతేడాది మొక్కజొన్నకు మంచి ధర పలకడంతో రైతులకు లాభాలను తెచ్చి పెట్ట డంతో ఈ ఏడాదీ అధిక విస్తీర్ణంలో మొక్క జొన్న పంటను సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో కమర్షియల్‌, సీడ్‌ మొక్కజొన్న మొత్తం 75 వేల ఎకరాల్లో సాగు చేయగా ఇందులో 29,580 ఎకరాల్లో కమర్షి యల్‌ మొక్కజొన్న పంటను సాగు చేశారు. చాట్రాయి, ముసునూరు. నూజివీడు, ఆగిరిపల్లి, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం, లింగపాలెం, పెదవేగి, జీలుగుమిల్లి తదితర మండలాల్లో మొక్కజొన్న విస్తారంగా సాగు అయింది. ఈ ఏడాది ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. అయితే దిగుబడులు బాగున్నా సరైన ధర లేక రైతు లు ఆవేదన చెందుతున్నారు. కమర్షియల్‌ మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటా ల్‌కు రూ.2,400 ఉండగా ప్రస్తుతం వ్యాపారులు రూ.1,700 నుంచి రూ.1,800 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరకు అమ్మితే ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.35 వేలు వరకు నష్టం వస్తుందని రైతులు, కౌలు రైతు లు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు సుమారు రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టామని కనీస మద్దతు ధర లభిస్తుందో లేదోనని రైతు లు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు మంత్రి పార్థసారథికి, కలెక్టర్‌కి ఇతర అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. రైతుల విజ్ఞప్తిని సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకెళ్లానని, ఆయన స్పందించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, కేంద్రం నుంచి అనుమతి రాగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోళ్లు జరుపుతామని బుధవారం రాత్రి చాట్రాయి మండలం బూరుగుగూడెంలో మంత్రి సారథి రైతులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు అందించకపోతే దారుణంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రభుత్వం మొక్క జొన్న కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకుంటే ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

– మద్దిరెడ్డి ప్రభాకరరెడ్డి, రైతు, చాట్రాయి

అనుమతి రావాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభు త్వం నుంచి అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోళ్లు జరుపుతాం.

–బండారు శివశంకర్‌, ఏవో, చాట్రాయి మండలం

Updated Date - Apr 10 , 2026 | 11:41 PM