Share News

సహకార ఆందోళన

ABN , Publish Date - May 19 , 2026 | 12:53 AM

సహకార సంఘ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని సహకార సంఘాల బ్రాంచీల వద్ద సోమవారం నిరసనలు తెలిపారు.

సహకార ఆందోళన

నల్లబ్యాడ్జీలతో జిల్లాలోని సహకార సంఘాల ఉద్యోగుల నిరసన

భీమవరం రూరల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని సహకార సంఘాల బ్రాంచీల వద్ద సోమవారం నిరసనలు తెలిపారు. సహకార సంఘాల ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారంటూ జిల్లాలోని 111 సహకార సంఘాల్లో పని చేసే 724 ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి జీవో నంబర్‌ 322 వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. సహకార సంఘ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని తదితర పది డిమాండ్లతో గతేడాది డిసెంబర్‌ 6వ తేదీ నుంచి సహకార సంఘ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ఈ ఏడాది జనవరిలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఫిబ్రవరిలో సహకార సేవలను నిలుపుదల చేశారు. రాష్ట్ర జేఏసీ ప్రభుత్వంతో చర్చలు జరిపి సఫలం చేసుకున్నాక సేవలకు వచ్చారు. ఉద్యోగుల జీతాల పెంపు, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపు, గ్రాట్యుటీ రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంపు వంటివాటిపై హామీ ఇచ్చారు. తీరా చూస్తే విడుదల చేసిన జీవో 322 వల్ల ఉద్యోగులకు హామీలు నెరవేరకపోగా మరిన్ని కొర్రీలు వేశారని ఉద్యోగులు అంటున్నారు. కంప్యూటరీకరణ సరిగా చేయాలని, కెపాసిటీ డ్యూటీ ఉంటే జీతాలు తీసుకోవాలని, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులో డీసీసీబీ నుంచి కొంత చెల్లించాలని జీవోలో పెట్టడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీవో 322తో ఉపయోగం లేదు

ప్రస్తుతం విడుదల చేసిన జీవో 322లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ చెయ్యలేదు. అన్నింటికీ ఆటంకాలు కలిగించేలా పెట్టారు. దానివల్ల ఉద్యోగులకు ఉపయోగం లేదు. పదిలో నాలుగు హామల అమలుకు ఒప్పుకుని వాటికి కొర్రీలు వేయడం దారుణం. వెంటనే 322 జీవోను రద్దు చేయాలి

విజయభాస్కర్‌, రాష్ట్ర సహకార సంఘం జేఏసీ అధ్యక్షుడు

జీవో వెనక్కు తీసుకోవాలి

సహకార సంఘ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కేలా జీవో 322 ప్రవేశపెట్టారు. దీనిని వెంటనే వెనక్కు తీసుకోవాలి. ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా జీవో తీసుకురావాలి. ఏ హామీ సరిగ్గా నెరవేర్చని విధంగా జీవో ఉంది.

సుబ్బారావు,సహకార సంఘం జేఏసీ సభ్యుడు

Updated Date - May 19 , 2026 | 12:54 AM