కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల సమ్మె పాక్షికం
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:05 AM
పలు డిమాండ్ల సాధన కోసం ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ (డీఎంహెచ్‌వో పరిధి)లో కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం నుంచి ప్రారంభించిన సమ్మె తొలిరోజున జిల్లాలో పాక్షికంగా జరిగింది.
ఏలూరు అర్బన్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పలు డిమాండ్ల సాధన కోసం ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ (డీఎంహెచ్‌వో పరిధి)లో కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం నుంచి ప్రారంభించిన సమ్మె తొలిరోజున జిల్లాలో పాక్షికంగా జరిగింది. జిల్లాలోని పీహెచ్‌సీల్లో పని చేస్తున్న 350 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల్లో మంగళవారం 123 మంది పెన్‌డౌన్/సమ్మెలోకి వెళ్లినట్టు రోజువారీ హాజరు సేకరణద్వారా గుర్తించినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్ యు.శోభ తెలిపారు. వీరితోపాటు మరో పదిమంది ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్) కాంట్రాక్టు ఉద్యోగులు సంఘీభావంతో సమ్మెలోకి వెళ్లారని వివరించారు. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళుతున్నందున పీహెచ్‌సీల్లో వైద్యసేవలకు అంతరాయం కలుగకుండా వేర్వేరు విభాగాల్లో స్థానికంగా విదులు నిర్వర్తిస్తున్న వైద్యసిబ్బందికి రొటేషన్ పద్ధన డ్యూటీలు కేటాయించినట్టు తెలిపారు.
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద..
ఏలూరు క్రైం : కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు, కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఏపీఎన్‌జీవో ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులంతా మంగళవారం విధులను బహిష్కరించి ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేశారు.మోకాళ్లపై నిరసన తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్క రించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నట్టు ప్రకటించారు.