Share News

నానికి ప్రముఖుల నివాళి

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:41 AM

మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) పార్థివదేహానికి గురువారం ఏలూరు శ్రీరామనగర్‌లోని ఆయన స్వగృహం వెనుక ఖాళీ స్థలంలో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించనుంది.

నానికి ప్రముఖుల నివాళి
ఆళ్ల నాని పార్థ్థివ దేహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే చంటి

నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

మంత్రి లోకేశ్‌, నిమ్మల, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ రాక

ఏలూరు/రూరల్‌/టూటౌన్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి):మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) పార్థివదేహానికి గురువారం ఏలూరు శ్రీరామనగర్‌లోని ఆయన స్వగృహం వెనుక ఖాళీ స్థలంలో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించనుంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరిక మేరకు ప్రభుత్వం సమ్మతి తెలిపింది. ప్రభుత్వం తరపున ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘు రామకృష్ణరాజు హాజరై నివాళులర్పిస్తారు. అనంతరం 10.45 గంటలకు నాని పెద్ద కుమారుడు మణిచంద్‌ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. విశాఖపట్నంలో మంగళవారం గుండెపోటుతో మృతి చెందిన నాని భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. బుధవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఆచంట, తాడేపల్లిగూడెం, గన్నవరం ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్‌, యార్లగడ్డ వెంకట్రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర నాథ్‌, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, గ్రంథి శ్రీనివాస్‌, ముదునూరి ప్రసాదరాజు, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, దాడిశెట్టి రాజా, దూలం నాగేశ్వరరావు, కరణం ధర్మశ్రీ, మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు, కంభం విజయరాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తపన చౌదరి, వంగవీటి రంగా కుమార్తె ఆశా లతా, సీపీఐ, సీఐటీయూ నాయకులు బండి వెంకటేశ్వరరావు, డేగా ప్రభాకర్‌, డీఎన్‌వీడీ ప్రసాద్‌, రవి తదితరులు నాని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మరణం తమను దిగ్ర్భాంతిని కలిగించిందన్నారు. నాని మరణం ఆయన కుటుంబానికే కాకుండా ఏలూరు ప్రజలకు తీరని లోటని ఎంపీ మహేశ్‌ అన్నారు. నాని పార్థివ దేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. అతిచిన్న వయస్సులో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నానితో తనకు మంచి స్నేహం ఉందని ఎమ్మెల్యే చంటి గుర్తు చేసుకున్నారు. నాని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

Updated Date - Sep 17 , 2026 | 12:41 AM