Share News

కొంపముంచిన క్రెడిట్‌ !

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:05 AM

ఇంధన కంపెనీల ప్రతినిధులు గడచిన కొన్నేళ్లుగా క్రెడిట్‌ విధానాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు కంపెనీలు క్రెడిట్‌ ఇవ్వకపోవ డంతో బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు వెలుస్తున్నాయి.

కొంపముంచిన క్రెడిట్‌ !

గతంలో డీలర్లకు కంపెనీల వెసులుబాటు

ఇప్పుడు ఒకేసారి క్రెడిట్‌ నిలిపివేత

పూర్తి సొమ్ములు చెల్లిస్తేనే ఇంఽధనం

బంక్‌ నిర్వాహకులకు ఇక్కట్లు

అందుకే నో స్టాక్‌ బోర్డులు

అపోహతో ఎగబడుతున్న వాహనదారులు

పెరిగిన రోజువారీ విక్రయాలు

ఎక్కడ చూసినా బంకుల్లో జనం బారులు తీరుతున్నారు. కొన్ని బంకులు మూసి వేయడం, నో స్టాక్‌ బోర్డు పెట్టడంతో ఆందోళన నెలకొంది. పెట్రోల్‌, డీజిల్‌ దొరకదేమోననే భయంతో అవసరానికి మించి కొట్టించు కుంటున్నారు.. ఇదంతా యుద్ధం వల్ల అని చాలా మంది భావిస్తున్నారు.. కానీ అసలు కారణం అది కాదు.. కంపెనీలు డీలర్లకు క్రెడిట్‌ నిలిపివేయడం వల్లే ఈ సంక్షోభం..

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

భీమవరంలోని ఓ పెట్రోల్‌ బంకులో ప్రతిరోజు మూడువేల లీటర్ల పెట్రోలు అమ్ముడు పోయేది. మూడు రోజుల నుంచి పరిస్థితి మారిపోయింది.రోజుకు గరిష్టంగా ఎనిమిది వేల లీటర్లు అమ్ముడవుతోంది. విశాఖపట్నం నుంచి మళ్లీ ట్యాంక్‌ రప్పించడానికి సమయం పడు తోంది. దీంతో బంకును ఒక రోజు మూయాల్సి వచ్చింది. కొన్నేళ్లుగా ఎప్పుడూ ఇంధనం అందుబాటులో ఉండే సదరు బంకులో ఒక రోజు మూత పడడంతో జనంలో అపోహ పెరిగింది. అప్పటిదాకా భీమవరంలో రెండు మూడు బంకులు నో–స్టాక్‌ బోర్డులు పెట్టేవి. కానీ మూడు రోజుల నుంచి వాహనదారులు పెట్రోలు కొనుగోలు పెంచేశారు. ఫుల్‌ ట్యాంక్‌ కొట్టించుకుంటు న్నారు. అమెరికా–ఇరాన్‌ యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో కొన్ని పెట్రోల్‌ బంకుల్లో నో–స్టాక్‌ బోర్డులు న్నప్పటికీ జనంలో పెద్ద ఆందోళన లేదు. పరిశ్రమలకు ఇచ్చే డీజల్‌ ధర పెంచిన రెండురోజుల్లో మాత్రం బంకుల్లో రద్దీ పెరిగింది. ఈ నెల 20, 21 తేదీల్లో ఇంధన వినియోగం పెరిగింది. తర్వాత మళ్లీ తగ్గు ముఖం పట్టింది. గడచిన మూడు రోజుల్లో పరిస్థితి తారుమారైంది. పెట్రోల్‌, డీజిల్‌ కోసం అంతా ఎగబడు తున్నారు. చిన్న కార్లలోనూ వినియోగం అధికమైంది. దాంతో బంక్‌ యజమానులే కంగు తింటున్నారు. కంపెనీల నుంచి సరఫరా జాప్యం జరిగితే బంకులో అంత రాయం ఏర్పడుతోంది. ఇది వినియోగ దారుల్లో తప్పుడు సంకేతాలు పంపుతుందని వ్యాపారం దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు.

ఆరా తీస్తున్న పౌర సరఫరాల శాఖ

జిల్లాలో అమ్మకాలు పెరగడంతో పౌరసరఫరాల అధికారులు బంకుల వారీగా ఆరా తీస్తున్నారు. పెట్రోల్‌ సరఫరా, అమ్మకాలపై లెక్కలు కడుతున్నారు. జిల్లాలో గురువారం నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ కోసం పౌర సరఫరాల శాఖ పెద్దగా పట్టించుకోలేదు. సరఫరా సక్రమంగా జరిగిపోయేది. అమెరికా– ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో పరిస్థితులు కాస్త మారాయి. పెట్రోల్‌కు కొరత లేదు. అయినా కంపెనీలు క్రెడిట్‌ ఇవ్వకపోవ డంతో బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు వెలుస్తున్నాయి. అది కూడా జిల్లాలో అక్కడక్కడా ఈ పరిస్థితి ఉంది.పెట్రోల్‌, డీజిల్‌కు ఎటువంటి ఇబ్బంది లేదు. కంపెనీల నుంచి సరఫరా అవుతోంది.

క్రెడిట్‌కు స్వస్తి చెప్పిన కంపెనీలు

ఇంధన కంపెనీల ప్రతినిధులు గడచిన కొన్నేళ్లుగా క్రెడిట్‌ విధానాన్ని ప్రోత్సహించారు. రొయ్యల కంపెనీలు, పెద్ద రైతుల వద్దకు వెళ్లేవారు. తమ కంపెనీ బంకుల్లో క్రెడిట్‌కు కొనుగోలు చేయాలని ప్రోత్సహించారు. బంకు లకు కూడా క్రెడిట్‌ ద్వారానే పెట్రోలు, డీజిల్‌ సరఫరా చేస్తూ వస్తున్నారు. దాంతో ప్రతి పెట్రోల్‌ బంకులోనూ బకాయిలు గరిష్టంగా రూ.60 లక్షలకు పెరిగింది. అమెరికా– ఇరాన్‌ యుద్ధం తర్వాత కంపెనీలు క్రెడిట్‌ను నిలిపివేశాయి. దాంతో అప్పటికే ఉన్న బకాయితో పాటు, కొత్తగా ఇంధనం తేవడానికి మరో రూ.20 లక్షలు పెట్టుబడి చేయాల్సి వచ్చింది.ఫలితంగా అంత మొత్తాన్ని సర్దుబాటు చేయలేని బంకులకు ఇంధన సరఫరా నిలచిపోయింది. దీనివల్ల కొన్ని పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు వెలుస్తున్నాయి. సర్దుబాటు చేసిన తర్వాత మళ్లీ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. జిల్లాలో 168 పెట్రోలు బంకులున్నాయి. ప్రతిరోజు ఐదు నుంచి ఆరు లక్షల లీటర్ల వరకు పెట్రోలు విక్రయం సాగించేవి. గడచిన మూడు రోజుల నుంచి ప్రతిరోజు 12 లక్షల లీటర్లకు పైగా అమ్మకాలు సాగుతున్నాయి. ఫలితంగా కంపెనీల నంచి పెట్రోలు రావడంలో ఇబ్బందులు తలె త్తుతున్నాయి. జిల్లాలోని పట్టణాల పరిధిలో ఉండే బంకుల్లో ఒకటి రెండు మాత్రమే నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నాయి. అంతేతప్ప ఇంధనానికి ఎటువంటి ఢోకాలేదంటూ బంకు యజమానులు చెపుతున్నారు.

కొరత లేదు : సరోజ, జిల్లా పౌరసరఫరాల అధికారి

పెట్రోలు, డీజిల్‌ సరఫరాలో ఎటువంటి కొరత లేదని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారిణి సరోజ స్పష్టం చేశారు. బంకులకు సమృద్ధిగానే సరఫరా అవుతోంది. ప్రజలు అపోహకు లోనుకావద్దు. అవసరమైన మేరకే కొనుగోలు చేయాలి. నిల్వ చేసుకునే విధానం వద్దని సూచించారు.

Updated Date - Mar 27 , 2026 | 12:05 AM