ఏఎంసీలో కలెక్టరేట్
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:23 AM
జిల్లా కలెక్టరేట్‌పై సందిగ్ధితకు తెరపడుతోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ లోనే ఏర్పాటు కానున్నదని ఎమ్మెల్యే అంజిబాబు ప్రకటించారు.
త్వరలోనే జీవో విడుదల
భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ప్రకటన
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లా కలెక్టరేట్‌పై సందిగ్ధితకు తెరపడుతోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ లోనే ఏర్పాటు కానున్నదని ఎమ్మెల్యే అంజిబాబు ప్రకటించారు. భీమవరంలో బుధ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం ప్రాంతానికి తగ్గట్టుగా నూతన కలెక్టరేట్ ఉండాలన్న తలంపుతో ప్రభుత్వం ఉంది. ఎమ్మెల్యే అంజిబాబు కూడా ప్రభుత్వం వద్ద ఇదే విష యాన్ని చెప్పుకొంటూ వస్తున్నారు. ఒకేచోట సువిశాల ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ సము దాయం ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. ఏఎంసీ ప్రాంగణం అందుకు అనువుగా ఉంటుందని నిర్ణయిం చారు. భీమవరం ఏఎంసీ 20 ఎకరాల్లో విస్తరించి ఉంది.
తాత్కాలిక కలెక్టరేట్‌తో ఇబ్బందులెన్నో
భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటైన తర్వాత ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో కలెక్టరేట్‌ను నిర్వహిస్తున్నారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణా సౌకర్యం లేదు. కలెక్టరేట్‌లోనూ సరైన వసతులు లేవు. రికార్డులు భధ్రపరచుకోవడం కష్టంగా మారింది. అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించడానికి అనువుగా గదులు లేవు. ఉన్నదాంట్లోనే సేవలు అందిస్తున్నారు. డీఆర్ డీఏ, సమగ్ర శిక్ష అభియాన్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వంటి కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఎస్పీ కార్యాలయానికి సొంత భవనం లేదు. ఇలా కొత్త జిల్లాకు భీమవరం కేంద్రమైనప్పటికీ సరైన వసతులు లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల రాకపోకలకు సమస్యగా ఉంటోంది.
అన్నిటికీ అనుకూలం.. ఏఎంసీ
భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చడం లేదు. గోదాములు శిథిలావస్థలో ఉన్నాయి. ఇతర కార్యాలయాలకు స్థలాలను కేటాయిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎంపెడా,మత్స్యశాఖ కార్యాలయాలు ఏఎంసీ ప్రాంగణంలోనే ఏర్పాటయ్యాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు సైతం వినియోగంలో లేవు. కేవలం సెస్ వసూళ్లకే ఏఎంసీ పరిమితమైంది. నూతన కలెక్టరేట్ అక్కడ నిర్మాణం చేపడితే రవాణా సౌకర్యం ఉంటుంది. భీమవరం నుంచి తణుకు వెళ్లే బస్సులు ఏఎంసీ మీదుగానే వెళుతుంటాయి. భీమ వరం–తణుకు రహదారికి ఆనుకుని ఏఎంసీ ఉంది. భీమవరం మూడో పట్టణం అటువైపే అభివృద్ధి చెందుతోంది. భీమవరం బైపాస్ రహదారికి దగ్గరగానే ఉంది. పార్కింగ్ స్థలాలతో పాటు, పరేడ్‌లు నిర్వహించేందుకు అనువుగా కలెక్టరేట్‌ను తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. ఇన్ని ప్రయోజనాలు ఉండడంతో ఎమ్మెల్యే అంజిబాబు ఏఎంసీలో కలెక్టరేట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.