Share News

కొల్లేరు అభయారణ్యం హద్దులు తేల్చండి

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:28 AM

జిల్లా పరిధిలోని కొల్లేరు అభయారణ్యం సరిహద్దులు రెవెన్యూ, సర్వే, అటవీశాఖల సంయుక్తంగా కలిసి తనిఖీలు చేసి తేల్చాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

కొల్లేరు అభయారణ్యం హద్దులు తేల్చండి
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, జిల్లా అటవీ శాఖాధికారి సందీప్‌రెడ్డి

కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరు,ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి):జిల్లా పరిధిలోని కొల్లేరు అభయారణ్యం సరిహద్దులు రెవెన్యూ, సర్వే, అటవీశాఖల సంయుక్తంగా కలిసి తనిఖీలు చేసి తేల్చాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కొల్లేరు సరిహద్దుల సర్వే పనుల పురోగతిపై ఆమె గురువారం అధికారులతో సమీక్షించారు. జీవో 120 ప్రకారం కొల్లేరు అభయారణ్యం పరిధిలో 55 గ్రామాల్లో సర్వే త్వరితగతిన పూర్తి చేసి.. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయా లను స్వీకరించాలన్నారు. ఇప్పటికే 52 గ్రామాల్లో సరిహద్దులను గుర్తించారన్నారు. జిల్లా అటవీశాఖాధికారి పోతంశెట్టి సందీప్‌రెడ్డి, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, సర్వేలాండ్‌ రికార్డ్సు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎండీ అన్సారీ పాల్గొన్నారు.

నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి

ఏలూరుసిటీ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): విధుల పట్ల నిర్లక్ష్యంతో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయని అధికారు లను ఉపేక్షించేది లేదని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను హెచ్చ రించారు. జిల్లాలో పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ ఆర్‌ డబ్ల్యుఎస్‌, సమగ్ర శిక్ష, హౌసింగ్‌, ఇరిగేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌ తదితర ఇంజనీరింగ్‌ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనుల ప్రగతిపై గురువారం సంబంధిత అధికారులతో కలెక్టర్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారుల పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు వారికి నిర్దేశించిన పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసి మార్చి 15వ తేదీలోగా బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో రాములు, జడ్పీ సీఈవో శ్రీహరి, పీఆర్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈలు రమేష్‌, త్రినాథ్‌బాబు, దేవప్రకాశ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:28 AM