Share News

మితిమీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదాలు

ABN , Publish Date - May 21 , 2026 | 12:19 AM

‘మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ 240 రోడ్డు ప్రమాదాలు జరిగితే 113 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇదే సమయంలో 194 ప్రమాదాలు జరగ్గా 154 మంది చనిపోయారు. అతి వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయాలి’ అని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

మితిమీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదాలు
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

నాలుగు నెలల్లో 194 ప్రమాదాలు.. 154 మంది మృతి

రహదారి భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరు క్రైం, మే 20 (ఆంధ్రజ్యోతి):‘మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ 240 రోడ్డు ప్రమాదాలు జరిగితే 113 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇదే సమయంలో 194 ప్రమాదాలు జరగ్గా 154 మంది చనిపోయారు. అతి వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయాలి’ అని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎస్పీ కిశోర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నుంచి మే 19వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో డ్రెవింగ్‌ సమయంలో హెల్మెట్‌ లేని 7,551 మందిపై, మద్యం తాగిన 1,415 మందిపై, సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్న 653 మందిపై, మితిమీరిన వేగంతో నడుపుతున్న 291 మందిపై, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని 185 మందిపై, బహిరంగంగా మద్యం తాగుతున్న 3,731 మందిపై, రాంగ్‌ పార్కింగ్‌ చేసిన 2,219 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే ’జిల్లాలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రవాణాదారులు, విక్రయ దారుల సమాచారాన్ని 1972 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు, నేషనల్‌ డెడికేషన్‌ హెల్ప్‌ లైను నెంబర్‌ 14446, ఈగల్‌ టోల్‌ ఫ్రీ నెంబరు 1972కు అందించాలి’ అని మాదకద్రవ్యాలు నిరోధక కమిటీ సమా వేశంలో కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ పిలుపునిచ్చారు. ఉప రవాణా కమిషనర్‌ ఎస్‌కె కరీం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె విజయరత్నం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ యు.శోభ, ఐసీడీఎస్‌ పీడీ శారద, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి ఎస్‌బీ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

16 మంది శిశువుల మృతిపై కలెక్టర్‌ ఆగ్రహం

ఏలూరు అర్బన్‌, మే 20(ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వాసుపత్రుల్లో 2,711 ప్రసవాలు జరగగా 16 మంది శిశువులు మృతి చెందడంపై కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మాతా, శిశు మరణాలు సంభ విస్తే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరిం చారు. జిల్లాలో మాతా, శిశుమరణాల నివారణపై వైద్యులతో బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.

Updated Date - May 21 , 2026 | 12:19 AM