Share News

సర్‌కు సహకరించండి

ABN , Publish Date - May 28 , 2026 | 12:38 AM

అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి కోరారు.

సర్‌కు సహకరించండి
ఈనాం భూములకు పట్టాలు అందిస్తున్న కలెక్టర్‌ నాగరాణి

రాజకీయ పార్టీల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ నాగరాణి

భీమవరం టౌన్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం సర్‌ నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘అర్హులకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించడంతోపాటు మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన, డూప్లికేట్‌ వున్న ఓటర్ల పేర్లను తొలగించేలా చూడాలన్నారు. రాజకీయ పార్టీలు బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించుకోవాలి. వచ్చే నెల 5 నుంచి 14 వరకు శిక్షణ, 15 నుంచి జూలై 14 వరకు బూత్‌ లెవెల్‌ అధికారుల ఇంటింటి సర్వే.. ఓటర్ల నమోదు, 14న పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, జూలై 21 నుంచి సెప్టెంబరు 22 వరకు అభ్యంతరాలు స్వీకరణ, పరిశీలన, సెప్టెంబరు 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుంది. 2002 ఓటర్ల జాబితాతో కొత్తగా రూపొందించే జాబితాను అనుసంధానం చేస్తాం. ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రభుత్వ, స్థానిక సంస్థలు, బ్యాంకులు, తపాలా శాఖ, ఎల్‌ఐసీ లేదా ప్రభుత్వరంగ సంస్థలు జారీచేసిన గుర్తింపు పత్రాలు సమర్పించాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర కుల ధ్రువీకరణ పత్రాలను గుర్తింపు పత్రాలుగా ఉపయోగించ వచ్చు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6 పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఫారం–7 వివరాల సవరణ, అదే నియోజకవర్గంలో చిరునామా మార్పు కోసం ఫారం–8 ద్వారా ఆన్‌లైన్‌లో లేదా బీఎల్‌ఓ, వీఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ కార్యాలయాల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువ ఓటర్లు, మహిళలు, వికలాం గులు, వృద్ధులు, వలస కార్మికులు, వెనుకబడిన వర్గాల ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని తెలిపారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, ఎన్నికల సెక్షన్‌ ఇన్‌ఛార్జ్‌ సూపరింటెండెంట్‌ మర్రాపు సన్యాసిరావు, టీడీపీ ప్రతినిధి మరపట్ల శ్యాంబాబు, బీజేపీ ప్రతినిధి తోట గంగరాజు, వైసీపీ ప్రతినిధి కామన నాగేశ్వరరావు, బీఎస్పీ ప్రతినిధి ఈద విజయం శేఖర్‌బాబు, జేఎస్పీ ప్రతినిధి బి.శివయ్య, సీపీఐ ఎం ప్రతినిధులు ఆంజనేయులు, ఎం.వైకుంఠరావు పాల్గొన్నారు.

గృహగణన పూర్తికావాలి

గృహగణన నమోదు కార్యక్రమాన్ని మరో రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మునిసిపల్‌ కమీషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో బుధవారం సమీక్షించారు.

ఈనాం భూముల పట్టాలు పంపిణీ

పెంటపాడు, మే 27(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ చొరవతోనే ఏళ్ల తరబడి పెండింగ్‌లో వున్న ఉమామహేశ్వరంలోని 83 ఎకరాల ఈనాం భూముల సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ నాగరాణి అన్నారు. బుధవారం ఈనాం భూ ములకు సంబంధించిన పట్టాలను రైతులకు అందజేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానని, రైతులకు పట్టాలు రావడాని కి ఇదే కారణమన్నారు. ఇన్‌చార్జి ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, తహసీల్ధార్‌ సునీల్‌కుమార్‌, ఎంపీడీవో రాంప్రసాద్‌, పుల్లా బాబి, కిలపర్తి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 12:38 AM