Share News

ప్రగతి బాటలో పశ్చిమ

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:18 AM

పశ్చిమ ప్రగతి బాటలో పయనిస్తోంది.

ప్రగతి బాటలో పశ్చిమ
కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ నయీం

ప్రభుత్వ పథకాల అమలులో జోష్‌

పల్లె పండుగలో కాస్త వెనుకంజ

బీటీ, సీసీ రహదారుల ఏర్పాటులో జాప్యం

ముగిసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పశ్చిమ ప్రగతి బాటలో పయనిస్తోంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండురోజుల పాటు జిల్లా కలెక్టర్‌లతో నిర్వహించిన సదస్సులో సూపర్‌ సిక్స్‌ పథకాలు, అభివృద్ధి, పర్యాటకం వంటి అంశాలపై చర్చించారు. అందులో మన జిల్లా పలు రంగాల్లో తొలి రెండు, మూడు స్థానాల్లో నిలిచింది.ముఖ్యంగా అంగన్‌వాడీల నిర్వహణలో పరిశుభ్రత, మంచినీరు సౌకర్యం, భోజన సదుపాయాలు వంటి విషయంలో జిల్లా రెండో ర్యాంక్‌లో ఉంది. తాగునీటి సరఫరా లోనూ రోజుకు రెండు పూటలా మంచినీరు అందించే పట్టణాల జాబితాలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలున్నాయి. రాష్ట్రంలో 27 మున్సిపాలిటీల్లో మాత్రమే రెండు పూటలా మంచినీరు అందిస్తుండగా జిల్లాలోని ఆరు పట్టణాలు ఉండడం విశేషం. ఉగాదికి సుమారు 17,248 ఇళ్లు పూర్తి చేసి ఇవ్వాలి. ఇంకా 99 ఇళ్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాసయోజన 1.0లో జిల్లాలో దాదాపు 70,471 ఇళ్లు మంజూరు చేశారు. అందులో సుమారు 54,799 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు నిర్మాణంలో ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వేసవిలో మంచినీటి సరఫరా ప్రణాళికలోనూ జిల్లా ముందంజలో ఉంది. పల్లె పండుగ విషయంలోనే ముఖ్యంగా బీటీ, సీసీ రహదారుల నిర్మాణంలో కాస్త మధ్యస్తంగా ఉంది. ఇప్పటిదాకా రెండింటిలోనూ 58 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకోగలిగారు. జిల్లాలో గత ప్రభుత్వంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 1,27,334 పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 56,176 మాత్రమే అందజేయగలిగారు.

ఎక్సైజ్‌ ఆదాయంలో అట్టడుగున ...

ప్రభుత్వానికి ఎక్సైజ్‌ ఆదాయం కీలకంగా ఉంటోంది. ఈ విషయంలో పశ్చిమగోదావరి అట్టడుగు స్థానంలో ఉంది. జిల్లాలో 2025– ఆర్థిక సంవత్సరంలో రూ. 1457.98 కోట్లు ఆదాయం రాబట్టాలి. అయితే రూ.1198.84 కోట్లు మాత్రమే సాధించగలిగారు. 82 శాతంతోనే సరిపెట్టారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌లో రూ. 512 కోట్లు లక్ష్యంగా ఇచ్చారు. ఇప్పటిదాకా రూ.461.16 కోట్లు ఆదాయం వచ్చింది.

తగ్గిన ప్రమాదాలు

జిల్లాలో రహదారి ప్రమాదాలు కాస్త తగ్గాయి. జిల్లాలో 2024 సంవత్సరంలో 556 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 2025లో మాత్రం 516 నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమా దాల్లో 2024 సంవత్సరం మొత్తంపైన 220 మంది దుర్మరణం చెందారు. 2025లో 214 మరణాలు సంభ వించాయి. రహదారి భద్రత విషయంలో అవగాహన కల్పిస్తున్నాసరే ప్రజలు పాటించడం లేదు. దాంతో మరణాలు సంఖ్య తగ్గుముఖం పట్టడంలో జిల్లా మధ్యస్తంగా ఉంది.

స్థలాలు ఇస్తే పర్యాటకాభివృద్ధి

జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి ఽఅధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి రెండు స్థలాలు కేటాయించాలని ఆర్‌అండ్‌బి శాఖకు జిల్లా కలెక్టర్‌ సిఫారసు చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కలెక్టర్‌ నాగరాణి తీసుకువెళ్లారు. ముందుగా హోటల్స్‌ రాబట్టేందుకు ప్రయత్నిస్తేనే పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి సూచించారు.

Updated Date - Mar 13 , 2026 | 12:18 AM