కొనలేం.. తాగలేం
ABN , Publish Date - May 21 , 2026 | 12:19 AM
వేసవిలో దాహం తీర్చేందుకు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎక్కువగా ఉపయోగించే కొబ్బరి బొండాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఆకాశాన్నంటిన కొబ్బరిబొండాల ధరలు
రూ. 40 నుంచి 50 వరకు పెంపు
కొరతతో మూతపడిన కొన్ని దుకాణాలు
తణుకు రూరల్, మే 20 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో దాహం తీర్చేందుకు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎక్కువగా ఉపయోగించే కొబ్బరి బొండాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నాలుగు రోజులుగా ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు ఎక్కువగా కొబ్బరి బొండాల నీళ్లు, పలు రకాల పండ్ల రసాల వినియోగం పెరిగింది. ప్రకృతిలో సహజంగా లభించే కొబ్బరి బొండాల ధరలు నెలరోజులుగా పెరగడంతో సామా న్యులు కొనలేని, తాగలేని వస్తువుగా మారిపోయింది.
ఈ ఏడాది జనవరిలో కొబ్బరి బొండం ధర రూ.20 ఉన్న ధర ప్రస్తుతం రూ.40 నుంచి రూ.50కు చేరింది. కొబ్బరి బొండం నీళ్ల బాటిల్ సైజును బట్టి ధర రూ.100 నుంచి రూ.130 నుంచి 150 వరకు పెరిగిపోయింది. కొబ్బరి పంట ఎక్కువగా మన రాష్ట్రంలోని కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ ఖమ్మ జిల్లాలో ఎక్కువగా వుంటుంది. కొంతకాలంగా విక్రయాలు ఎక్కువగా ఉండడంతో సామాన్యులు కొనలేనంతగా పెరిగిపోయాయి.
తగ్గిపోయిన పంట
వేసవి కాలంలో కొబ్బరిబొండాల కొరత రావడం చాలా ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. తణుకు కేంద్రంగా తణుకు పరిసర గ్రామాల్లో రహదారుల వెంట బొండాల దుకాణాలు విరివిగా ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం బొండాల కొరతతో చాలావరకు ఈ దుకాణాలు మూతపడి పోయాయు. ఇక్కడి బొండాలను హైదరా బాద్, చెన్నై వంటి ఇతర ప్రాంతాలకు ఎగుమతి కావడంతో మార్చి, ఏప్రిల్ నాటికి పంట తగ్గిపోయిందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం తణుకు పట్టణానికి జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.
తయారైన కాయల ఎగుమతే ఎక్కువ..
తాడేపల్లిగూడెం పరిసర గ్రామాలు, ఆచంట, సిద్ధాంతం లంకభూముల్లోని కొన్ని చెట్ల నుంచి మాత్రమే బొండాలు వస్తున్నాయి. మిగిలిన నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు తదితర ప్రాంతాల్లోని కొబ్బరి తయారైన తర్వాత ఎగుమతుల కోసం మాత్రమే కొబ్బరిని వినియోగిస్తున్నారు. బొండాల కోసం ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. దీనికి కారణం కొబ్బరి బొండాలు తీసే చెట్టు జీవిత కాలం తగ్గిపోతుందనే అపోహ రైతుల్లో ఎక్కువగా వుంది. దీని వల్ల మన ప్రాంతంలోని కొబ్బరి చెట్ల బొండాలను అమ్మకానికి రైతులు మొగ్గుచూపడం లేదు. ఈమేరకు కొరత ఏర్ప డింది.
ధర పెరిగినా బొండాలు లేవు
వేసవి కాలం దృష్ట్యా కొబ్బరి బొండాలు లేకపోవడంతో ధర పెరిగింది. ధర ఎంతైనా సరుకు కొనుగోలు చేద్దామంటే మన ఏరియాలో చెట్లు బొండాలుగా కంటే తయారైన కాయల పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. జంగారెడ్డిగూడెం, పెదవేగి, సత్తుపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి బొండాలను దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల నష్టాలు వస్తున్నాయి. గత నెలలో రూ. 8వేలు నష్టం వచ్చింది.
– పిల్లి వాసు, కొబ్బరి బొండాల వ్యాపారి. తణుకు.
అపోహలతోనే కొరత..
కొబ్బరి బొండాలను ప్రతీ 45 రోజులకు కోయడంతో కొబ్బరిచెట్టు జీవిత కాలం తగ్గిపోతుందనే అపోహ కొంతమంది రైతుల్లో వుంది. ఈమేరకు రైతులు బొండాల దశలో అమ్మడానికి మక్కువ చూపడం లేదు. కొబ్బరి బొండాలను తరచూ చెట్ల నుంచి కోయడం వల్ల చెట్ల జీవిత కాలం తగ్గుతుందనేది అపోహ మాత్రమే.
– కె. ప్రియదర్శిని, ఉద్యాన వన శాఖాధికారిణి. తణుకు.