Share News

కొబ్బరి దోబూచులాట..!

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:10 AM

కొబ్బరి ధర కూడా బంగారం, వెండిలానే దోబూచులాడుతోంది. రెండు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా కొబ్బరి ధర రోజురోజుకూ పెరిగి రైతులకు కాసుల వర్షం కురిసింది. వెయ్యి కాయలు రూ.25 వేలకుపైనే ధర పెరగడంతో అటు రైతులు ఒక్కసారిగా తమ ఆనందం వ్యక్తం చేసి ఎంతో సంతోషించారు.

కొబ్బరి దోబూచులాట..!

మొన్నటి వరకు చెట్టెక్కిన ధరలు

వెయ్యి కాయలు రూ.20 వేల నుంచి 15 వేలకు పతనం

నిల్వలు పెట్టిన రైతులు, వ్యాపారుల గగ్గోలు

ఆచంట, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి):కొబ్బరి ధర కూడా బంగారం, వెండిలానే దోబూచులాడుతోంది. రెండు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా కొబ్బరి ధర రోజురోజుకూ పెరిగి రైతులకు కాసుల వర్షం కురిసింది. వెయ్యి కాయలు రూ.25 వేలకుపైనే ధర పెరగడంతో అటు రైతులు ఒక్కసారిగా తమ ఆనందం వ్యక్తం చేసి ఎంతో సంతోషించారు. ధర పెరగడంతో వ్యాపారస్థుల్లోను తమ వ్యాపారం బాగుందని సంతోషపడ్డారు. కాని, అంతలోనే ధర ఒక్కసారిగా రూ.10 వేలకు పడిపోవడంతో డీలాపడ్డారు. లక్షల్లో నిల్వ పెట్టిన వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు దిగాలు చెందారు. ఇటీవల కాలంలో మళ్లీ రూ.18 వేల నుంచి రూ.20 వేలు పలకడంతో కాస్త కోలుకున్నారు. రెండు రోజులుగా ధర మళ్లీ పతనమైంది. రూ.14 వేల నుంచి 15 వేలు పలుకుతోంది. రెండు రోజుల్లో ఐదు వేల రూపాయలు తగ్గడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. కొబ్బరి వ్యాపారస్థులు కొబ్బరి మార్కెట్‌ ధరను చూసి నిల్వ చేయాలా వద్దా అనే ఆలోచనలో పడుతున్నారు. తమిళనాడులో ఇటీవల కాలంలో కొబ్బరి ఎక్కువగా ఉండటంతో కొబ్బరి ధర పతనానికి కారణమని పలువురు వ్యాపారస్థులు చెబుతున్నారు. తమిళనాడు కొబ్బరి క్వాలిటీ కూడా బాగుందని చెబుతున్నారు. ఇదే రాష్ట్రంలో కొబ్బరి ధర పతనానికి కారణమని చెబుతున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:10 AM