Share News

కొబ్బరికి దెబ్బ

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:28 AM

కొబ్బరి ధర పతనమైంది. తమిళనాడు నుంచి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతితో పాటు, పండగలు లేక పోవడం దీనికి ప్రధాన కారణంగా వ్యాపా రులు చెబుతున్నారు.

కొబ్బరికి దెబ్బ

ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి

పతనమైన కాయల ధర

బయట మార్కెట్‌లో ఎక్కువ ధరకే

విక్రయిస్తున్న వ్యాపారులు

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కొబ్బరి ధర పతనమైంది. తమిళనాడు నుంచి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతితో పాటు, పండగలు లేక పోవడం దీనికి ప్రధాన కారణంగా వ్యాపా రులు చెబుతున్నారు. నిలువ చేసిన కొబ్బరి కాయలకు పాడైపోవ డంతో అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో రైతుల వద్ద నుంచి కొనుగోళ్లు ఆగిపోయాయి. ఇప్పుడు 1000 కొబ్బరికాయలు సైజును బట్టి 8 వేల నుంచి రూ.16 వేల మధ్య విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో 1000 కాయలు రూ. 18 వేలు నుంచి 24 వేలు వరకు హోల్‌సేల్‌గా కొనుగోలు చేశారు. వాటిని రిటైల్‌గా కాయి రూ.25 నుంచి 30 వరకు విక్రయించే వారు. హోల్‌సేల్‌గా ధర పడినా రిటైల్‌గా వ్యాపారులు ధర తగ్గించడం లేదు. కొబ్బరి కాయ సైజ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30 అమ్ముతున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ..

కొబ్బరి సాగు విస్తీర్ణం పాత ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ. రాష్ట్ర మొత్తం సాగులో ఈ రెండు జిల్లాలో 50 శాతం సాగు ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట, కొత్తపేట, బొబ్బర్లంక, కటారిలంక, ఊడిమూడి, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, యలమంచిలి, ఖండవల్లి, పెరవలి, మెట్టుప్పరగూడెం, అమృతపురం, కడియద్ద, దెందులూరు, పెదవేగి. ద్వారకాతిరుమల మండలాల్లో సాగు ఎక్కువగా ఉంది.

తమిళనాడు నుంచి దిగుమతి

ఇక్కడ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా తమిళ నాడు నుంచి దిగుమతి పెరిగింది. దీంతో ధరలు పడిపోయాయి. దీనికి తోడు ఇప్పుడు పండగులు కూడా లేకపోవడంతో ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వివాహాది శుభ కార్యక్రమాలకు తక్కువ శాతం మాత్రమే విని యోగం అవుతుందని, అది కాకుండా పండుగల సమయంలో వినియోగం ఎక్కువ అని చెబు తున్నారు. ఇలాంటి సమయంలో రైతుకు గిట్టుబాటు కాకపోయిన అమ్ముకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. అయితే కురిడీ కొబ్బరి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఇవి 1000 రూ.28 వేలకు విక్రయిస్తున్నారు. దీన్ని ఎక్కువగా కొబ్బరి నూనెకు వినియోగిస్తుంటారు.

మహారాష్ట్రలోనూ ధర పతనం

మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ రాష్ర్టాలో కూడా మన కొబ్బరికి డిమాండ్‌ లేదు. అక్కడ వారు 1000 కొబ్బరి కాయలు హోల్‌సేల్‌గా రూ.14 వేలు మించి కొనుగోలు చేయడం లేదు. మహారాష్ట్రలోని సోలాపూర్‌, బసవగుళ్ల ప్రాంతాలకు ఇక్కడ నుంచే ఎగుమతి అవుతుంటుంది. చత్తీస్‌గడ్‌ వ్యాపారులు కూడా ఇదే ధరకు అడగడంతో రైతుల వద్ద నుంచి తక్కువకు కొనుగోలు చేయాల్సి వస్తుంది.

మంచు, చలికి కుళ్లుతున్న కొబ్బరి

వీరవల్లి శివ, గంగాధర కోకోనట్‌, అత్తిలి

మంచు, చలికి కొబ్బరి నిలువకు ఆగడం లేదు. గతంలో డిమాండ్‌ ఉందని పచ్చికాయలను కొనుగోలు చేసి నిలువ చేశాం. ఇప్పడు కొబ్బరి కుళ్లిపోయే అవకాశం ఉంది. దీంతో అయినకాడికి అమ్మేయాల్సి వస్తుంది. ఏప్రిల్‌ మాసం తరువాత మాత్రమే కొబ్బరి నిలువకు ఆగుతుంది. కొబ్బరి వ్యాపారం కూడా నష్టాల బాటలో నడుస్తున్నది

Updated Date - Feb 21 , 2026 | 12:28 AM