పెదవేగిలో కోకో సిటీ
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:24 AM
జిల్లా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కోకో సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం యంత్రాంగం చర్యలు చేపట్టింది.
రామసింగవరం భూముల్లో ఏర్పాటుకు చర్యలు
కనీసం 200 ఎకరాల సేకరణకు ప్రణాళిక
రైతులతో కలెక్టర్, ఎమ్మెల్యే చర్చలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కోకో సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం యంత్రాంగం చర్యలు చేపట్టింది. పెదవేగి పరిసరాల్లో కోకో సిటీ ఏర్పాటుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవ చూపుతున్నారు. కొద్ది నెలల క్రితం ఏలూరు సమీపంలో కోకో కాంక్లైన్ జరిగింది. రైతులు, పరిశ్రమలు స్థాపించే వారితో రాష్ట్రస్థాయి సదస్సు మార్గదర్శకంగా నిలి చింది. ఈ నేపథ్యంలో కోకో సిటీ ఏర్పాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సుముఖంగా ఉన్నారు. 500 ఎకరాల్లో కోకో సీటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్లు సదస్సులో దీనిపై చంద్రబాబు ఆరా తీశారు. రామసింగవరంలో అటవీ భూములు 176 ఎకరాల్లో ఏర్పాటుపై చర్చ సాగింది. 1948 రెవెన్యూ రికార్డుల పరంగా గయ్యాళి భూమిగా న మోదైందని, ఇది కాకపోతే అప్పట్లో జమ చేసిన 15 కోట్ల మొత్తాన్ని తమకు ఇప్పిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి కూడా సీఎంకు వివరించారు. రిజర్వ్ ఫారెస్టు భూమిని రెవెన్యూకు బదలాయింపు కూడా చేయాలని యోచిస్తున్నారు.
ప్రైవేట్ భూముల్లో ఏర్పాటుపై ఆసక్తి?
పెదవేగిలో కనీసం 200 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటుచేసి రైతుల పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ యోచిస్తున్నారు. రైతులతో చర్చలు జరిపి ప్రైవేట్ భూముల్లో ఏర్పాటుకు కూడా పరిశీలిస్తున్నారు. పెదవేగి రామసింగవరం లేదా పరిసర గ్రామాల్లో భూముల సేకరణపైన రెవెన్యూ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి.
8 మండలాలు.. 45వేల ఎకరాల్లో సాగు..
ఏలూరు జిల్లాలో 45 వేల ఎకరాల్లో కోకో పంట సాగు చేస్తున్నారు. ప్రధానంగా పెదవేగి, లింగపాలెం, ద్వారకాతిరుమల, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, దెందులూరు, చింతలపూడి మండలాల్లో కోకో సాగుచేస్తున్నారు. ఏలూరులో ఒక కంపెనీ కిలో రూ.300, మరికొన్ని కంపెనీలు మరింత తక్కువ కొనుగోలు చేస్తున్నారు.
చాక్లెట్ తయారీ పరిశ్రమలకు అనుకూలం
కోకో సిటీ ఏర్పాటుతో రైతులకు ప్రయోజనంతో పాటు చాక్లెట్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం కానుంది. గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. కోకో గింజల ప్రాసెస్ యూనిట్లు, చాక్లెట్ పరిశ్రమల తో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.