Share News

వారంలోగా కోకో ధరల పాలసీ ప్రకటించాలి

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:09 AM

‘వారం రోజుల్లోగా కోకో ధరల నిర్ణయ కమిటీని సమావేశపర్చి కోకో గింజల ధరను నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలి.

వారంలోగా కోకో ధరల పాలసీ ప్రకటించాలి
నిరసన తెలుపుతున్న కోకో రైతులు

కోకో రైతుల హెచ్చరిక

విజయరాయిలో నిరసన సదస్సు

పెదవేగి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘వారం రోజుల్లోగా కోకో ధరల నిర్ణయ కమిటీని సమావేశపర్చి కోకో గింజల ధరను నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలి. ఆయిల్‌పామ్‌ గెలల ధర నిర్ణయం మాదిరిగానే కోకో గింజల ధరలను నిర్ణయించాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా’మని ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతుల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం పెదవేగి మండలం విజయరాయిలో ఆదివారం నిర్వహించారు. కోకో ధరల పాలసీని ప్రకటించక పోవడంపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కోకో ధరల పాలసీపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం, ధరల పాలసీ ప్రకటనపై తాత్సారం చేస్తుండడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు తగ్గాయనే నెపంతో కోకో గింజల ధరను కిలో రూ.400 నుంచి రూ.380లకు, తాజాగా రూ.350లకు తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్టుబడి వ్యయం, కౌలు ధరలతో పోల్చితే గింజల ధర కిలో రూ.500 కంటే తక్కువ ఉంటే గిట్టుబాటు కాదన్నారు. కోకో ధరల నిర్ణయ కమిటీలో కొనుగోలు సంస్థల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించి వారితోనే చర్చిండడం తగదని, కోకో సంఘం ప్రతినిధులకు కూడా ప్రాతి నిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, ప్రధాన సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతు సంఘం నాయకులు పాలడుగు నరసింహారావు, కోనేరు సతీష్‌బాబు, ఆలపాటి శ్రీని వాసరావు, మోరంపూడి సుబ్రహ్మణ్యం, పానుగంటి సుధాకర్‌, ఎస్‌ఆర్‌కేజీ. చౌదరి, పోలిన అప్పారావు, చేకూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:09 AM